పరిధి పరేషాన్‌ | Problem With Police Station Borders in Hyderabad | Sakshi
Sakshi News home page

పరిధి పరేషాన్‌

Published Thu, Oct 10 2019 8:21 AM | Last Updated on Thu, Oct 10 2019 2:28 PM

Problem With Police Station Borders in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో:  రాంకోఠిలో నివాసం ఉండే కారు డ్రైవర్‌ శిబు తిరువ నడుపుతున్న వాహనం గత నెల 28న అర్ధరాత్రి బంజారా ఫంక్షన్‌హాల్‌ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. దీనికి సంబంధించి కేసు నమోదు చేయించుకోవడానికి శిబు10 గంటల పాటు నాలుగు పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న నగర పోలీసు కమిషనర్‌ మూడు ఠాణాలకు చెందిన ఇద్దరు ఎస్సైలు సహా ఐదుగురిపై  క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. వీరిని సీఏఆర్‌ హెడ్‌–క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఇది కేవలం ఒక్క శిబుకు మాత్రమే కాదు... ఏటా అనేక మంది బాధితులకు ఎదురవుతున్న సమస్య. అధికారులపై చర్యలు తీసుకున్నంత మాత్రాన పరిస్థితి మారుతుందా? ఈ పరిధుల చట్రంలో చిక్కుకొని విలవిల్లాడుతున్న అనేక మంది బాధితులకు న్యాయం జరుగుతుందా? ఈ ప్రశ్నలకు ఏ అధికారీ సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇక్కడ అమలులో ఉన్న చట్టం ప్రకారం జ్యురిస్‌డిక్షన్‌లోకి (పరిధి) వచ్చే అంశాలను మాత్రమే కేసుగా నమోదు చేయాల్సి ఉందని సిబ్బంది చెబుతున్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ముంబై పోలీసులు ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇది నగరంలోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

రాజధానిలో ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు.. వీటి పరిధిలో వందకు పైగా పోలీసు స్టేషన్లు ఉన్నాయి. అయితే భౌగోళికంగా ఇవన్నీ కలిసే ఉండడంతో ఠాణాల పరిధులు తెలుసుకోవడం సామాన్యుడికే కాదు.. ఒక్కోసారి ‘గూగుల్‌ తల్లి’కీ ఇబ్బందికరంగా మారుతోంది. ఈ పరిధుల సమస్య ఎక్కువగా ఒకచోట నుంచి మరోచోటుకు ప్రయాణాల నేపథ్యంలో జరిగే మిస్సింగ్, చోరీ, యాక్సిడెంట్‌ కేసుల్లో ఉత్పన్నమవుతోంది. పంజగుట్ట, బంజారాహిల్స్, హుమాయున్‌నగర్‌ ఠాణాలకు చెందిన ఐదుగురిపై వేటుకు కారణమైన శిబు తిరువ సైతం గత నెల 28న అర్ధరాత్రి మాదాపూర్‌ నుంచి నాంపల్లికి ప్రయాణిస్తున్నాడు. ఈ తరహా కేసులతో పాటు ఓ ప్రాంతంలో బస్సు ఎక్కిన వ్యక్తి మరో ప్రాంతంలో బస్సు దిగిన తర్వాత అదృశ్యమైనా.. రెండు మూడు ఠాణాల పరిధుల్ని దాటుతూ ప్రయాణిస్తున్న వ్యక్తి పర్సు, సెల్‌ఫోన్, నగలు, నగదు తస్కరణకు గురైతే ఎక్కడ ఫిర్యాదు చేయాలన్నా పరిధుల సమస్య నేపథ్యంలో మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. సాధారణంగా బాధితులు వారు ప్రయాణం ప్రారంభించిన చోట ఫిర్యాదు చేయడానికి వెళ్తుంటారు.  

ప్రతి పీఎస్‌కూ పరిధి...  
న్యాయస్థానాలతో పాటు ప్రతి పోలీసుస్టేషన్‌కు జ్యురిస్‌డిక్షన్‌గా పిలిచే అధికారిక పరిధి ఉంటుంది. ఆయా పరిధుల్లో జరిగిన నేరాలపై మాత్రమే సదరు ఠాణా అధికారులు కేసు నమోదు చేసుకునే అవకాశం ఉంది. అలా నమోదు చేసిన కేసు వివరాలను తక్షణం తాను ఏ పరిధిలోకి వస్తే ఆ న్యాయస్థానానికి సమర్పించాల్సి ఉంటుంది. దీన్ని విస్మరిస్తే చట్ట పరంగా అధికారులు సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో డిఫెన్స్‌ న్యాయవాదులకు ఇది అనుకూలంగా మారి విచారణ సమయంలోనే కేసు వీగిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే నిత్యం పోలీసులు పరిధుల అంశానికి కీలక ప్రాధాన్యం ఇస్తుంటారు. దీంతో ‘ట్రావెలింగ్‌’ ఫిర్యాదులను స్వీకరించే విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి వస్తోంది. ఈ నిబంధనలు సామాన్యులకు ఇబ్బందుల్ని తెచ్చిపెడుతున్నాయి. అప్పటికే సమస్య ఎదురైన, ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొని నష్టపోయిన బాధితులకు ఇబ్బందికరంగా మారడంతో పాటు పోలీసుల పట్ల వ్యతిరేక భావాన్ని కలిగేలా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే శిబు తిరువ వ్యవహారాన్ని నగర పోలీసు కమిషనర్‌ అంత సీరియస్‌గా తీసుకున్నారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగానే ముంబై పోలీసులు ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ విధానం అమలు చేస్తున్నారు. 

నెంబర్‌ లేకుండా నమోదు...
బాధితుడి నుంచి అందుకున్న ఫిర్యాదును పోలీసుస్టేషన్‌లో కేసుగా నమోదు చేస్తూ ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) జారీ చేస్తారు. ప్రతి ఎఫ్‌ఐఆర్‌కు సీరియల్‌ నెంబర్‌/ఆ సంవత్సరాన్ని సూచిస్తూ సంఖ్య కేటాయిస్తారు. దీని ప్రతిని పోలీసులు తమ పరిధిలోకి వచ్చే న్యాయస్థానంలో దాఖలు చేస్తారు. ముంబైలో పరిధులు కాని నేరాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులకు ఎలాంటి నెంబర్‌ కేటాయించకుండా ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ నమోదు చేస్తున్నారు. 2014లో వెలుగులోకి వచ్చిన సంచలనం సృష్టించిన ముంబై మోడల్‌పై అఘాయిత్యం కేసే దీనికి ఉదాహరణ. 2013 డిసెంబర్‌ 31కి ‘వినూత్నంగా ఎంజాయ్‌’ చేయాలని భావించిన కొందరు దుండగులు కుట్రతో ముంబై మోడల్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. స్పృహ కోల్పోయిన ఆమెను కొండాపూర్‌లో టికెట్‌ బుక్‌ చేసి బస్సులో ముంబై పంపేశారు. 2014 జనవరి 2న అక్కడకు చేరుకున్న ఆమె వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేయడం.. 7న ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’తో కేసు నమోదు కావడం జరిగాయి. ప్రాథమిక విచారణ నేపథ్యంలో ఉదంతం హైదరాబాద్‌లో జరిగినట్లు గుర్తించిన అక్కడి పోలీసులు కేసును సీసీఎస్‌కు బదిలీ చేయడంతో ఇక్కడి పోలీసులు నిందితులను పట్టుకున్నారు. మోడల్‌పై అత్యాచారం నిజాంపేటలో జరిగినట్లు తేలడంతో హైదరాబాద్‌ పోలీసులు కేసును సైబరాబాద్‌ పోలీసులకు బదిలీ చేసి, నిందితుల్ని అప్పగించారు. దర్యాప్తు పూర్తి చేసిన సైబరాబాద్‌ అధికారులే అభియోగపత్రాలు సైతం దాఖలు చేశారు.  

అన్ని కేసులకూ అవకాశం 
ఈ తరహా ఉదంతాల్లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, సంబంధిత స్టేషన్‌కు బదిలీ చేసే ఆస్కారం అన్ని రకాలైన నేరాలకు సంబంధించిన కేసుల్లోనూ ఉంది. అయితే అది ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాల్లో తప్ప... ఎక్కడా పూర్తిస్థాయిలో వినియోగంలో ఉండట్లేదు. ముంబైలోనూ కొన్నిసార్లు అమలుకు నోచుకోవట్లేదు. బాధితుడు ఠాణాకు వచ్చినప్పుడు పరిధుల పేరు చెప్పి తిప్పడం కంటే ముందు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, ప్రాథమిక విచారణ చేపట్టాలి. అప్పుడు బాధితుడికి ఊరటగా ఉండటంతో పాటు పోలీసులపై సదభిప్రాయం ఏర్పడుతుంది. కేసు దర్యాప్తు, అరెస్టు తదితరాలన్నీ నేరం జరిగిన ప్రాంతం పరిధిలోకి వచ్చే పోలీసులు చేసే అవకాశం ఉంది. కేసు నమోదు చేసిన తర్వాత బదిలీ చేసి, బాధితుడిని ఆ ఠాణాకు పంపినా అతడు ఇబ్బందిగా భావించడు. హైదరాబాద్‌ లాంటి నగరాల్లోనూ ఈ ‘జీరో ఎఫ్‌ఐఆర్‌’ విధానం అమలు ఎంతో అవసరం. ఈ విధానమే అమలులో ఉండి ఉంటే శిబు తిరువకు అసలు ఇబ్బంది కలిగేదే కాదు.  – జైసింగ్, జన్‌శక్తి ఫౌండేషన్‌ నిర్వాహకఅధ్యక్షుడు, ముంబై 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement