సాక్షి,హైదరాబాద్: కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్లతో పాటుగా ఆర్‌టీ – పీసీఆర్ (కోవిడ్ టెస్టింగ్ కిట్ల) ధరలు భారీగా తగ్గాయి. లాక్‌డౌన్ ముందు వరకు దేశంలో అసలు ఈ కిట్ల ఉత్పత్తేలేని పరిస్థితి నుంచి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వీటి ఉత్పత్తిలో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. దీంతో పీపీఈ కిట్లతో పాటుగా కోవిడ్ టెస్టింగ్ కిట్ల ధరలు సుమారు 70%వరకు తగ్గినట్లు తెలుస్తోంది. ఎంపిక చేసిన మార్కెట్లలో ఒక్కొక్క 100 జీఎస్‌ఎం (గ్రాస్ స్క్వేర్ మీటర్) పీపీఈ కిట్ల ధర కొన్ని వారాల కింద రూ.600 ఉండగా ఇప్పుడు దాని ధర రూ.168కు పడిపోయింది.
అదేవిధంగా ఆర్‌టీ–పీసీఆర్ టెస్టింగ్ కిట్ల ధరలు గతంలోని రూ.1,700 నుంచి రూ.600 కు తగ్గిపోయింది. ప్రస్తుతం డిమాండ్ కంటే సరఫరా ఎక్కువగా ఉండటంతో పాటు వివిధ వినియోగ అవసరాలకు తగ్గట్టుగా పలురకాల ప్రమాణాలతో పీపీఈ కిట్లు సిద్ధమవుతున్నాయి. వివిధ ప్రమాణాలకు సంబంధించిన కిట్లనే ఒక్కోదాన్ని రూ.300కు రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేస్తుండగా, దాదాపు రెండు నెలల క్రితం దీని ధర రూ.900 వరకు ఉండేది. ఉన్నతమైన నాణ్యతా ప్రమాణాలున్న పీపీఈ కిట్ ధర కూడా రూ.1,200 నుంచి రూ.800 తగ్గిపోయినట్టుగా వీటి తయారీ సంస్థలు తెలిపాయి.
చైనా తర్వాత మనమే..
పీపీఈ కిట్ల ఉత్పత్తిలో చైనా మొదటిస్థానంలో ఉండగా దాని తర్వాతి స్థానంలో మనదేశం ఉంది. దేశంలో ప్రస్తుతం 600కు పైగా కంపెనీలు రోజుకు ఐదు లక్షల పీపీఈ కిట్లను తయారు చేస్తున్నాయి. ఇక కోవిడ్ టెస్టింగ్ కిట్లను గతంలో రూ.1,700 వరకు వెచ్చించి ఒక్కో యూనిట్‌ను దిగుమతి చేసుకున్న పరిస్థితి నుంచి దేశంలో వీటిని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాక రూ.600కే ఇవి అందుబాటులోకి వస్తున్నాయి. భారత టెస్ట్ కిట్లు రూ.400కు, ఎక్స్‌ట్రాక్టర్, వైరల్ మీడియం రూ.200కు దొరుకుతున్నట్టుగా వైద్యపరికరాల ఉత్పత్తి సంస్థలు చెబుతున్నాయి. అయితే ఇదే సమయంలో కొన్ని చిన్న కంపెనీలు, లఘు ఉత్పత్తిదారులు తమ యూనిట్లను మూసేశారు. ప్రస్తుతమున్న తక్కువ ధరలకు పీపీఈ కిట్లను ఉత్పత్తి చేయడం సాధ్యం కాదని చెబుతున్నారు. కొన్ని వారాల క్రితం రూ.600 ఉన్న నాన్–వోవెన్ వాక్స్ కోటెడ్ 90 జీఎస్‌ఎం కిట్ ఇప్పుడు రూ.168కు లభిస్తుండటంతో ఈ ధర తమకు గిట్టుబాటు కాదంటున్నారు.
ఎగుమతి చేయాలనుకుంటున్న సంస్థలు
దేశంలో పీపీఈ, ఆర్‌టీ–పీసీఆర్ కిట్ల ఉత్పత్తి జరుగుతున్నందున ఇతర దేశాలకు ముఖ్యంగా చిన్న, మూడో ప్రపంచదేశాలకు వీటి ఎగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే బావుంటుందని కొన్ని పెద్ద కంపెనీలు కూడా భావిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో అత్యున్నత నాణ్యతా ప్రమా ణాలున్న పీపీఈ కిట్లకు మంచి డిమాండ్ ఉన్నందున ఎగుమతి అంశాన్ని పరిశీలించాలని కోరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment