దేశ రక్షణలో రాజీలేదు
జాతీయ భద్రతకు మోదీ సర్కారు ప్రాధాన్యం
ఓయూ సదస్సులో రాంమాధవ్
హైదరాబాద్: జాతీయ భద్రత, సమగ్రత విషయంలో భారత్ ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదని, భద్రత విషయంలో ప్రధాని మోదీ గట్టి చర్యలు తీసుకుంటారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పేర్కొన్నారు. ‘జాతీయ భద్రతకు సవాళ్లు’ అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. విమర్శలకు తావు లేకుండా కేంద్రంలో మోదీ సమర్థ పాలన అందిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలకు కూడా విమర్శించేందుకు ఎటువంటి అంశాలు దొరక్క ‘సూటుబూటు సర్కారు, ఎన్‌ఆర్‌ఐ పీఎం’ అంటూ చిన్న పిల్లాడు మాట్లాడుతున్నారని రాహుల్ గాంధీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
జమ్మూ-కశ్మీర్‌లో పీడీపీతో కలసి ఏర్పాటు చేసిన సంకీర్ణ సర్కారు విజయవంతమైతే అక్కడి వేర్పాటువాదుల వెన్ను విరుస్తామని ఆయన పేర్కొన్నారు. ఆ రాష్ర్టంలోని అన్ని ప్రాంతాలకు కేంద్రం సమన్యాయం చేస్తున్నట్లు తెలిపారు. కశ్మీరీ పండిట్లతో చర్చలు జరిపిన ఘనత మోదీదేనని, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో శరణార్థుల పునరావాసం కోసం చర్యలు తీసుకుంటున్నది కూడా తమ సర్కారేనని రాంమాధవ్ చెప్పుకొచ్చారు. జాతీయ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని, సరిహద్దు వివాదంపై చైనాతోనూ మోదీ చర్చలు జరిపారని వివరించారు. ప్రజావసరాల మేరకు భూ సేకరణ చట్టాన్ని కేంద్రం సవరిస్తుందని, పదేళ్లలో దేశ ఆర్థిక స్వరూపాన్ని మార్చేందుకు మోదీ కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు.