ప్రజల ముందు ప్రగతి నివేదన
టీఆర్‌ఎస్ వార్షికోత్సవ సభకు ఘనంగా ఏర్పాట్లు
- వరంగల్ సభకు ప్రత్యేక యాప్
- 1,800 ఎకరాల్లో బహిరంగసభ
- సభ ఆవరణలో వైఫై సేవలు
సాక్షి, వరంగల్: టీఆర్‌ఎస్ 16వ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్‌లో ఈ నెల 27న నిర్వహించే భారీ బహిరంగసభకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. హన్మకొండలోని ప్రకాశ్‌రెడ్డిపేట మైదానంలో అధునాతన టెక్నాలజీతో, భారీ హంగులతో బహిరంగసభ ఏర్పాట్లు చేస్తున్నారు. 1,800 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగసభ పార్కింగ్, వేదిక ఏర్పాట్లు జరుగుతున్నాయి. బహిరంగసభ నిర్వహణ కోసం 8,400 చదరపు అడుగుల విస్తీర్ణంతో భారీ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. సభకు వచ్చే అందరికీ కనిపించేలా పది అడుగుల ఎత్తులో ఈ వేదిక సిద్ధమవుతోంది. దేశంలో గతంలో ఏ రాజకీయ పార్టీ బహిరంగసభకు ఇంత పెద్ద సభా వేదికను ఏర్పాటు చేయలేదని టీఆర్‌ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి చెప్పారు.
ప్రధాన వేదికకు పక్కన కళాకారుల కోసం 2,400 చదరపు అడుగుల విస్తీర్ణంతో మరో వేదికను ఏర్పాటు చేస్తున్నారు. మహిళలకు, వృద్ధులకు, దివ్యాంగులకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. కనీసం 10 వేల ట్రాక్టర్లలో భారీగా రైతులు వరంగల్ బహిరంగసభకు తరలివచ్చే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. వీరికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రకాశ్‌రెడ్డిపేటలోని బహిరంగసభ స్థలానికి ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంగా, బహిరంగసభకు ‘ప్రజల ముందు ప్రగతి నివేదన సభ’గా నామకరణం చేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి హరీశ్‌రావు బహిరంగసభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
అధునాతన హంగులు...
టీఆర్‌ఎస్ సభకు సాంకేతికతో అధునాతన ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బహిరంగసభకు వచ్చే వారికి రోడ్డు మార్గం సులువుగా తెలిసేలా ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు. బహిరంగసభ ఆవరణలో వైఫై సేవలు అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 60 ఎల్‌ఈడీ స్క్రీన్లను పెడుతున్నారు. డిజిటల్ సిస్టమ్స్‌తో సభా వేదిక నుంచి 21 కిలో మీటర్ల రోడ్ల పొడవునా సౌండ్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. 300 ఎలక్ట్రికల్ టవర్లు, ఒక్కో టవర్‌కు 28 లైట్ల చొప్పున మొత్తం 8,400 లైట్లను బిగించారు. అలాగే సింగిల్‌పోల్ లైటింగ్ సిస్టంతో మరో 4,800 లైట్లను ఏర్పాటు చేశారు. 34 జనరేటర్లతో 1,3130 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన వ్యవస్థను ఏర్పాటు చేశారు. సభ ప్రాంగణం చుట్టూ 25 అడుగుల ఎత్తుతో ఉండే రెండు వేల జెండాలను పెడుతున్నారు.
నగరం సుందరం..
టీఆర్‌ఎస్ సభతో గ్రేటర్ వరంగల్ నగరానికి కొత్త∙హంగులు వచ్చాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా నగరాన్ని సుందరీకరించారు. వరంగల్ మహానగరపాలక సంస్థ, కాకతీయ పట్టణాభివృ ద్ధి సంస్థలు రూ.6 కోట్లతో అభివృద్ధి పను లు చేశాయి. గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో రెండు నెలలుగా నగర సుందరీకరణ పనులు చేస్తున్నారు. ప్రధాన రహదారులను అభివృద్ధి చేశారు. నగరంలోని కూడళ్లను కొత్త తరహాలో సుందరీకరించారు. అంతర్గత రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. మొత్తంగా టీఆర్‌ఎస్ బహిరంగసభతో వరంగల్ నగరం కొత్త రూపు సంతరించుకుంది.
జాతరలా టీఆర్‌ఎస్ సభ
మంత్రి హరీశ్‌రావు
హన్మకొండ: టీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ జాతరలా జరుగనుందని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం హన్మకొండలోని బహిరంగ సభా స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో ర్యాలీని జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్యే వినయభాస్కర్, రాష్ట్ర నాయకుడు గుడిమల్ల రవికుమార్‌తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందన్నారు.
ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన ప్రతి ఒక్కరూ టీఆర్‌ఎస్ సభకు రావడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. దీంతో టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభ జాతరగా మారనుందన్నారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తాగు నీరు, మజ్జిగ అందిస్తున్నామన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సభా స్థలికి సమీపంగా విశాలమైన పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరుగుదొడ్లు ఏర్పాటు చేశామన్నారు. ట్రాక్టర్లపై వచ్చే రైతులకు ప్రత్యేక పార్కింగ్‌తో పాటు ఒక రోజు ముందుగా వచ్చే వారికి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.