టి.రాజయ్య
హైదరాబాద్: తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య అపోలో ఆస్పత్రి నుంచి మంగళవారం రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో రాజయ్యను ఈ సాయంత్రం హైదర్గూడ అపోలో ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. రాజయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు బీపీ, పల్స్ రేటు పెరిగినట్లు గుర్తించారు. రాజయ్యకు బీపీ, షుగర్ ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడంతో ఆయన మనస్థాపం చెందినట్లు అనుచరులు చెబుతున్నారు.
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రాజయ్య మాట్లాడుతూ బర్తరఫ్ మాటవిని ఆవేదన చెందానని చెప్పారు. తన పొరపాటు ఉంటే విచారణ జరిపించాలని అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. వైద్యులు అన్ని పరీక్షలు చేశారని చెప్పారు. వైద్యుల సహకారంతో ఇంటివద్దే ఉండి చికిత్స పొందుతానన్నారు. రేపు మళ్లీ ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకుంటానని చెప్పారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని కోరారు.