గ్యాంగ్ రేప్ నిందితులపై రౌడీషీట్?
హైదరాబాద్ : పాములతో భయపెట్టి యువతిపై గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడిన నిందితులపై రౌడీషీట్ తెరిచేందుకు సైబరాబాద్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. నిందితులకు పాత కేసులలో కూడా ప్రమేయం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. హత్యలు, దారి దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలు ఇలా ఎన్నో కేసులలో వీరికి సంబంధం ఉంది.
చాలా ఘటనలలో కేసులు నమోదు కాకుండా బాధితులను వారు బెదిరించినట్లు దర్యాప్తులో తేలింది. గత నెల 31న యువతిపై సామూహిక అత్యాచారం జరిపిన వారిలో ఫైసల్ దయానీ, ఖాదర్ బారక్‌బా, తయ్యబ్ బాసలామా, మహ్మద్ పర్వేజ్‌లు ప్రధాన నిందితులు. ఈ నలుగురు లై ంగిక దాడికి పాల్పడుతుండగా అన్వర్, ఖాజా అహ్మద్ , మహ్మద్ ఇబ్రహీంలు యువతిని బంధించిన విషయం తెలిసిందే.
ఒంటరి జంటలు కనిపిస్తే చాలు
రోడ్డుపై ఒంటరిగా వెళుతున్న జంటలు కంటికి కనిపిస్తే దాడి చేయడం వీరికి అలవాటు. ఇటీవలే షాయిన్‌నగర్‌లో ఓ మహిళను భర్త వేధించాడని... ఆ వ్యక్తిపై దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. వీటితో పాటు మరో మూడు కేసులలో ప్రేమ జంటలు, దంపతులపై దాడి చేసి నగ్నంగా ఫోటోలు తీసి బెదిరించారు. ఖాదర్ బారక్ బాపై మర్డర్ కేసుతో పాటు మరో మూడు కేసులు పహాడీషరీఫ్‌లో నమోదయ్యాయి. తయ్యబ్ బా సలామా పలు దొంగతనాల కేసులలో నిందితుడు. భూ కబ్జాలలో కూడా వీరికి ప్రమేయం ఉంది.
ఇదే విషయమై ఓ మహిళపై దాడి చేశారు. చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో ఒక నిందితుడు సెటిల్‌మెంట్లు చేసేవాడని తెలుస్తోంది. దీనిపై విచారణ జరుపుతున్నామని స్థానిక ఇన్‌స్పెక్టర్ రామారావు తెలిపారు. షాయిన్‌నగర్, జల్‌పల్లి ప్రాంతాలలో ప్రధాన నిందితుడు ఫైసల్ దయానీ అరాచకాలు కోకొల్లలని ప్రజలు వెల్లడిస్తున్నారు.
షాయిన్‌నగర్‌లో బస్తీలలో తిరిగే మేకలను కూడా వదిలేవాడు కాదని ఓ బాధితుడు తెలి పాడు. వీరంతా పాములను పట్టుకుని వాటితో పట్టపగలు నడిరోడ్డుపైనే వీరంగం సృష్టిస్తారు. బెదిరించి దారి దోపిడీలు చేస్తారు. దీంతో వీరి జోలికి ఎవరు పోవాలన్నా భయపడేవారు. గ్యాంగ్‌రేప్ ఘటనతో పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో ఈ ముఠా ఆట కట్టినట్లయ్యింది.
ఏడుగురిపై రౌడీషీట్లు: ఇన్‌స్పెక్టర్
గ్యాంగ్‌రేప్ ఘటనలో ఏడుగురు నిందితులపై త్వరలోనే రౌడీషీట్లు తెరుస్తామని పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్ డి.భాస్కర్‌రెడ్డి సాక్షికి తెలిపారు. వీరందరిపై ఇప్పటికే నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపించామన్నారు. చార్జీషీట్‌ను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఈ ముఠాపై ఫిర్యాదులు అందని కారణంగా కేసులు నమోదు కాలేదని, బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.