సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటి వరకు కేవలం మద్యం తాగి వాహనం నడుపుతూ, డ్రైవింగ్ లైసెన్సు లేకుండా దూసుకుపోతూ, మైనర్ డ్రైవింగ్... ఈ ఉల్లంఘనలకే న్యాయస్థానాలు జైలు శిక్ష విధించేవి. అయితే బుధవారం తొలిసారిగా రాంగ్‌రూట్‌లో డ్రైవింగ్ చేస్తూ పోలీసులకు చిక్కిన ఇద్దరికి కోర్టు రెండు రోజుల జైలు, జరిమానా విధించింది. ఈ కేసులను ట్రాఫిక్ పోలీసులు కాకుండా బోయిన్‌పల్లి శాంతిభద్రతల విభాగం అధికారులు నమోదు చేయడం గమనార్హం. న్యాయస్థానాలు రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌ను సైతం సీరియస్‌గా తీసుకుంటున్నాయని, భద్రతా కారణాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ పేర్కొన్నారు. నగరంలో రాంగ్ రూట్/నో ఎంట్రీ మార్గాల్లో దూసుకుపోతూ ప్రమాదాలకు గురికావడంతో పాటు వాటికి కారకులుగా మారుతున్న ఉదంతాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. కాస్తదూరం ముందుకు వెళ్లి ‘యూ టర్న్’ తీసుకోవడంలో నిర్లక్ష్యం చూపుతున్న వాహనచోదకులు... అది వన్ వేగా కనిపిస్తున్నా... రాంగ్ రూట్ అని తెలిసినా దూసుకుపోతున్నారు. నో ఎంట్రీ మార్గాలనూ వీరు వదలట్లేదు. ఇలాంటి వాహనచోదకులు నిత్యం చిన్న చిన్న ప్రమాదాలకు లోనవడంతో ఎదుటి వారికీ ఇబ్బందికరంగా మారుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఎదుటి వారి ఉసురు తీయడంతో పాటు కుటుంబాన్నే కకలావికలం చేస్తున్నాయి.
సిటీలోని అనేక జంక్షన్లతో పాటు కొన్ని కీలక ప్రాంతాల్లో ఈ రాంగ్ రూట్, నో ఎంట్రీ ఉల్లంఘనలు ఎక్కువగా ఉంటున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఆయా ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసినా వీటిని అడ్డుకోలేకపోతున్నారు. దీంతో కెమెరాలతో కానిస్టేబుళ్లు, హోంగార్డుల్ని మోహరిస్తున్నారు. వీరు ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడే వారి వాహనాలను ఫొటోలు తీసి, ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఈ–చలాన్ పంపుతున్నారు. స్పాట్‌లో చిక్కిన వారిని న్యాయస్థానంలో హాజరుపరచడం ప్రారంభించారు. నగర ట్రాఫిక్ విభాగం అమలు చేస్తున్న అత్యాధునిక వ్యవస్థ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం (ఐటీఎంఎస్) అమలులోకి వస్తే ఈ తరహా ఉల్లంఘనులకు రాత్రి వేళల్లోనూ చెక్ చెప్పవచ్చు. ఆటోమేటిక్ రాంగ్ డైరెక్షన్ వైలేషన్ క్యాప్చర్ సిస్టం (ఏఆర్‌డీవీసీఎస్)గా పిలిచే సాఫ్ట్‌వేర్‌ను బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ సర్వర్‌లో నిక్షిప్తం చేస్తారు. దీనిని నగరంలో ఈ తరహా ఉల్లంఘనలకు అవకాశం ఉన్న జంక్షన్లలో ఇప్పటికే ఉన్న సర్వైలెన్స్ కెమెరాలను అనుసంధానిస్తారు. జంక్షన్లు కాకుండా ఇతర చోట్ల ఈ ఉల్లంఘనలు జరుగుతున్న ప్రాంతాల్లో కొత్తగా కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఇలా నగర వ్యాప్తంగా 100 చోట్ల ఉండే కెమెరాలన్నీ కంట్రోల్ రూమ్‌లోని సర్వర్‌కు అనుసంధానించి ఉంటాయి. ఈ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న ప్రత్యేక ప్రోగ్రామింగ్ ఆయా మార్గాల్లో నిర్దేశించిన రూట్లలో కాకుండా వాటికి వ్యతిరేకంగా వచ్చే వాహనాలను గుర్తించి, ఫొటో తీసి, కంట్రోల్‌రూమ్ సర్వర్‌కు పంపుతుంది. అక్కడ ఈ–చలాన్‌ను జనరేట్ చేసి వాహనచోదకుల చిరునామాకు పంపేలా అధికారులు చర్యలు తీసుకుంటారు. ఐటీఎంఎస్ అమలులోకి వస్తే ఇలాంటి ఉల్లంఘనులకు పూర్తి స్థాయిలో చెక్ చెప్పినట్లు అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment