కొండాపూర్‌లో 'పూరీ' విగ్రహం పెట్టారు
చిగురుమామిడి(కరీంనగర్ జిల్లా): సినీ డైరెక్టర్ పూరిజగన్నాథ్ విగ్రహాన్ని ఆయన తనయుడు ఆకాష్ ఆవిష్కరించారు. కరీంనగర్ జిల్లా, చిగురుమామిడి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే పూరీ జగన్నాథ్ వీరాభిమాని ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. విగ్రహాన్ని ఆయన తనయుడు ఆకాష్ తో ఆవిష్కరింపజేశాడు.
అనంతరం విలేకరులతో పూరీ ఆకాశ్ మాట్లాడుతూ..దేశంలోనే ఒక సినీ డైరెక్టర్‌కు విగ్రహం ఏర్పాటు చేయడం అరుదని, అలాంటిది మా నాన్నగారి విగ్రహం కొండాపూర్‌లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే కొండాపూర్ ప్రజలు ఎంతో అభిమానంతో మా నాన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, ఈ విషయంలో కొండాపూర్ ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. అలాగే నా వంతుగా ఊరికి అభివృద్ధిలో సహకరిస్తానని చెప్పారు. విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రభాకర్‌కు ప్రత్యేక కృతజ్ఙతలు తెలిపారు.