సీబీఐ విచారణకు సిద్ధం!  | Prabhakar Rao says that he is Ready for CBI investigation | Sakshi
Sakshi News home page

సీబీఐ విచారణకు సిద్ధం! 

Published Sat, Aug 24 2019 2:42 AM | Last Updated on Sat, Aug 24 2019 2:42 AM

Prabhakar Rao says that he is Ready for CBI investigation  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ చేసిన ఆరోపణలను ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. తెలంగాణ విద్యుత్‌ సంస్థలు పూర్తి పారదర్శకంగా, అవినీతి రహితంగా, పూర్తి విలువలతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జీతోనే కాదు సీబీఐ విచారణకు సైతం సిద్ధమని పేర్కొన్నారు. విద్యుత్‌సౌధలో శుక్రవారం ప్రభాకర్‌రావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి లక్ష్మణ్‌ పేరు ప్రస్తావించకుండానే ఆయన ఆరోపణలకు బదులిచ్చారు. సమాచారలోపంతో సరైన అవగాహనలేకనే ఈ ఆరోపణలు చేశారన్నారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనీ్టపీసీ రూ.4.30కు యూనిట్‌ చొప్పున సౌర విద్యుత్‌ ఇచ్చేందుకు ముందుకు వచ్చిందనడం పూర్తిగా సత్యదూరమన్నారు. ఎనీ్టపీసీ 400 మెగావాట్ల విద్యుత్‌ ఇచ్చేందుకు అంగీకరించిందని, ఒప్పందం ద్వారా రూ.4.61 నుంచి రూ.5.19 ధరతో కొనుగోలు చేస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు కేవలం 71 మెగావాట్ల సౌరవిద్యుత్‌ స్థాపిత సామర్థ్యం కలిగి ఉన్నామని, ఇప్పుడు 3,600 మెగావాట్లకు పెంచామన్నారు.  

సౌరవిద్యుత్‌ను నిర్లక్ష్యం చేయలేదు... 
సౌరవిద్యుత్‌ను నిర్లక్ష్యం చేసినట్లు విమర్శించడం సరికాదని, మన సౌర విద్యుత్‌ విధా నం యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఎన్నో ప్రశంసలు, పుర స్కారాలు అందుకుందని ప్రభాకర్‌రావు తెలిపారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 7,778 మెగావాట్ల మాత్రమే ఉన్న స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని 16,200 మెగావాట్లకు పెంచామన్నారు. 14 వేల మెగావాట్ల ట్రాన్స్‌మిషన్‌ సామర్థ్యాన్ని రూ.23 వేల కోట్ల ఖర్చుతో 31 వేల మెగావాట్లకు పెంచామన్నారు.  

ఎంవోయూ ఆధారంగానే పీపీఏ 
ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం ఎంవోయూ చేసుకుందని, దీని ఆధారంగా రెండు రాష్ట్రాల విద్యుత్‌ సంస్థలు పీపీఏ చేసుకున్నాయని ప్రభాకర్‌రావు చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి రూ. 3.90 పైసలకు యూనిట్‌ చొప్పున విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నామన్నారు. విద్యుత్‌ సంస్థల ఆర్థికస్థితి బాగా లేదని, రేటింగ్‌ పడిపోయిందని అనడం సరికాదని, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు అత్యుత్తమమైన ‘ఏ+’రేటింగ్‌ ఇచి్చందన్నారు. విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం ఇండియా బుల్స్‌ సంస్థతో ఒప్పందం చేసున్నట్లు చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు.  విద్యుత్‌ సంస్థలు స్వయంప్రతిపత్తితో పనిచేస్తాయనీ, తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని సీఎండీ అన్నారు.  సీఎం కేసీఆర్‌ కృషితోనే సౌత్, నార్త్‌ కనెక్టివిటీ గ్రిడ్‌ సాధ్యమైందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విద్యుత్‌ సంస్థకు అనేక ప్రశంసలు వస్తున్నాయని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement