చండూరు: డీలర్లు రేషన్ సరుకుల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇక ఆన్‌లైన్(మీసేవ)లో నగదు చెల్లిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే సరుకులు సరఫరా చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆగస్టు నెలకు సంబంధించిన సరుకులకు బుధవారం నుంచి మీ సేవలోనే డీలర్లు నగదు చెల్లించే విధంగా డీఎస్‌ఓ కార్యాలయం నుంచి సంబంధిత అధికారులకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి. గతంలో డీలర్లు బ్యాంకులలో నగదు చెల్లించి డీడీలు తీసుకుని ఆ డీడీలను తహసీల్దార్ కార్యాలయంలో అందజేస్తే అప్పుడు గానీ సెక్షన్‌లో ఆర్‌ఓ(రిలీజ్ ఆర్డర్) రాసి ఐఎంజీ గోదాంకు పంపిస్తే ఆ గోదాం ఇన్‌చార్జి రేషన్ షాపులకు సరుకులు పంపిణీ చేసే వారు.ఈ ప్రక్రియతో వినియోగదారులకు సరైన సమయంలో రేషన్ అందించ లేక పోతున్నామని ఆన్‌లైన్ తో వేగంగా సరుకులను రేషన్ షాపులకు చేరవేయ వచ్చని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వినియోగదారులకు ,డీలర్ల కు సమయం ఆదా అవుతుంది.
ప్రక్రియ ఇలా..
డీలర్లు మీ సేవ లో నగదు చెల్లిస్తే ఆ సెంటర్ నిర్వాహకుడు డీలర్లకు ఓ రశీదు ఇస్తారు. చెల్లించిన నగదుపై ఆర్‌ఓను నేరుగా సివిల్‌సప్లయ్ డీఎంకు మీ సేవ కేంద్రం నుంచి పంపిస్తారు. దీంతో ఆ కార్యాలయం నుంచి సంబంధిత ఐఎంజీ పాయింట్‌కు ఆర్‌ఓలు జారీ చేస్తారు. గోదాం ఇన్‌చార్జిలు రేషన్ షాపులకు సరుకులను పంపిణీ చేస్తారు. నిత్యం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అధికారులకు సమాచారం అందుబాటులో ఉంటుంది.
డీలర్లకు తగ్గనున్న ఖర్చు ..
ఆన్‌లైన్ ప్రక్రియతో డీలర్లకు డీడీల ఖర్చు కొంత మేర తగ్గనుంది. బ్యాంకులలో రూ. 10 వేల లోపు డీడీ కోసం రూ.30 , ఆ పైన రూ. 50నుంచి రూ. 100 వరకు ఖర్చు వచ్చేది. ఇక ఆ సమస్య లేదు. ఒకే ఒక్క సరుకు డబ్బులు చెల్లిస్తే రూ.10 మాత్రం రుసుం తీసుకుంటారు. ఆ సరుకుకు ఎంత డబ్బులు చెల్లించినా పర్వాలేదు. ఎన్ని సరుకులకు చెల్లిస్తే అన్ని పది రూపాయల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు బియ్యం, చక్కెరకు రుసుము రూ. 20 తీసుకుంటారు. ఈ విధానం వల్ల సమయం ఆదా అవుతుంది. డీడీలు కట్టడం మొదలుకొని ఆర్‌ఓలు గోదాంలకు చేరుకునే వరకు రెండు మూడు రోజుల సమయం పట్టేది. కేవలం అరగంటలో పని పూర్తవుంది.
‘రేషన్’కూ ఆన్‌లైన్
Published Wed, Jul 22 2015 1:31 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement
Advertisement