విదర్భ, మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
నాలుగు రోజులు మోస్తరు వర్షాలు
- వచ్చే నెలలో తీవ్ర వడగాడ్పులు
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
- ‘వేసవి ప్రణాళిక’ చేపట్టాలని విపత్తు నిర్వహణ శాఖకు సూచన
సాక్షి, హైదరాబాద్: విదర్భ, మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో రానున్న 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని శుక్రవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మధ్యాహ్నం వరకు యథావిధిగా ఎండలు.. సాయంత్రం మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మేఘాలు ఆవరించి ఉన్నా ఉక్కపోతగా ఉంటుందని పేర్కొంది. కాగా, శుక్రవారం ఖమ్మం, నల్లగొండ, రామగుండంలలో 43 డిగ్రీల సెల్సియస్ చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వచ్చే నెలలో తీవ్ర వడగాల్పులు..
వచ్చే నెల వడగాడ్పుల తీవ్రత మరింత ఉంటుందని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీచేసింది. మే నెలలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 47 డిగ్రీలకు చేరుతాయని స్పష్టం చేసింది. దీంతో వడగాడ్పులు తీవ్రంగా వీస్తాయని తెలిపింది. విపత్తు నిర్వహణ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరింది. సాధారణ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు నాలుగైదు డిగ్రీలు ఎక్కువగా అంటే వడగాడ్పులుగా లెక్కిస్తారు. 6 డిగ్రీలు అధికంగా ఉంటే తీవ్ర వడగాడ్పులుగా ప్రకటిస్తారు. వడగాడ్పులు ఉన్నప్పుడు వేసవి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని, లేకుంటే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ముఖ్యంగా ఆరుబయట పనిచేసే ఉపాధికూలి పనులను ఉదయం వేళల్లోనే చేయించాలి. వడగాడ్పుల సమయంలో ప్రయాణాలు మానుకోవాలి. బస్సు వేళల్లోనూ అధికారులు మార్పులు చేయాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బస్సులు నడపకూడదు. ఇలాంటివన్నీ కూడా వేసవి ప్రణాళికలో విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు జిల్లాల్లోనూ వేసవి ప్రణాళికలు అమలుచేస్తున్నారని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌లలో)
ప్రాంతం ఉష్ణోగ్రతలు
ఖమ్మం 43
నల్లగొండ 43
రామగుండం 43
ఆదిలాబాద్ 42.5
భద్రాచలం 42
హన్మకొండ 42
నిజామాబాద్ 41.9
మెదక్ 41.6
హైదరాబాద్ 41.3
మహబూబ్‌నగర్ 41.2