రాజయ్యకు రంది!
ఉప ముఖ్యమంత్రికి వరుసగా ఎదురుదెబ్బలు
సాంబశివరావుపై వేటుతో కొత్త ఇబ్బందులు
‘తాటికొండ’కు సన్నిహితుడు డీహెచ్
పట్టుబట్టి పోస్టింగ్ ఇప్పించిన డిప్యూటీ సీఎం
వరంగల్ : అనూహ్య రీతిలో ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తాటికొండ రాజయ్యకు రాజకీయంగా, పరిపాలనా పరంగా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వైద్య, ఆరోగ్య శాఖలో పరిపాలనా పరమైన నిర్ణయాలపై అవినీతి ఆరోపణలు రావడం.. సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాజయ్యకు ప్రతికూల పరిస్థితులు వచ్చాయనే అభిప్రాయం వ్యక్తమైంది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా రాజయ్య నియమించిన బి.రాజును తొలగించారు. ఇలా వరుస నిర్ణయాలతో రాజయ్యకు రాజకీయంగా ఇబ్బందు లు తప్పవనే ప్రచారం జరిగింది.
నియామకాలు, స్వైన్‌ఫ్లూ విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల తీరును తప్పుపట్టిన కేసీఆర్.. ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్యకు ఒకింత మద్దతు ఇచ్చినట్లుగా మంగళవారం ప్రకటన చేశారు. ఇది జరిగిన 12 గంటల్లోనే ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వైద్య, ఆరోగ్య శాఖ డెరైక్టరు పి. సాంబశివరావుపై వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ఈ పోస్టు నుంచి తప్పించి ఐఏఎస్ అధికారి జ్యోతి బుద్ధప్రకాశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు సాంబశివరావు అత్యంత సన్నిహితుడు. సాంబశివరావుపై ప్రభుత్వం ఇలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవడం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా రాజయ్యకు ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రంలో ఇబ్బందికరంగా మారిన స్వైన్‌ఫ్లూ నియంత్రణలో విఫలమైన కారణంగానే సాంబశివరావును డెరైక్టరు పోస్టు నుంచి తప్పించారనే ప్రచారం జరిగింది. అసలు కారణం ఇది కాదని అధికారికంగా ప్రకటన రావడంతో.. అవినీతి ఆరోపణలే దీనికి కారణమని తెలుస్తోంది.
అవినీతి ఆరోపణలు
తాటికొండ రాజయ్య జూన్ 2న ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అప్పటికి వరంగల్ జిల్లా వైద్యాధికారిగా ఉన్న సాంబశివరావుకు జూలై 1న ప్రాంతీయ డెరైక్టరు పోస్టు ఇచ్చారు. ఆయనపై శాఖ పరమైన అవినీతి ఆరోపణలు ఉన్నా ప్రాంతీయ డెరైక్టరు పోస్టు ఇచ్చారు. మళ్లీ సాంబశివరావుకు జూలై 31న వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర డెరైక్టరుగా పోస్టింగ్ పొందారు. ఈ అత్యున్నత పోస్టు ఆయనకు వచ్చేందుకు రాజయ్యతో ఉన్న సాన్నిహిత్యమే ప్రధాన కారణమనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది.
ఈ పోస్టింగ్ విషయంలో పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. వైద్య, ఆరోగ్య శాఖలో తాత్కాలిక, ఔట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ విషయంలోనే ఉన్నతాధికారులపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. వరంగల్ జిల్లా వైద్యాధికారిగా ఉన్నప్పుడు తనకు దగ్గరగా ఉన్నవారిని మధ్యవర్తులుగా పెట్టుకుని రాష్ట్ర స్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్‌లు ఇచ్చేందుకు సాంబశివరావు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. వైద్య, ఆరోగ్య శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ఈ విషయాల్లో చూసిచూడనట్లుగా ఉండడం ఆయనపైనా విమర్శలు వచ్చేలా చేసింది. చివరికి ఇది సాంబశివరావుపై వేటుతో ఆగింది.
అంతా ఆరు నెలల్లోనే..
జఫర్‌గఢ్‌కు చెందిన డాక్టర్ పిల్లి సాంబశివరావు ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్య విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ వైద్యుడిగా కొనసాగుతూ ఒక్కొమెట్టు పైకి ఎదిగారు. 2011 నవంబరు 6న వైద్య ఆర్యోగ శాఖ జిల్లా అధికారి(డీఎంహెచ్‌వో)గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఎంజీఎం ఆస్పత్రిలో ఆర్‌ఎంవోగా పని చేశారు. జూన్ 2న ప్రాంతీయ డెరైక్టరుగా ఉన్న సాంబశివరావు రాష్ట్ర డెరైక్టరుగా పోస్టింగ్ దక్కించుకున్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్(ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) పోస్టింగ్‌ల విషయంలో ఆరోపణలతో ఆరు నెలల్లోనే ఈ పోస్టు నుంచి తొలగింపునకు గురయ్యారు.