ఇంటర్నల్స్‌లో ఇష్టారాజ్యం! | private schools broke guidelines in tenth class internal exames | Sakshi

ఇంటర్నల్స్‌లో ఇష్టారాజ్యం!

Published Sat, May 9 2015 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM

ఇంటర్నల్స్‌లో ఇష్టారాజ్యం!

ఇంటర్నల్స్‌లో ఇష్టారాజ్యం!

- పదో తరగతి మార్కుల్లో ప్రైవేటు స్కూళ్ల వ్యవహారం
 
ఏడాదికోసారి పరీక్షల్లోనే కాదు, పాఠశాలలోనూ విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు రూపొందించిన ఇంటర్నల్స్ మార్కుల విధానం.. ప్రైవేటు పాఠశాలల అడ్డగోలుతనానికి సరికొత్త వేదికైంది. విద్యార్థుల సామర్థ్యానికి ఏమాత్రం సంబంధం లేకుండా, అసలు ఏమాత్రం పరిశీలన కూడా లేకుండా చాలా పాఠశాలలు గరిష్ట స్థాయిలో మార్కులు వేసేసుకున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ పక్కాగా లేకపోవడంతో మరింతగా రెచ్చిపోయాయి. ఇంటర్నల్స్‌కు ఉండే మొత్తం 20 మార్కులకుగాను చాలా మందికి 18 నుంచి 20 మార్కులు వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పర్యవేక్షణ అధికారులకు భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలు కూడా వస్తున్నాయి.

హైదరాబాద్: పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఇంటర్నల్ మార్కులు వేసిన తీరుపై ఇటీవల రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) అధ్యయనం చేసింది. ప్రస్తుతం ఆ వివరాలను నివేదికగా క్రోడీకరిస్తోంది. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం... ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా మార్కులు వేసుకున్నట్లు తెలిసింది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇంటర్నల్‌కు ఎక్కువ మార్కులు వేసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని చూసి అధికారులే విస్తుపోతున్నారు.

ప్రచారం కోసం పాకులాట..
ప్రస్తుతం రాష్ట్రంలో పదో తరగతి మార్కుల వెల్లడి విధానం లేదు. కేవలం గ్రేడ్‌లు, గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ)నే విద్యాశాఖ ప్రకటిస్తోంది. దీంతో ఏ విద్యార్థి ఎంత జీపీఏ సాధించాడన్నదే ముఖ్యంగా మారింది. ఒక విద్యార్థికి 10 జీపీఏ వచ్చిందంటే ఆ విద్యార్థి దాదాపు 91శాతం నుంచి 100 శాతం మధ్య మార్కులను సాధించినట్లే. అయితే జీపీఏ విధానం గత  మూడేళ్లుగా ఉన్నప్పటికీ ఇంటర్నల్ మార్కుల విధానం ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వచ్చింది.

నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా 9, 10 తరగతుల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ప్రతి సబ్జెక్టులో కేవలం 80 మార్కులకే రాతపరీక్ష నిర్వహించగా.. ఇంటర్నల్స్‌కు 20 మార్కులు కేటాయించారు. అయితే ఈ ఇంటర్నల్ మార్కులను విద్యార్థి పాస్/ఫెయిల్‌లో పరిగణనలోకి తీసుకోకపోయినా... అత్యధిక ఫలితాలు సాధించామని ప్రచారం చేసుకునేందుకు ప్రైవేటు పాఠశాలలు ఎక్కువ మార్కులు వేసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 5,589 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా, 5,144 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వీటి నుంచి ఈ ఏడాది దాదాపు 5.60 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో సగం మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే.
 
ఇంటర్నల్స్‌కు మార్కులివ్వాల్సిన తీరు..
- తరగతి గదిలో బోధన సమయంలో పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలకు 5 మార్కులు.
- విద్యార్థుల నోట్‌బుక్స్‌లో సొంతంగా రాసిన జవాబులకు 5 మార్కులు.
- ప్రాజెక్టు పనులకు 5 మార్కులు.
- లఘు పరీక్షలకు 5 మార్కులు ఇవ్వాలి.
- కానీ వీటిల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించకుండానే ఎక్కువగా మార్కులు వేసినట్లు తెలిసింది.


http://img.sakshi.net/images/cms/2015-05/51431114167_Unknown.jpg

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement