సాక్షి, మహబూబ్‌నగర్ : సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు జిల్లాకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీష్‌రావు వ్యాఖ్యానించారు. జిల్లాలో వచ్చే ఖరీఫ్ నాటికి (జూన్‌లో) ఎత్తిపోతల పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బుధవారం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు ప్రాజెక్టుల పనులను స్వయంగా పరిశీలించి అధికారులతో చర్చించారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు సంబంధించి మొదటి లిప్టు ద్వారా పంపు చేసి నింపిన సింగోటం రిజర్వాయర్‌ను పరిశీలించారు.
అలాగే రెండో లిఫ్ట్ అయిన జొన్నలబొగడ, మూడో లిఫ్ట్ అయిన గుడిపల్లిగట్టు దగ్గర జరుగుతున్న పనులు పరిశీలించారు. అధికారులు, కాంట్రాక్టర్లను పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సింగోటం రిజర్వాయర్‌ను పరిశీలించిన తర్వాత రంగసముద్రాన్ని పరిశీలించారు. అనంతరం నెట్టెంపాడు ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. ఆ తర్వాత ఆయన సాయంత్రం గద్వాలలో విలేకరులతో మాట్లాడారు. ఈ జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. అందుకే జిల్లాలోని ఇరిగేషన్‌కు సంబంధించి రూ.340 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
సీఎం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రతిపాదిక ఆయకట్టుకు వచ్చే ఖరీప్ నుంచి కచ్చితంగా నీళ్లు ఇచ్చేందుకు కృషిచేస్తున్నామన్నారు. అందులో భాగంగానే తానే స్వయంగా ప్రాజెక్టుల పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. మిషన్ కాకతీయలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాకు అత్యంత ప్రాధాన్యం లభించనుందన్నారు. జిల్లాలోని మొత్తం 7,500 చెరువులకు గాను ప్రతీ ఏడాది పదిహేను వందల చెరువులకు మరమ్మత్తులు చేయనున్నట్లు తెలిపారు. వ్యవసాయానికి పనికిరాని భూములను తాము ఇప్పటికే గుర్తించామని, అక్కడ పరిశ్రమలు స్థాపించి జిల్లాను అభివృద్ధిపథాన నడిపిస్తామన్నారు.
వాళ్లు చేసింది సున్నా...
కాంగ్రెస్ హయాంలో పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగిందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రాజెక్టుల పనులకు సంబంధించి కేవలం మట్టిపనులు మాత్రమే చేశారని, కీలక పనులన్నీ అలాగే వదిలేశారని వివరించారు. భూసేకరణ, రైల్వే నిర్మాణాలకు సంబంధించి ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం డీపీఆర్ కోసం కనీసం డబ్బులు కూడా మంజూరు చేయించలేకపోయారన్నారు.
తమ ప్రభుత్వమే పాలమూరు ఎత్తిపోతల పథకానికి డీపీఆర్‌కు నిధులు మంజూరు చేయడమే కాదు... మొదటి దశ పనుల కోసం రూ.16వేల కోట్లు అంచనా కూడా వేసిందన్నారు. పాలమూరు ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం చేత జిల్లాలో భూసేకరణ కోసం ప్రత్యేక కలెక్టర్ వనజను నియమించామన్నారు. అలాగే ఈ రోజు తనతో పాటు ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ మాణిక్‌రాజును వెంటబెట్టుకొని ప్రాధాన్యతను వివరించామన్నారు. కొన్నిచోట్ల కాల్వల్లో నీళ్లు ఉండటం చేత పనులకు ఆటంకం కలుగుతోందని... ఈ నాలుగు నెలలు అత్యంత కీలకం కావడంతో వాటిని నిలిపేసి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.
కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తాం.
జిల్లా అభివృద్ధి కోరుకుంటున్నందున కొన్ని విషయాల్లో తాము కఠినంగా వ్యవహరించకతప్పదన్నారు. ప్రాజెక్టులకు సంబంధించి ఆర్‌అండ్‌ఆర్ కాలనీల్లో రాత్రికి రాత్రే ఇళ్లు, పశువుల కొట్టాలు వెలుస్తున్నాయన్నారు. కొన్నిచోట్ల డబ్బులు తీసుకొని కూడా ఖాళీ చేయడం లేదని ఇలాంటి వాటి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. మంత్రి హరీష్‌రావు వెంట పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, గద్వాల నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తదితరులున్నారు.
పాలమూరుకే ప్రాధాన్యం
Published Thu, Feb 5 2015 2:40 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement