
సాక్షి, హైదరాబాద్: రేషన్ సరుకుల పంపిణీ బదులు నగదు బదిలీని వర్తింపజేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని తెలంగాణ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. నగదు బదిలీని అమలు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించింది. ఆదివారం ఈ మేరకు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయి కోటిరాజు, కార్యదర్శి ఆనంద్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. నగదు బదిలీతో రాష్ట్రవ్యాప్తంగా 17,200 రేషన్ డీలర్ల కుటుంబాలు వీధిన పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల నలుగురు రేషన్ డీలర్లు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తుచేశారు.
అవినీతికి ఆస్కారం లేకుండా 14 జిల్లాలో ఈపాస్ మిషన్ల ద్వారానే రేషన్ సరుకులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఎల్‌ఎస్ పాయింట్లలోని 50 కేజీల బియ్యం బ్యాగు డీలర్ వద్దకు వచ్చే సరికి 47 కిలోలకే పరిమితమవుతోందన్నారు. గోదాముల్లో జరిగే అవకతవకలకు డీలర్లను బాధ్యులు చేయడం సరికాదన్నారు. ఈ నెల 27న హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో బహిరంగ సభ నిర్వహిస్తామని, ఇందులో రేషన్ డీలర్ల జాతీయ అధ్యక్షుడు దేశ్‌ముఖ్ కాకా, కార్యదర్శి విశ్వంభర్‌తోపాటు ప్రహ్లాద్‌మోదీ పాల్గొంటారని తెలిపారు. సభ అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment