గులాబీ తోటలో స్టేషన్ ఘన్‌పూర్ పంచాయతీకి తెర పడిందా? కొన్నాళ్లుగా మాటల యుద్ధం చేసుకుంటున్న కడియం, రాజయ్యలకు అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా? లేక ఇద్దరి మధ్యా రాజీ కుదిరిందా? సీటు విషయంలో ఎవరిది పై చేయి అయింది? ఇంకొకరికి ఎటువంటి హామీ లభించింది? ఇకముందు ఇద్దరూ సైలెంట్‌గా ఉంటారా? మరోసారి రెచ్చిపోతారా?..
తెలంగాణలో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రుల సీటు వివాదం కొత్తమలుపు తిరిగింది. కొంతకాలంగా ఇద్దరి మధ్యా సాగుతున్న డైలాగ్‌వార్‌కు పార్టీ నాయకత్వం చెక్ పెట్టింది. ఇద్దరినీ హైదరాబాద్‌కు పిలిపించి పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సున్నితంగా మందలించారు. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అటు కేసీఆర్‌ను ఇటు కేటీఆర్‌తోనూ సమావేశమయ్యారు.
కేటీఆర్‌ను కలిసిన రాజయ్య
రాజయ్య మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాత్రమే కలిసారు. తొలి నుంచీ రాజకీయ ప్రత్యర్థులైన కడియం, రాజయ్యలు బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత కూడా అదే పోకడ కొనసాగించారు. డిప్యూటీ సీఎంలుగా ముందు రాజయ్యకు, తర్వాత కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం ఇచ్చారు. అయితే వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌పూర్ సీటు విషయంలో ఇద్దరి మధ్యా పోరు తీవ్రంగా సాగుతోంది. ఇంకా ముదిరితే పార్టీకే నష్టమని పార్టీ నాయకత్వం పార్టీ క్రమశిక్షణ అధిగమించవద్దని ఇద్దరినీ సున్నితంగా మందలించి పంపింది.
రాజయ్య అవినీతిపై కడియం వివరణ..
హైదరాబాద్ నుంచి పిలుపు రాగానే హడావుడిగా వచ్చి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. అంతకు రెండు రోజుల ముందు కడియం శ్రీహరి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ని, కేటీఆర్‌ను కలిసారు. తాను కడియంపై కొత్తగా ఏమీ ఆరోపణలు చేయలేదని, గతం నుంచి ఆయన మీద ఉన్నవేనని రాజయ్య.. కేటీఆర్‌కు వివరణ ఇచ్చుకున్నారు. అదేవిధంగా రాజయ్య అవినీతి గురించి కడియం పార్టీ పెద్దలకు వివరించినట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతలకు వార్నింగ్ ఇచ్చి.. ఎవరి భవిష్యత్ అయినా కేసీఆర్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు కేటీఆర్. అయితే స్టేషన్‌ఘన్‌పూర్ సీటు విషయంలో ఈసారి కడియం శ్రీహరి పోటీ చేయడానికి కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నియోజకవర్గంలో పుకార్లు షికారు చేస్తున్నాయి.
స్పీడ్ పెంచిన శ్రీహరి
ఎమ్మెల్సీగా ఉన్న కడియం తన నియోజకవర్గంగా స్టేషన్ ఘన్‌ఫూర్ ఎంపిక చేసకుని.. మరింత దూకుడుగా వ్యవహరించడం వెనుక మర్మం ఏమిటన్న చర్చ జరుగుతోంది. నిరంతరం వివాదాల్లో చిక్కుకుంటున్న రాజయ్యకు బదులుగా ఈసారి కడియం శ్రీహరి వైపు గులాబీ దళపతి మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే సభలు, సమావేశాలను ముమ్మరంగా నిర్వహిస్తున్న కడియం నియోజకవర్గంలో తన ఫ్లెక్సీల కోసం మండలానికి 10 లక్షలు చొప్పున పంపిణీ చేశారన్న టాక్ నడుస్తోంది. కడియం, రాజయ్య మధ్య వివాదం తీవ్రం కావడంతో జనగామకు చెందిన ఒక ప్రభుత్వాధికారిని తెరమీదకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో నియోజకవర్గానికి చెందిన సీఎం ముఖ్య అనుచరుడు ఒకరు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
మరో ఎమ్మెల్సీ ఎంట్రీ..
ఘన్‌పూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య వివాదం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని కనుగొనే పనిలో పార్టీ అధిష్టానం నిమగ్నమయిందట. అసలు విషయం తేల్చకుండా ఇంతకాలం కలిసి పనిచేసుకోండని చెప్పినా ఎలాంటి ఫలితం కనిపించడంలేదు. ఇద్దరి మధ్య మరో ఎమ్మెల్సీ ఎంట్రీ కారణంగానే ఘన్‌పూర్ అడ్డా అధికార పార్టీలో రాజకీయ దుమారం చెలరేగిందని స్థానిక నాయకులు భావిస్తున్నారు. టిక్కెట్ విషయంలో వెంటనే స్పష్టత ఇచ్చి..పార్టీ ఐక్యత దెబ్బతినకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఘన్‌పూర్ గులాబీ శ్రేణులు అధిష్టానాన్ని కోరుతున్నాయి.
ఇది కూడా చదవండి: చంద్రబాబు వారసుడు రేవంత్
Comments
Please login to add a commentAdd a comment