40 మంది డాక్టర్లకు.. ఉన్నది 19 మంది
సింగరేణి ఆస్పత్రిలో అరకొర వైద్య సేవలు
సాధారణ రోగులనూ గోదావరిఖనికి రిఫర్
భూపాలపల్లిలో కార్మికుల అవస్థలు
సంక్షేమాన్ని విస్మరిస్తున్న యాజమాన్యం
హన్మకొండ : చీకటి సూర్యులుగా పేరొందిన బొగ్గుగని కార్మికుల సంక్షేమంపై సింగరేణి కాలరీస్ సంస్థ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. ప్రాణాలకు తెగించి పుడమి తల్లి కడుపులో నల్ల బంగారాన్ని వెలికి తీస్తున్న కార్మికుల ఆరోగ్య పరిరక్షణపై పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తోంది. ఫలితంగా సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎనిమిదేళ్లుగాఅంతంతమాత్రమే..
1988లో భూపాలపల్లిలో బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. 2006లో సింగరేణి సంస్థ ఇక్కడ 75 పడకల సామర్థ్యంతో వైద్యశాలను ప్రారంభించింది. ఈ ఆస్పత్రిలో ఆర్థో, న్యూరో, జనరల్ సర్జరీ, గైనకాలజీ, జనరల్ ఫిజీషియన్, అనస్థీషియా, డెర్మటాలజీ, చిల్డ్రన్స్, రేడియాలజీ, కార్డియాలజీ, యూరాలజీ, న్యూరాలజీ, దంత, కంటి సంబంధిత విభాగాల్లో సేవలు అందిస్తామని సంస్థ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం ఆస్పత్రికి 40 వైద్యుల పోస్టులు మంజూరు చేశారు. కానీ 21 మంది మాత్రమే ప్రస్తుతం సేవలందిస్తున్నారు. స్త్రీ సంబంధిత వ్యాధుల(గైనకాలజీ) విభాగంలో వారానికోసారి ఔట్ పేషెంట్ విభాగం నిర్వహిస్తున్నారు. కీలకమైన జనరల్ ఫిజీషియన్ పోస్టులు ఆస్పత్రి ప్రారంభం నుంచి ఖాళీగానే ఉన్నారుు. ఆర్థో విభాగం రెండేళ్లు పని చేసినా... గడిచిన ఎనిమిదేళ్లుగా సేవలు అందడం లేదు. ఫలితంగా కంటి చూపు, కాలి నొప్పి వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు కూడా ఇక్కడ సేవలు అందడం లేదు. ఇక వెంటిలేటర్, అంబులెన్సులు సైతం సరిపడా లేవు.
రిఫర్‌లే రిఫర్‌లు..
సింగరేణిలో పెద్ద సంఖ్యలో కార్మికులు పని చేస్తున్న ఏరియాల్లో భూపాలపల్లి ఒకటి. ఇక్కడ సుమారు 6700 మంది కార్మికులు పని చేస్తున్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రికి రోజుకు సగటున 400 మంది రోగులు అవుట్ పేషెంట్లుగా, ఇన్‌పేషెంట్‌గా రోజుకు సగటున 30 మంది వస్తున్నారు. ఇలాంటి ఆస్పత్రిలో ఎనిమిదేళ్లుగా పూర్తి స్థాయిలో వైద్యులను భర్తీ చేయకపోవడంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. చిన్న సమస్యలకు కూడా సింగరేణి రీజనల్ ఆస్పత్రి అయినగోదావరిఖని, ప్రధా న ఆస్పత్రి ఉన్న కొత్తగూడెం రిఫర్ చేస్తున్నారు. లేదంటే హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి పంపుతున్నారు. ప్రస్తుత ఆస్పత్రి లెక్కల ప్రకారమే నెలకు 40 మందిని రెఫర్ చేస్తున్నారు.
కార్మికులపై ఆర్థిక భారం..
పూర్తి స్థాయిలో వైద్యులు లేకపోవడంతో రోగులను ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేయడం వల్ల కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. భూపాలపల్లి నుంచి గోదావరిఖని, కొత్తగూడెం, హైదరాబాద్ ఆస్పత్రులకు రోగులను తీసుకెళ్లడం, చికిత్స పూర్తయ్యేంత వరకు అక్కడే ఉండాల్సి రావడంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. దీంతో వారు అంత దూరం వెళ్లలేక లోకల్‌గా ఉండే ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తుండడంతో ఆర్థిక భారం పడుతోంది. సింగరేణి కార్మికులు రోజుకు కిలోమీటర్ల కొద్ది బొగ్గుగనుల్లో నడవాల్సి వస్తుం ది. దీంతో ఆర్థో సమస్యలు, కాలుష్యం కారణంగా కంటి, శ్వాసకోస సంబంధిత వ్యాధులూ ఎక్కువే. ఇక్కడి ఆహార అలవాట్ల కారణంగా హృదయ సంబంధిత రోగాల బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. కార్మికుల సంక్షేమం కోసం కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ప్రకటించే సింగరేణి సంస్థ భూపాలపల్లి ఆస్పత్రిలో వైద్యుల కొరతపై దృష్టి పెట్టడం లేదు. ఏళ్ల తరబడి పూర్తి స్థాయిలో సేవలు అందక, ఆస్పత్రి అలకాంర ప్రాయంగా మారినా పట్టించుకోవడం లేదు.
సగం ఖాళీలే!
Published Tue, Jul 12 2016 1:15 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement