
సాక్షి, మిర్యాలగూడ : అమృత ప్రణయ్‌ల ప్రణయ గాథ విషాదం పలువుర్ని కలచివేస్తోంది. పథకం ప్రకారం అమృత తండ్రి, ఆమె బాబాయి కలిసి ఆమె భర్తను అత్యంత పాశవికంగా హత్య చేయించడం కలకలం రేపింది. పరువు కోసం పగబట్టిన తండ్రి అనుక్షణం నిఘాపెట్టి, చివరికి అన్నంత పనిచేశాడు. ప్రేమిస్తే తప్పా.. అంటూ ఆసుపత్రిలో గుండెలవిసేలా రోదిస్తున్న అమృత వర్షిణి వేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ హత‍్యకేసులో అనేక కీలకమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
ఫేస్‌బుక్‌లో అమృత పోస్ట్ చేసిన వీడియోనే హత్యకు ఉసిగొల్పి ఉంటుందని ప్రణయ్ బంధువు ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెళ్లి తరువాత అమృత ఫేస్‌బుక్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇది చూసిన ఆమె తండ్రి మారుతీరావు నీ పెళ్లి వీడియో కంటే.. ప్రణయ్‌ను హత్య చేసిన వీడియోకే ఎక్కువ హిట్స్ వస్తాయంటూ అమృతను హెచ్చరించాడని ఆమె ఆరోపించారు.
మొదట తాము కూడా పెళ్లికి నిరాకరించామని, అయితే ప్రణయ్ లేకపోతే చచ్చిపోతానని అమృత స్పష్టం చేయడంతో పెళ్లికి ఒప్పుకున్నామని ప్రణయ్ కుటుంబ సభ్యులు చెప్పారు. అలాగే అమృత తల్లికాబోతోందని తెలిసి ఆగస్ట్ 17న రిసెప్షన్ నిర్వహించినట్టు తెలిపారు. తాము భయపడినట్టుగానే ఎంతో ధైర్యవంతుడైన తమ కొడుకుని పొట్టనపెట్టుకున్నారని కన్నీరు మున్నీరవుతున్నారు. డబ్బు, రాజకీయ పలుకుబడితో కిరాయి హంతకులతో ఈ పని చేయించారని ఆరోపించారు. అగ్రకుల అహంకారంతో పథకం ప్రకారం నమ్మించి, గొంతుకోసారని కులసంఘాలు ఆరోపిస్తున్నాయి. కులాంతర వివాహం చేసుకున్న కారణంగా ఈ హత్యకు పాల్పడ్డారని మండిపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment