నిందితులను శిక్షించాల్సిందే | protest for justice of gang rape | Sakshi
Sakshi News home page

నిందితులను శిక్షించాల్సిందే

Published Sun, Oct 5 2014 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM

protest for justice of gang rape

దుబ్బాక: దుబ్బాక మండలం రామక్కపేటలో గిరిజనులైన తల్లీ కూతుళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలంటూ ఆదివారం అఖిల పక్షం నేతలు ఇచ్చిన పిలుపు మేరకు దుబ్బాక బంద్ పిలుపు  ప్రశాంతంగా జరిగింది. అఖిల పక్ష నాయకులు ఉదయమే దుబ్బాక బస్ డిపో ఎదుట ఆందోళన చేపట్టి డిపో నుంచి ఒక్క బస్సు కూడా బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.

వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు కూడా బంద్‌కు సంపూర్ణ మద్దతు పలికారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన మహిళలు దుబ్బాక ప్రధాన వీధుల్లో నిరసన ర్యాలీ చేపట్టారు. ఏకలవ్య ఎరుకల సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం దుబ్బాక పోలీస్‌స్టేషన్ ఎదుట మహిళలు బైఠాయించి నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మద్దుల ఉమాదేవి మాట్లాడుతూ గిరిజన మహిళలపై అత్యాచారం జరిగి 24 గంటలు గడిచినా నిందితులను ఎందుకు  అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.

కేసును తప్పు దోవ పట్టించేందుకే దుండగులను అరెస్టు చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ డెమోక్రటిక్ టీచర్‌‌స ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రభాను మాట్లాడుతూ నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాల్సి ఉన్నా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్నారు.  బాధితులకు తక్షణ సాయంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, పెన్షన్, వంట పాత్రలు, మూడు నెలలకు సరిపోయే రేషన్ ఇవ్వాలన్నారు.

 బాధితులను ప్రలోభపెట్టి కేసును తారుమారు చేసేందుకు నిందితులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారన్నారు. నిరసన కార్యక్రమంలో తెలంగాణ సామాజిక వేదిక జిల్లా కన్వీనర్ జాన్‌వెస్లీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్. రాంరెడ్డి, నాయకులు సెంట్రింగ్ దుర్గయ్య, చెక్కపల్లి పద్మయ్య, టీడీపీ ఎస్సీ, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కరికె శ్రీనివాస్, నాయకులు కాశయ్య, దుబ్బాక రాజయ్య, ఏకలవ్వ, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 నిందితుల దిష్టిబొమ్మ దహనం
 దుబ్బాక రూరల్: గిరిజన మహిళలపై అత్యాచారం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత మహిళా సమఖ్య ఆధ్వర్యంలో పలువురు మహిళలు ఆదివారం దుబ్బాక బస్టాండ్ ప్రధాన రహదారిపై నిందితుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఐద్వా మండల నాయకురాలు నవీన మాట్లాడుతూ నిర్భయ వంటి కఠినమైన చట్టాలను ప్రభుత్వాలు తీసుకు వస్తున్నా మహిళల పట్ల అరాచకాలు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం మద్యాన్ని సంపూర్ణంగా నిషేధించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మహిళలతో కలిసి బెల్టుషాపులపై దాడులు చేస్తామని హెచ్చరించారు.  కార్యక్రమంలో మహిళా నాయకురాలు జమున, భారతమ్మ, రాధిక, బాల్‌లక్ష్మి, మమత, బాలమల్లవ్వ, సిద్దవ్వ పాల్గొన్నారు.

 కేసును సీబీసీఐడీకి అప్పగించాలి
 రామక్కపేట గ్రామానికి చెందిన గిరిజన తల్లి కూతళ్లపై దసరా పండుగ రోజున జరిగిన అత్యాచార కేసును సీబీసీఐడీకి అప్పజెప్పాలని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కుతాడి రాములు, లోకిని రాజు తెలిపారు. బాధిత కుటుంబాన్ని పరమార్శించిన అనంతరం వారు ఆదివారం దుబ్బాక విలేకరులతో మాట్లాడారు.

సభ్య సమాజం తల దించుకునేలా జరిగిన సంఘటనపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. స్థానిక పోలీసులు కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని, కేసు పక్కదారి పట్టకుండా ఉండాలంటే సీబీసీఐడీకి అప్పజెప్పాలన్నారు. సీఎంతో పాటు హోంమంత్రి, రాష్ట్ర డీజీపీలకు విజ్ఞాపన పత్రాలను అందజేసినట్లు తెలిపారు.

 కఠినంగా శిక్షించాలి
 మిరుదొడ్డి: అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డీబీఎఫ్  రాష్ట్ర నాయకుడు ముత్యాల భూపాల్ డిమాండ్ చేశారు.

 ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అత్యాచారానికి గురైన  బాధితులకు నష్ట పరిహారంతోపాటు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గజ్వేల్ మండలం పిడిచెడ్‌లో హిందూ దేవాలయంలోకి పూజలు చేసేందుకు వెళ్లిన దళిత ఉపాధ్యాయుడిపై కొందరు అగ్రవర్గాల నేతలు కులం పేరుతో దూషించి దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. కార్యక్రమంలో డీబీఎఫ్ నాయకులు నక్క రాజయ్య, బిట్ల కుమార్, ఆర్ రాజయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

 దాడులను అరికట్టడంలో విఫలం
 జోగిపేట: ఎస్సీ, ఎస్టీలపై రోజురోజుకు పెరిగిపోతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని  సీపీఎం డివిజన్ కార్యదర్శి పి.మొగులయ్య ఆరోపించారు. దుబ్బాక మండలం రామక్కపేటలో గిరిజన కులానికి చెందిన తల్లీకూతళ్లపై అమానుషంగా అత్యాచారం చేసిన దుండగుల దిష్టిబొమ్మను జోగిపేటలోని తహశీల్ కార్యాలయం వద్ద ఆదివారం దహనం చేశారు. ఈ సందర్భంగా మొగులయ్య మాట్లాడుతూ ఈ సంఘటనలో బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సంతోష్, గంగ, సంజీవులు, శివకుమార్, గంగారాంలతో పాటు పలువురు పాల్గొన్నారు.

 దుండగులను శిక్షించాలి టీఎన్‌ఎస్‌ఎఫ్ డిమాండ్
 జగదేవ్‌పూర్: రామక్కపేటలో తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి కామల్ల భూమయ్య, తెలుగు యువత జిల్లా నాయకుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆదివారం వారు జగదేవ్‌పూర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ తల్లీకూతుళ్లపై అత్యచారం జరగడం దారుణమన్నారు. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలన్నారు. సమావేశంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ మండలాధ్యక్షులు శివలింగం, నాయకులు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement