‘నయీం బ్యాచ్‌తో నా భర్తను హత్య చేయించారు’ | Pranay Wife Amruta Says Her Father Planned To Murder Pranay | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 15 2018 2:20 PM | Last Updated on Sat, Sep 15 2018 2:30 PM

Pranay Wife Amruta Says Her Father Planned To Murder Pranay - Sakshi

సాక్షి, మిర్యాలగూడ : రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన పరువు హత్య కేసులో మృతుడు ప్రణయ్‌ భార్య అమృత మీడియాకు సంచలన విషయాలు వెల్లడించారు. తన తండ్రి, బాబాయ్‌లే నయీం బ్యాచ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించారని ఆమె ఆరోపించారు. తన భర్తను పొట్టబెట్టుకున్న పుట్టింటివైపు వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. ప్రణయ్‌ హత్య జరగగానే తండ్రికి ఫోన్‌ చేశానని, తన మాటలు వినపడటం లేదంటూ ఆయన ఫోన్‌ కట్‌ చేశారని అమృత తెలిపారు. తర్వాత మళ్లీ ఫోన్‌ చేసి.. ప్రణయ్‌ ఆస్పత్రిలో ఉన్నాడని చెబితే తనని అక్కడికి వెళ్లమని చెప్పాడని పేర్కొన్నారు. తాను, ప్రణయ్‌, ప్రణయ్‌ వాళ్ల అమ్మ ఆస్పత్రికి వెళ్లామని.. బయటికి వచ్చిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తి తన భర్తపై దాడి చేసి చంపేశాడని తెలిపారు. ఈ విషయం గురించి డీఎస్పీకి ఫోన్‌ చేసినా ఆయన స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బాబాయ్‌ డంబెల్‌తో కొట్టేవారు..
ప్రణయ్‌ తాను చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నామని చెప్పిన అమృత.. భర్త అంటే తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. ప్రణయ్‌ను ప్రేమిస్తునాన్నని తెలుసుకున్న బాబాయ్‌ తనను డంబెల్‌తో కొడుతూ.. కిందపడేసి తన్నేవాడని తెలిపారు. ప్రణయ్‌తో మాట్లాడితే తనను చంపేస్తానని తండ్రి బెదిరించేవాడని అమృత గుర్తు చేసుకున్నారు. తన భర్తను చంపేస్తేనైనా పుట్టింటికి వెళ్తానని భావించారని.. కానీ ఎప్పటికీ అలా జరగదని విలపించారు.

గర్భవతినని అమ్మకు చెప్పొద్దన్నాడు..
తాను ప్రస్తుతం ఐదు నెలల గర్భవతినని అమృత తెలిపారు. ఈ విషయం గురించి నాన్నకు చెబితే.. అమ్మకు తెలీనివ్వకూడదంటూ తనను బెదిరించారన్నారు. అబార్షన్‌ చేయించుకోవాలని ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. కానీ రెండు నెలల క్రితమే తన తల్లికి ఈ విషయం చెప్పానని అప్పటి నుంచి అప్పుడప్పుడూ ఆమె ఫోన్‌లో మాట్లాడుతుండేదని అమృత తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement