అక్రమాలు ఆగలె! | ration rice smuggling in district | Sakshi
Sakshi News home page

అక్రమాలు ఆగలె!

Published Thu, Sep 4 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM

ration rice smuggling in district

ఖమ్మం జడ్పీసెంటర్ :  జిల్లాలో బియ్యం అక్రమ దందా కొనసాగుతూనే ఉంది.  పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. డీలర్లు, మిల్లర్ల మాయజాలంలతో రీసైక్లింగ్ రూపంలో దారి మళ్లుతోంది. దీనిని అరికట్టాల్సిన అధికారులు తూతూమంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు. జూన్, జూలై నెలలో  చేసిన నామమాత్రపు దాడుల్లో దొరికిన రేషన్ సరకుల విలువ రూ.36,39 లక్షల్లో ఉంది. పూర్తి స్థాయిలో దాడులు చేస్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. అయినా అధికారులు ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని తెలుస్తోంది. కింది స్థాయి అధికారులపై జిల్లా అధికారుల అజమాయిషీ లేక పోవడమే బియ్యం అక్రమ దందాకు కారణమనే విమర్శలు వస్తున్నాయి.

 అక్రమార్జనకు ఇదే నిదర్శనం
 రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం తెల్లరేషన్‌కార్డుపై రూపాయికి పంపిణీ చేస్తోంది. డీలర్లు, ప్రజల నుంచి చిరువ్యాపారులు రేషన్ బియాన్ని రూ.8 నుంచి రూ.10కు కొనుగోలు చేస్తున్నారు. దీనిని  కొద్ది మొత్తం రేటు పెంచి మిల్లర్లు కొనుగోలు చేస్తున్నారు. మిల్లులకు తరలిన బియ్యాన్ని  రీసైక్లింగ్ ద్వారా సన్నగా మార్చి, ఇతర రకాల్లో కలిపి బహిరంగ మార్కెట్లకు తరలిస్తున్నారు. కిలో రూ.25 నుంచి రూ.30 వరకు అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లా కేంద్రం  సమీపంలో వైరా కేంద్రంగా బియ్యం రీ సైక్లింగ్ అక్రమ వ్యాపారం సాగుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయినా అధికారులు మిల్లర్లపై దాడులు నిర్వహించిన దాఖలాలు లేవు.

 బినామీల జోరు
 రేషన్ వ్యవస్థలో ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టినట్లు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. కానీ జిల్లా వ్యాప్తంగా రేషన్ డీలర్లలో సగానికిపైగా బినామీలే ఉన్నట్లు సాక్షాత్తు  సివిల్ సప్లై అధికారులు చెబతున్నారు.  రాజకీయ పలుకుబడితో అధిక సంఖ్యలో బినామీల గుప్పిట్లో షాపులు నడుస్తుండడంతో అధికారులు దాడులు చేయడం లేదనేది బహిరంగ రహస్యం. జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ వ్యవస్థపై దృష్టి సారించి అసలు, న కిలీల జాబితాను తేల్చితేనే పౌరసరఫరాల వ్యవస్థ గాడిలో పడే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 
 మామూళ్ల మత్తులో యంత్రాంగం
 నిత్యావసర సరకులపై  నిత్యం నిఘా ఉంచాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వెలు ్లవెత్తుతున్నాయి. ప్రతినెలా జిల్లా స్థాయి అధికారుల ఆదేశాల మేరకు నామమాత్రపు డాడులు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. గడిచిన రెండు నెలల్లో జిల్లా వ్యాప్తంగా చేసిన దాడుల్లో  838.63 క్వింటాళ్ల బియ్యం పట్టుబడినట్లు అధికారులు చెబుతున్నారు.

అదే పూర్తిస్థాయిలో నిఘాను పెంచి షాపులు, మిల్లర్లపై దాడులు చేస్తే మరింత ఫలితం ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. జూన్‌లో పౌర సరఫరాల శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో 57 కేసులు నమోదు చేశారు. దాడుల్లో రేషన్ బియ్యం 460 క్వింటాళ్లు, కందిపప్పు 3 క్వింటాళ్లు, కిరోసిన్ 1,730 లీటర్లు, 27 గ్యాస్ సిలిండర్లు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ. 12,06,173గా గుర్తించారు. అలాగే జూలైలో 47 కేసులు నమోదు కాగా బియ్యం 378.63 క్వింటాళ్లు, 2.770 లీటర్ల కిరోసిన్,  376 కేజీల కందిపప్పు, 5 క్వింటాళ్ల పంచదార పట్టుబడింది.
 
కానరాని విజిలెన్స్ దాడులు
 జిల్లా వ్యాప్తంగా ఉన్న మిల్లుల్లో అక్రమ బియ్యం, కందిపప్పు నిల్వలు ఉన్నప్పటికీ జిల్లా అధికారులు దాడులు నిర్వహించకపోవడం వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  మిల్లుల్లో అక్రమ నిల్వలపై గతంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి వేల క్వింటాళ్ల నిత్యావసర వస్తువులు స్వాధీనం చేసుకున్న సంఘటనలు అనేక ఉన్నాయి. అయితే ఇటీవల మిల్లర్లపై దాడులు నిర్వహించేందుకు విజిలెన్స్ అధికారులు సాహసించడంలేదనే వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. అక్రమ నిల్వలపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement