అర్చక సంఘం సభ్యులతో చర్చించినట్టు ప్రభుత్వ ప్రకటన
తమను చర్చలకే పిలవలేదంటున్న సమాఖ్య నేతలు
సమ్మెను నిర్వీర్యం చేసే కుట్ర.. సమ్మె యథాతథం అని ప్రకటన
హైదరాబాద్: ప్రభుత్వం చర్చలకు పిలిచి తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిందని ఓ సంఘం చెపుతుంటే.. సమ్మె నోటీసు ఇచ్చిన తమను అసలు చర్చలకే పిలవలేదని, సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఇంకో సంఘం చెపుతోంది. దీంతో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల్లో అయోమయం నెలకొంది. ట్రెజరీ నుంచి అర్చకులకు, దేవాలయ ఉద్యోగులకు వేతనాలు చెల్లించటంతోపాటు ధూపదీపనైవేద్యాలకు ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.2,500ను రూ.6 వేలకు పెంచాలనే డిమాండ్‌తో గత నెల 19న తెలంగాణ అర్చక, దేవాలయ ఉద్యోగుల సమాఖ్య దేవాదాయ శాఖ కమిషనర్‌కు సమ్మె నోటీసు ఇచ్చింది. జూన్ 4 నుంచి సమ్మె చేస్తామని ప్రకటించింది. నిత్య కైంకర్యాలు మాత్రమే జరిపి ఆర్జిత సేవలను నిర్వహించకుండా సమ్మె చేయాలని నిర్ణయించారు. అయితే అర్చక సమాఖ్యలోని గంగు ఉపేంద్రశర్మ నేతృత్వంలోని ఓ వర్గం సమ్మెను వ్యతిరేకిస్తోంది.
అదేసమయంలో గంగు భానుమూర్తి వర్గం సమ్మె చేసి తీరాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రభుత్వ సలహాదారు రమణాచారి దేవాదాయ శాఖ కార్యదర్శి సమక్షంలో ఉపేంద్రశర్మ వర్గంతో చర్చించారు. అర్చకులు, దేవాలయ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి సానుకూలంగా స్పందించినట్టు అనంతరం ఒక ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. ట్రెజరీ వేతనాలు, ధూపదీప నైవేద్యాల మొత్తం పెంపుతో పాటు ఆగస్టులోగా ధార్మిక పరిషత్తు ఏర్పాటు చేసేలా సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టు అందులో పేర్కొంది. ఇక్కడే వివాదం మొదలైంది. భానుమూర్తి వర్గం సమ్మె నోటీసు ఇవ్వగా, వారితో చర్చించకుండా.. ఉపేంద్రశర్మ వర్గంతో చర్చించడమేమిటని అర్చకులు మండిపడుతున్నారు. సమ్మెను నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కొంతమందితో చర్చించి.. సమ్మె లేదనే సంకేతాన్ని అర్చకులు, ఉద్యోగుల్లోకి పంపేందుకు ఇలా చేస్తున్నారని భానుమూర్తి వర్గం ఆరోపిస్తోంది. 4వ తేదీ నుంచి సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ప్రకటించింది.
సమ్మెపై అర్చకుల్లో అయోమయం
Published Wed, Jun 3 2015 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM
Advertisement
Advertisement