ప్రెస్మీట్ రద్దు చేసుకున్న రాజయ్య
హైదరాబాద్ : తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య తన ప్రెస్మీట్ను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. ఆయన మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రెస్మీట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రాజయ్య రాజకీయంగా కీలక నిర్ణయం ప్రకటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ప్రెస్మీట్ రద్దు అయినట్లు రాజయ్య సన్నిహితులు ధ్రువీకరించారు. కాగా ప్రెస్మీట్ రద్దుకు గల కారణాలు తెలియరాలేదు.
కాగా ముఖ్యమంత్రి కేసీఆర్తో రాజయ్య సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యాక రాజయ్య సీఎంను కలవడం ఇదే మొదటిసారి. సుమారు ఇరవై నిమిషాల పాటు రాజయ్య సీఎం వద్ద ఉన్నారు. తొందరపడొద్దని, మంచి రోజులు ఉన్నాయని, కొంత ప్రవర్తన మార్చుకోవాలని రాజయ్యకు సీఎం సూచించారని, సుతిమెత్తగా మందలించారని సమాచారం.
తనకు తెలిసి ఎలాంటి తప్పు చేయలేదని, కొందరు అధికారులు తనను మభ్యపెట్టారని రాజయ్య జవాబిచ్చుకునే ప్రయత్నం చేశారని తెలిసింది. అయిదారు నెలల పాటు ఓపిక పడితే, మరో పదవి ఇస్తామని భరోసా కూడా లభించిందని చెబుతున్నారు. సమావేశం అనంతరం రాజయ్య మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలోనే పని చేస్తానన్నారు. మంగళవారం జరిగే పార్టీ సమావేశానికి ఆహ్వానించారని తెలిపారు.