పోలవరంపై ప్రజా ఉద్యమం | Public movement on Polavaram | Sakshi
Sakshi News home page

పోలవరంపై ప్రజా ఉద్యమం

Published Thu, Oct 16 2014 1:20 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

పోలవరంపై ప్రజా ఉద్యమం - Sakshi

పోలవరంపై ప్రజా ఉద్యమం

భారీ ఎత్తున పోరాటం చేపడతామన్న టీ కాంగ్రెస్  ముంపు మండలాలను తెలంగాణలో చేర్చాలని డిమాండ్
 
{పాజెక్టు డిజైన్ మార్చేలా  కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయం
పోలవరంపై సుప్రీంను ఆశ్రయించే యోచన
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జితో టీ నేతల భేటీ

 
న్యూఢిల్లీ: పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని నిరసిస్తూ.. తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ఉద్యమానికి సిద్ధమైంది. దీనివల్ల గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాటాలు చేయాలని నిర్ణయించింది. పోలవరం ప్రాజెక్టును ప్రస్తుత డిజైన్‌లో నిర్మిస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని, నిపుణుల కమిటీ ఇదే విషయాన్ని పేర్కొంటూ నివేదిక ఇచ్చిన అంశాన్ని కేంద్రం దృష్టికి తేనుంది. పోలవరం అంశంపై నవంబర్ 22న భద్రాచలంలో బహిరంగ సభ నిర్వహించి, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. దీంతోపాటు తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు.

ఢిల్లీలో భేటీ..

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, సీనియర్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డి.శ్రీనివాస్, రేణుకా చౌదరి, పొంగులేటి సుధాక ర్‌రెడ్డి, భట్టి విక్రమార్క, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, వనమా వెంకటేశ్వర్లు, పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు ముంపు పరిధిలో ఉన్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో చేర్చడాన్ని స్థానికులంతా వ్యతిరేకిస్తున్నారని.. అక్కడి గిరిజనులంతా తెలంగాణలోనే ఉండాలని కోరుకుంటున్నారని నేతలు దిగ్విజయ్ దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టును ప్రస్తుత డిజైన్‌లో నిర్మిస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని, నిపుణుల కమిటీ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని ఆయనకు వివరించారు.
 
కేంద్రంపై ఒత్తిడి తెస్తాం..

ఏడు మండలాలను ఏపీలో కలపడంపై వస్తున్న ఇబ్బందులు, గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని చట్టపరంగా, రాజ్యాంగపరంగా పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమం చేపట్టాలని నిర్ణయించామని సమావేశం అనంతరం పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు. హుదూద్ తుపాను అంశం కూడా చర్చకు వచ్చిందని, బాధితులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానం సూచించిందని ఆయన తెలిపారు. తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు వివరించారు. కాగా.. కేంద్రం గిరిజనుల హక్కులను కాలరాస్తూ ఏడు మండ లాలను ఏపీలో కలిపిందని.. కానీ అక్కడి స్థానికులంతా తెలంగాణలోనే ఉండాలని కోరుకుంటున్నారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. దీనిపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నామని, సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్నామని తెలిపారు. గిరిజనులకు అన్యాయం జరగకుండా కాంగ్రెస్ పోరాడుతుందని ఎంపీ రేణుకా చౌదరి పేర్కొన్నారు.

తెగని ఖమ్మం పంచాయితీ..

నేతల అంతర్గత పోరుతో ఖమ్మం కాంగ్రెస్‌లో ఏర్పడిన వివాదాల పరిష్కారంపై పార్టీ అధిష్టానం దృష్టిపెట్టింది. ఖమ్మం డీసీసీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి జిల్లా నాయకులకు, పార్టీ ఎంపీ రేణుకా చౌదరికి మధ్య తలెత్తిన వివాదంపై ఆ జిల్లా నేతలు, రాష్ట్ర నాయకులతో మరో భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా రేణుకా చౌదరితో తమకు వస్తున్న ఇబ్బందులపై పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి దిగ్విజయ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరువర్గాలు వాదనకు దిగాయి. జిల్లాలో తన  వర్గానికి చెందిన ఏడుగురికి ఇచ్చిన షోకాజ్ నోటీసులను వెనక్కి తీసుకోవాలని దిగ్విజయ్‌ను రేణుకా చౌదరి కోరగా... అందుకు ఆయన అంగీకరించలేదని సమాచారం. ఇక డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక విషయంలోనూ అందరూ మాట్లాడుకుని ఒక పేరును సూచించాలని దిగ్విజయ్ వారికి చెప్పినా.. ఎవరికి వారు వేర్వేరుగా పేర్లను ప్రతిపాదించారు. రెడ్డి వర్గం అయితే రాంరెడ్డి వెంకట్‌రెడ్డికి, కమ్మ సామాజిక వర్గం నుంచి అయితే రాధాకిషోర్‌కు ఇవ్వాలని పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రతిపాదించగా... రేణుకా చౌదరి, భట్టివిక్రమార్క మాత్రం పువ్వాడ అజయ్ పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది. కాగా.. పార్టీలో చిన్నచిన్న విభేదాలు సహజమేనని ఈ భేటీ అనంతరం పొన్నాల వ్యాఖ్యానించారు.
 
కేసీఆర్‌ది తుగ్లక్ పాలన: పొన్నాల
 
తెల్ల కాగితాలపై పింఛన్లు, రేషన్‌కార్డులకు దరఖాస్తు చేసుకోవాలనడం చూస్తుంటే కేసీఆర్‌ది తుగ్లక్ పాలనలా ఉందని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఢిల్లీలో దిగ్విజయ్‌సింగ్‌తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఆధార్ కింద సేకరించిన సమాచారాన్ని వినియోగించుకోలేదు.. ప్రజలను ఇబ్బందులు పెట్టి సర్వే చేశారు. ఇప్పుడు రేషన్‌కార్డులకు, పింఛన్లకు దరఖాస్తులు చేసుకోవాలనడం తుగ్లక్ పాలనే అవుతుంది..’’అని మండిపడ్డారు. ఇప్పటికే క్యూలో నిలబడి ఒక వృద్ధుడు మరణించాడన్నారు. ‘‘గతంలో ఎవరో హిట్లర్‌లా ఉన్నాడంటే.. తాను హిట్లర్ తాతను అన్నాడు. ఇప్పుడు తాను తుగ్లక్ తాతను అంటాడేమో..!’’ అని పొన్నాల ఎద్దేవా చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement