అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు
- ఎత్తిపోతలకు రూ.50.36 కోట్లు
- పదిరోజుల్లో విడుదల చేస్తాం: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మూలన పడిన, మరమ్మతులు చేయాల్సిన ఎత్తిపోతల పథకాల కోసం పదిరోజుల్లో 50.36 కోట్లు విడుదల చేయ నున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ఈ నిధులతో 90 ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించి 70.893 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించ నున్నామని ఆయన చెప్పారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్‌ఎస్ సభ్యుడు జలగం వెంకట్రావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లిఫ్టులపై అడి గిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఎకరానికి రూ.10వేల కన్నా తక్కువ ఖర్చుతో అందుబాటులోకి వచ్చే లిఫ్టులు రాష్ట్ర వ్యాప్తంగా 90 ఉన్నాయని, వాటికి తొలిదశలో మరమ్మతులు చేస్తున్నామని మంత్రి చెప్పారు.
పాఠశాలలు, హాస్టళ్లకు గ్యాస్ కనెక్షన్లు
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లకు దీపం పథకం కింద గ్యాస్‌కనెక్షన్లు ఇస్తున్నట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. టీఆర్‌ఎస్ సభ్యురాలు బొడిగె శోభ, కోవాలక్ష్మి, రేఖా నాయక్‌లు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ తెలంగాణ ఏర్పాటయ్యే నాటికి రాష్ట్రంలో 19.85లక్షల దీపం గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, తాము వచ్చిన తర్వాత 8.51 లక్షలకు పైగా మంజూరు చేశామని చెప్పారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక బడ్జెట్ కూడా పెట్టారని చెప్పారు. అడిగిన ప్రతి ఒక్కరికీ గ్యాస్ కనెక్షన్లు అందిస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను అంచెలంచెలుగా క్రమబద్ధీకరిస్తామని చెప్పారు.
పాత జిల్లా కేంద్రాల్లో వెల్‌నెస్ సెంటర్లు
ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకం (ఈజేహెచ్‌ఎస్) కింద సేవలందించేందుకు గాను అన్ని పాత జిల్లా కేంద్రాల్లోనూ వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఇప్పటికే ఓ కేంద్రాన్ని ప్రారంభించామని, మరో ఐదుచోట్ల ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కేంద్రాల్లో ఓపీ వరకు అవసరమయ్యే అన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని, వారంలో ఒకటి లేదా రెండుసార్లు స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా ఉంచే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించే పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల పక్షాన మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు.
డెంగీని ఆరోగ్యశ్రీలో చేర్చాం
డెంగీ వ్యాధికి ఆరోగ్యశ్రీ కింద ఇప్పటికే చికిత్స అందిస్తున్నామని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో విషజ్వరాలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ఇప్పటికే డెంగీని ఆరోగ్యశ్రీలో చేర్చామని, అయితే, సెప్సిస్ అనే కోడ్‌తో అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటయిన తర్వాత 12 చోట్ల ప్లేట్‌లెట్లను వేరు చేసే కేంద్రాలను ఏర్పాటు చేశామని, విషజ్వరాలు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.
విజయ డెయిరీని ఆధునీకరిస్తున్నాం
పాడిపరిశ్రమ అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు పశుసంవర్ధకశాఖ మంత్రి తల సాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. విజయ డెయిరీని ఆధునీకరించడం ద్వారా పాలసేకరణ పెంచుతామన్నారు. డెయిరీ అవుట్‌లెట్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి అం దులో పాలతో పాటు నెయ్యి, స్వీట్లు కూడా అందుబాటులో ఉంచుతామని చెప్పారు. 104,108ల తరహాలోనే పశు వైద్యం కోసం ప్రతి నియోజకవర్గానికి ఓ మొబైల్ ఆంబు లెన్స్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా పంపుతామని చెప్పారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ఎన్‌సీడీసీ నుంచి రూ.400 కోట్ల మేర రుణం వస్తుందని, ఆ రుణంపై కౌంటర్ గ్యారంటీ ఇవ్వడంతో పాటు పావలా వడ్డీని అమలు చేసే యోచన ఉందన్నారు.