పత్తి మార్కెట్‌లో ధర దగా | price in cotton market | Sakshi
Sakshi News home page

పత్తి మార్కెట్‌లో ధర దగా

Published Tue, Jul 1 2014 2:13 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

పత్తి మార్కెట్‌లో ధర దగా - Sakshi

పత్తి మార్కెట్‌లో ధర దగా

క్వింటాల్‌కు రూ.500 కోత
- అధికారులను నిలదీసిన రైతులు
- ఒక్కరోజే రూ.2.50లక్షల దోపిడీ

 జమ్మికుంట: పత్తి ధరల్లో వ్యాపారుల దగాకోరుతనం ఆగడంలేదు. గరిష్ట ధర చెల్లిస్తామని చెప్పి కనిష్ట ధర కూడా పెట్టక రైతులను నిలువునా ముంచుతున్నారు. అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు. సోమవారం ఇక్కడి వ్యవసాయ మార్కెట్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా వరంగల్ జిల్లా నుంచి రైతులు దాదాపు రెండు వేల బస్తాల్లో పత్తిని అమ్మకానికి తెచ్చారు. సుమారు వంద వాహనాల్లో లూజ్ పత్తి తెచ్చారు. బస్తాల్లో వచ్చిన పత్తికి వ్యాపారులు పోటీ పడి జెండా పాటలో క్వింటాల్‌కు రూ.5వేలు గరిష్ట ధర పలికారు.

లూజ్ పత్తికి రూ.5180 ధర పెట్టారు. మార్కెటింగ్ శాఖ అధికారులు బస్తాల్లో వచ్చిన పత్తికి క్వింటాల్‌కు రూ.5వేలు ధర పలికిందని వెల్లడించడంతో రైతులు ఒక్కసారిగా బిత్తరపోయారు. మార్కెట్లో ఎక్కడా రైతులకు రూ.5వేల ధర రాలేదని, కేవలం రూ.4350 నుంచి రూ.4500 వరకే  ధరలు చెల్లించారని వందలాది మంది రైతులు  అసిస్టెంట్ కార్యదర్శికి చెప్పారు.  వ్యాపారులు అధిక ధరలు చెల్లిస్తున్నామని చెబుతూ రైతులను మోసం చేస్తున్నా పట్టించుకోవడంలేదెందుకని ఆయనను నిలదీశారు.

చెల్లించే ధరలు ఒకలా ఉంటే అధికారులు ప్రకటించే ధరలు మరోలా ఉన్నాయని మండి పడ్డారు. అందరూ కలిసి రైతులను ముంచుతున్నారన్నారు.  రైతుల పక్షాన నిలువాల్సిన అధికారులు వ్యాపారులకు కొమ్ముకాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఒక్క రోజే దాదాపు 500 క్వింటాళ్ల పత్తికి రూ.4500 ధర చెల్లించి రూ.2.50 లక్షల దోపిడీ చేశారన్నారు. మార్కెట్లో జెండా పాట ఒకటి, చెల్లించే ధర మరొకటి ఉన్నా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. 17 బస్తాల పత్తి తీసుకువస్తే రూ.5వేలు ధర పెట్టి, రూ.4500 ఇచ్చారని వరంగల్ జిల్లా రాఘవరెడ్డిపేటకు చెందిన జగదీశ్ వాపోయాడు.
 
ఎడ్లబండ్ల కార్మికుల ఆందోళనతో నిలిచిన కొనుగోళ్లు
మార్కెట్‌కు లూజ్ పత్తి వస్తుండడంతో తమకు పని లేకుండా పోతోందని ఎడ్లబండ్ల కార్మికులు విధులు బహిష్కరించడంతో పత్తి కొనుగోళ్లు ఐదు గంటల పాటు నిలిచిపోయాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి ఎండలో అరిగోస పడుతున్నా పట్టించుకోవడం లేదని మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ కార్యదర్శి విజయ్‌కుమార్‌ను నిలదీశారు. ధరల నిర్ణయం అనంతరం మార్కెట్‌కు వాహనాల్లో లూజ్ పత్తి వస్తుండడంతో తమ ఉపాధిపై దెబ్బ పడుతుందని పత్తి రవాణా చేసే ఎడ్ల బండ్ల కార్మికులు నిరసనకు దిగారు.

దీంతో బస్తాల్లో వచ్చిన పత్తి తూకాలు నిలిచి పోయాయి. మధ్యాహ్నం ఒంటి గంట కావస్తున్నా తూకం వేయకపోవడంతో రైతులు విసుగెత్తిపోయారు. సహనం కోల్పోయి అసిస్టెంట్ కార్యదర్శి వద్దకు వెళ్లి నిలదీశారు. తాను కార్మికులతో మాట్లాడుతున్నానని, వెంటనే తూకం వేయిస్తానని సముదాయించినా రైతులు వినిపించుకోలేదు. మార్కెట్‌కు సెలవు ప్రకటించి కార్మికుల సమస్యలపై చర్చించుకోవాలి గానీ రైతులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ఐదు గంటలు నిరీక్షించిన అనంతరం అధికారులు సాయంత్రం పత్తిని తూకం వేయించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement