టీఆర్‌ఎస్ పాలన తీరుపై నిరసన | protest on the trs party | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్ పాలన తీరుపై నిరసన

Published Sat, Sep 13 2014 4:28 AM | Last Updated on Thu, Mar 21 2019 8:31 PM

టీఆర్‌ఎస్ పాలన తీరుపై నిరసన - Sakshi

టీఆర్‌ఎస్ పాలన తీరుపై నిరసన

- కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా, కలెక్టరేట్ ముట్టడి
- స్వల్ప ఉద్రిక్తత.. నాయకుల అరెస్టు
- ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసిన నేతలు
- మాటలు తప్ప.. చేతలు లేవని విమర్శ

వరంగల్: టీఆర్‌ఎస్ వంద రోజుల పాలన తీరును నిరసిస్తూ పీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా, నగర కమిటీల ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా, కలెక్టరేట్ ముట్టడి జరిగింది. డీసీసీ అధ్యక్షుడు నారుుని రాజేందర్‌రెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్ అధ్యక్షతన హన్మకొండ ఏకశిలపార్కు వద్ద ఉదయం 11గంటలకు మొదలైన ధర్నా.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది. ఈ నిరసనకు జిల్లా వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యూరు. ధర్నాలో పలువురు జిల్లా నేతలు మాట్లాడుతూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.

కేసీఆర్ పాలన అంతా కాలయాపనే తప్ప.. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందేమీలేదని మాజీ మంత్రి, డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ విమర్శించారు. ప్రభుత్వం ఈ ఏడాది కాలం గడిపి వచ్చే మార్చి తర్వాతనే పనులు ప్రారంభించే అవకాశం ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయకుండా మాటలతో మాయచేస్తున్నార ని, రైతుల రుణమాఫీ, సంక్షేమ పథకాలు దీపావళి, దసరా నుంచి అంటూ వాయిదాలు పెడుతున్నారని అన్నారు. రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నదని, కరు వు పరిస్థితులు ఏర్పడినా పట్టించుకునే వారు లేరన్నారు.  అసలు కరెంట్ జాడలేకుండా పోయిందని, మూడు గదుల ఇళ్ళంటూ ఊదరగొట్టడం తప్ప.. సగం కట్టిన ఇళ్ళకు బిల్లులు లేవని, కొత్తగా ఇల్లు ఇచ్చింది లేదని మండిపడ్డారు.   ఏ జిల్లాకు పోతే.. ఆ జిల్లానే ముందు వరుసలో పెడుతామంటూ మాటలు చెబుతున్నారని మండిపడ్డారు.  
     
కేసీఆర్ వంద రోజుల పాలన దండుగగా మారిందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి విమర్శించారు. సంక్షేమం అమలు చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నప్పటికీ ఈ ధర్నాకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడం గొప్ప విషయమన్నారు. వేధింపులు నిలిపివేయకుంటే టీఆర్‌ఎస్ నాయకులను అడ్డుకుంటామన్నారు. విద్యార్థులపై కేసులు ఎత్తివేసేందుకు ఈ ప్రభుత్వానికి సమయం లేకుండా పోయిందన్నారు. ఇంకా తెలంగాన సెంటిమెంట్‌ను ఉపయోగించుకొని కాలం గడుపుతున్నారని విమర్శించారు.  
     
కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరామ్‌నాయక్ మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు తప్ప ఇతరుల గురించి పట్టించుకోలేదన్నారు. అభివృద్ధి, సంక్షేమ   పథకాల జాడలేదన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలపై నిరంతరం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
     
మాజీ మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ కేసీఆర్ ఇంకా ప్రజలను మోసం చేస్తున్నారని, ఒక్క రోజుకూడా పార్లమెంట్‌లో తెలంగాణ గురించి, అమరవీరుల గురించి మాట్లాడలేదన్నారు. ఎన్నికల ముందు వాగ్దానం చేసి ఇపుడు మూడెళ్ల వరకు కరెంట్ రాదంటున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ చిత్తుగా తాగి ఫాంహౌస్‌లో పడుకున్న కేసీఆర్ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తుందనగానే నిద్రలేచి వచ్చాడని విమర్శించారు. దళితున్ని సీఎం చేస్తానని, లేకుంటే తలనరుక్కుంటానని చెప్పి మాటమార్చాడని అన్నారు. ప్రజల మధ్య మంత్రి రాజయ్య ను విమర్శించిన కేసీఆర్ దళిత వ్యతిరేకి పేర్కొన్నారు. మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే తక్షణమే రైతులకు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అప్రజాస్వామికంగా వ్యవహరించి జెడ్పీ పీఠాన్ని చేజిక్కించుకున్నారని ధ్వజమెత్తారు. వంద రోజుల్లో ప్రభుత్వంపై అభధ్రత, అవిశ్వాసం పెరిగిందన్నారు. మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే ఫలితం టీఆర్‌ఎస్ పొందిందని, అధికారంలోకి రాగానే పాలకులు ప్రజాసంక్షేమాన్ని విస్మరించారని దుయ్యబట్టారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురా లు పొన్నాల వైశాలి మాట్లాడుతూ సీఎం ప్రజలను మాటలతో వంచిస్తున్నారని, చేతనైతే సంక్షేమ పథకాలు అమలు చేయాలి.. లేకుంటే నోరుమూసుకోవాలన్నారు.
 
అడ్డంకులు.. అరెస్టులు
ధర్నా అనంతరం కలెక్టరేట్‌కు కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీగా బయలుదేరగా కాళోజీ సెంటర్ నుంచే ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఇక్కడే ఎమ్మెల్యే రెడ్యానాయక్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్యతోపాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డిలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నాయకులు పోలీసుల అడ్డంకులను తప్పించుకొని ముందుకురకగా అమరవీరుల స్థూపం వద్ద కొంతమందిని, డీఐజీ బంగ్లా వద్ద కొంత మందిని, కలెక్టర్ నివాసం వద్ద మాజీ కేంద్ర మంత్రి బలరామ్‌నాయక్, మాజీ ఎంపీ సిరిసిల్ల, మాజీ ఎమ్మెల్యేలు కవిత, కొండేటి శ్రీధర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పొన్నాల వైశాలి, మాజీ మేయర్ స్వర్ణ, పొదెం వీరయ్యతో పాటు కొంత మంది కార్యకర్తలను అరెస్టు చేశారు. అయినప్పటికీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్‌కు చేరుకొని నిరసన తెలిపారు. సీఎం డౌన్‌డౌన్, ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పోలీసులు వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు.  
 
కలెక్టర్‌కు వినతిపత్రం
వంద రోజుల కేసీఆర్ పాలనలో రైతుల గురించి, సంక్షేమ పథకాల గురించి పట్టించుకోలేదని విమర్శిస్తూ కలెక్టర్‌కు కాంగ్రెస్ నాయకులు బలరాంనాయక్, రాజేందర్‌రెడ్డి, రెడ్యానాయక్, సారయ్య, సిరిసిల్ల, గండ్ర, స్వర్ణ, వైశాలిల బృందం వినతిపత్రం సమర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులను పోలీసుస్టేషన్‌కు తరలించి వివరాలు నమోదు చేసుకున్న తర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ధర్నా, నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంద వినోద్‌కుమార్, భరత్‌చంద్‌రెడ్డి, ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కత్తి వెంకటస్వామిగౌడ్, అమృతరావు, వరద రాజేశ్వర్‌రావు, ఈవీ శ్రీనివాసరావు, నమిండ్ల శ్రీనివాస్, బస్వరాజు కుమారస్వామి, పోశాల పద్మ, బక్క జడ్సన్, జమాలుద్దీన్, మహమూద్, నెక్కొండ కిషన్, ఎల్. శ్రీనివాస్, జి.శ్రీనివాసరెడ్డి, రావుల సదానందం, నలుబోల రాజు, తాడిశెట్టి మధు, తదితరులు పాల్గొన్నారు. ధర్నాకు ముందు ప్రొఫెసర్ జయశంకర్‌సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొండపర్తికి చెందిన రైతు కరెంట్ లేక ఎండిపోయిన మొక్కజొన్నను చూపెట్టారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ విజయరామారావు, దుగా్యాల శ్రీనివాసరావు గైర్హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement