అర్చకుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం
హైదరాబాద్: అర్చకుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేవాదాయ శాఖ ఉద్యోగులు, అర్చకుల కుటుంబ అవసరాలకు రుణం పొందేందుకు మోక్షం లభించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ట్రస్టు ఉండేది. అయితే రాష్ట్రం విడిపోయాక జనాభా దామాషా 52:48 పద్ధతిలో రెండు రాష్ట్రాలు విడివిడిగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో దేవాలయ ఉద్యోగులు, అర్చకులు తమ కుటుంబ అవసరాలకు రుణం పొందే వీలు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ట్రెజరీ నుంచి వేతనాలు డిమాండ్ చేస్తూ గత ఐదు రోజులుగా అర్చకులు, దేవాలయ ఉద్యోగులు ఉధృతంగా సమ్మె చేస్తున్నారు. స్పందించిన ప్రభుత్వం ట్రస్టు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
రూ.71.72 కోట్లతో నిధి
ఆంధ్రప్రదేశ్ విభజనతో ఉమ్మడి ట్రస్టు నుంచి రాష్ట్ర వాటాగా వచ్చిన సొమ్ముతోపాటు గత ఏడాదిగా దేవాలయాల నుంచి వసూలవుతున్న కాంట్రిబ్యూషన్ కలిపి రూ.71.72 కోట్లతో ప్రభుత్వం నిధిని ఏర్పాటు చేసింది. రూ.20 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉండే ఆలయాలు మొత్తం ఆదాయంలో 3 శాతాన్ని అర్చక, ఉద్యోగుల సంక్షేమ నిధికి విరాళంగా చెల్లించాల్సి ఉంటుంది. 1996లో సుప్రీం కోర్టు వెలువరించిన ఆదేశాల మేరకు దీన్ని ఏర్పాటు చేశారు.
అర్చకుల సంక్షేమ నిధి ఏర్పాటు
Published Sun, Aug 30 2015 12:48 AM | Last Updated on Sun, Sep 3 2017 8:21 AM
Advertisement
Advertisement