సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ కొందరు తమ వీధుల్లోకి వస్తుండటాన్ని కాలనీవాసులే అడ్డుకునేందుకు నడుం బిగించారు. ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా, బాధ్యత లేని కొందరు అదే పనిగా రోడ్లపైకి వెళ్తున్నారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జనంలో భయం క్రమంగా పెరుగుతోంది. తాము లాక్‌డౌన్‌ను పాటిస్తూ ఇళ్లకే పరిమితమవుతున్నా, వేరే ప్రాంతాలకు చెందిన వారు తమ కాలనీల్లో రాకపోకలు సాగిస్తుండటంతో వైరస్ తమ ప్రాంతాలకు వస్తుందనేది వారి భయం.
ప్రధాన రహదారులపై పోలీసు తనిఖీలు ఉంటుండటంతో కాలనీల్లోని అంతర్గత రోడ్ల మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. దీన్ని నియంత్రించాలంటూ చాలామంది పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. 100కు డయల్ చేసి వీటిపై ఫిర్యాదు చేస్తున్నారు. కానీ అన్ని ప్రాంతాల్లో రోడ్లను మూసేయటం సాధ్యం కాకపోవడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. దీంతో సొంతంగానే రోడ్లను మూసేసుకోవాలని నిర్ణయించారు. గత రెండు రోజులుగా ఈ తరహా ఏర్పాట్లు ఎక్కువయ్యాయి.
గ్రామాల తరహాలో..
కరోనా వైరస్ కేసులు నమోదైన తొలినాళ్లలో గ్రామాల్లో రోడ్లను గ్రామస్తులే సొంతంగా దిగ్బంధనం చేసుకున్నారు. బయటివారు గ్రామాల్లోకి రాకుంటే వైరస్ వచ్చే అవకాశమే లేదని, పొలిమేరల్లో రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని గ్రామాల్లో రోడ్లపై కందకాలు తవ్వారు. ఇప్పుడు నగరాల్లోని పలు కాలనీలు, బస్తీల వాసులు గ్రామాల తీరును ఆదర్శంగా తీసుకుని సొంతంగా బారికేడ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటి ఏర్పాటు తర్వాత జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించకుండా ఉండేందుకు.. కొందరు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చి అనుమతి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గాలున్న చోట్ల, ఈ స్వీయ బారికేడింగ్‌కు జీహెచ్‌ఎంసీ కూడా అభ్యంతరం తెలపట్లేదు.
ప్రస్తుతం లాక్‌డౌన్ సందర్భంగా స్థానికులు 3 కిలోమీటర్లకు మించి దూరం ప్రయాణించేందుకు వీల్లేదని ప్రభుత్వం నిబంధన విధించిన సంగతి తెలిసిందే. కానీ కొందరు దీన్ని పట్టించుకోకుండా అంతర్గత రోడ్ల సాయంతో ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇప్పుడు కాలనీలు, బస్తీల్లో రోడ్లపై కర్రలతో బారికేడ్లు ఏర్పాటు చేయటంతో వారికి అడ్డుగా ఉంది. ఓ రకంగా ఇది లాక్‌డౌన్ స్ఫూర్తికి అనుకూలంగానే మారటంతో అధికారులు కూడా ఏమీ అనట్లేదు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంకు, ఆసిఫ్‌నగర్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇటీవలే సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్ ప్రాంతాల్లో కూడా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ఆ ప్రాంతాల్లోని కాలనీల్లో కూడా బారికేడ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు.
మెహిదీపట్నం
ఇది మెహిదీపట్నం ఎన్‌ఎండీసీ రోడ్డు నుంచి ఆసిఫ్‌నగర్ వైపు వెళ్లే దారిలో ఓ కాలనీ వాసులు ఏర్పాటు చేసుకున్న కర్రల బారికేడ్లు. బయటి వ్యక్తులు కాలనీలోకి రాకుండా ఇలా అడ్డుకట్ట వేసుకున్నారు.
మాసబ్‌ట్యాంకులోని ఇందిరానగర్ కాలనీ సమీపంలో..
ఇటీవలే ఇక్కడ కరోనా పాజిటివ్ కేసు నమోదు కావటంతో అధికారులు ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా మార్చారు. దీంతో అటువైపు దారితీసే అన్ని రోడ్లకు బారికేడ్లు ఏర్పాటు చేసి లోనివారు బయటకు, బయటివారు లోనికి వెళ్లకుండా కట్టడి చేశారు. దీంతో వాహనదారులు సమీపంలోని విజయనగర్‌కాలనీ రోడ్డులోకి వెళ్లటంతో ఆ ప్రాంతవాసుల్లో ఆందోళన మొదలైంది. ఇళ్లలో వృద్ధులు ఉండటంతో భయంతో ఆ రోడ్డును కర్రల సాయంతో మూసేశారు. ఇందుకోసం స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారి దృష్టికి తీసుకెళ్లి అనుమతి కోరటం విశేషం.
మా ఇళ్లముందు తిరుగుతారా?
‘మా ఇంట్లో 80 ఏళ్ల వృద్ధులున్నారు. వారు కరోనా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండా ల్సి ఉంటుంది. మేం లాక్‌డౌన్‌ను పాటిస్తూ ఇళ్లలో ఉంటుంటే, వేరే ప్రాంతాల నుంచి జనం మా ఇళ్ల ముందు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. అందుకే మా ప్రాంతంలోని వారంతా మాట్లాడుకుని రోడ్డును మూసేశాం’ – ప్రభాకర్, విజయనగర్ కాలనీ
రోడ్డుపై ఉమ్ముతున్నారు..
‘మాకు సమీపంలో కంటైన్మెంట్ జోన్ ఉంది. అటు రోడ్లను ప్రభుత్వమే మూసేసింది. దీంతో జనం మా బస్తీ రోడ్లను వాడుతున్నారు. ఒక్కోసారి ఇరుకు రోడ్డు రద్దీగా మారుతోంది. ఈ రోడ్డు మీదుగా వెళ్లే జనం ఉమ్ముతున్నారు. ఇవన్నీ మాకు ఇబ్బందిగా మారింది. అందుకే రోడ్డుపై కర్రలు అడ్డుపెట్టి వాహనాల రాకపోకలను అడ్డుకుంటున్నాం’ – రవీందర్, హుమాయూన్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment