పదోన్నతి చిహ్నం పెడుతున్న డీఐజీ ప్రమోద్ కుమార్
ఆదిలాబాద్: డీసీఆర్‌బీ ఎస్సై జి.కిష్టయ్య బుధవారం పదవీ విరమణ పొందుతున్న తరుణంలో ఆయన ఒకరోజు ముందు సీఐగా పదోన్నతి పొందారు. మంగళవారం స్థానిక పోలీసు కార్యాలయంలో కరీంనగర్ డీఐజీ పి.ప్రమోద్‌కుమార్ పదోన్నతి చిహ్నం(స్టార్)ను కిష్టయ్య భుజానికి అలంకరించారు. ఆదిలాబాద్ మండలం చాందా–టి గ్రామానికి చెందిన కిష్టయ్య 1979లో సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికై సుధీర్ఘకాలంపాటు సేవలు అందించారు. 1986లో హెడ్‌కానిస్టేబుల్‌గా, 1996లో ఏఎస్సైగా పదోన్నతి లభించడంతో జన్నారం, ఇంద్రవెల్లి పోలీసుస్టేషన్లలో విధులు నిర్వర్తించారు.
2010 ఎస్సై పరీక్షలో ఉత్తీర్ణత సాధించి అప్పటి నుంచి ఎస్సైగా కొనసాగుతున్నారు. ఎస్సైగానే పదవీ విరమణ పొందుతానని ఆనుకున్న సమయంలో ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ విషయం తెలుసుకొని నేరుగా రాష్ట్ర పోలీసు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకురావడంతో వెంటనే సీఐగా పదోన్నతులు ఉత్తర్వులు జారీ చేశారు. డీఐజీ చేతుల మీదుగా పదోన్నతి ఉత్తర్వులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ విష్ణు వారియర్‌తోపాటు కుమురం భీం ఎస్పీ సింగెనేవార్ కల్మేశ్వర్, నిర్మల్ అదనపు ఎస్పీ దక్షణమూర్తి, డీసీఆర్‌బీ సీఐ శ్రీనివాస్, పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఎస్బీ డీఎస్పీ విశ్వప్రసాద్, సీసీ దుర్గం శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment