కడియం దారెటు ?
ఏమాత్రం ఊహించనైనా ఊహించకుండా అందివచ్చిన ఉప ముఖ్యమంత్రి పదవిలో కడియం శ్రీహరి ఎన్నాళ్లు కొనసాగుతారు? అసలు ఆయన దారి లోక్‌సభ వైపా, లేక శాసన మండలి వైపా? రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్న ప్రశ్నలు ఇవి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్ ఎంపీగా కడియం ఎన్నికయ్యారు. డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న డాక్టర్ రాజయ్యను ఆ పదవి నుంచి తప్పించాల్సి రావడంతో సీఎం కేసీఆర్ కుల, వర్గ సమీకరణలు బేరీజు వేసుకుని, కడియం శ్రీహరిని ఆ పీఠం పైకి ఎక్కించారు. ఇది బాగానే ఉన్నా, ఆయన ఇప్పటి దాకా ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు.
రాష్ట్ర కేబినెట్‌లో చేరిన ఆరునెలల్లోపు ఆయన ఉభయ సభల్లో ఎందులోనో ఒక దాన్లో సభ్యుడు కావాల్సి ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి, ఆయనను శాసన మండలికి పంపుతారని అంతా ఊహించారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ పదవుల భర్తీకి షెడ్యూలు కూడా విడుదలైంది. ఇంతలోనే కడియం ఎంపీగానే కొనసాగుతారని, డిప్యూటీగా తప్పుకుంటారనే ప్రచారం గుప్పుమంటోంది. ఆయన రాజీనామా చేయక పోవడమూ బలం చేకూరుస్తోంది. కడియం ఖాళీ చేస్తే వరంగల్ స్థానం నుంచి మళ్లీ పోటీ చేయడం, గెలవడం అన్నీ తలనొప్పులే అన్న భావన టీఆర్‌ఎస్ హైకమాండ్‌లో ఉందంటున్నారు. ఈ రిస్కు కంటే కడియంను ఎంపీగా కొనసాగించడమే మంచిదని భావిస్తున్నట్టున్నారు. అంటే ఆయన ‘ఉప ’పోస్టును వదులుకోవాల్సిందేనా? తిరిగి ఆయన హస్తిన బాట పట్టాల్సిందేనా?