శివార్లలో రేవ్‌పార్టీల కల్చర్
శివార్లలో నయా కల్చర్
రిసార్టులు, ఫాంహౌస్‌లలో తరచూ అసాంఘిక కార్యకలాపాలు
కొరవడిన పోలీసుల నిఘా!
మొయినాబాద్: డీజే సౌండ్ హోరు... కురచ దుస్తుల్లో యువతుల నృత్యాలు.. చుట్టూ యువకులు చిందులు.. మత్తులో తేలుతున్న వారు తమను తాము మరిచిపోయి మరో ప్రపంచంలో తేలియాడుతుంటారు. ఇదీ.. శివార్లలో తరచూ జరుగుతున్న ‘పార్టీ’ల కథ. ఒకప్పుడు గోవా, ముంబై, బెంగళూరు వంటి పెద్ద నగరాలకే పరిమితమైన రేవ్‌పార్టీల కల్చర్ కొంతకాలం క్రితం హైదరాబాద్‌కు చేరింది. ఇప్పుడునగర శివార్లకు వ్యాపిస్తోంది. శివారు ప్రాంతాల్లో ఉన్న ఫాంహౌస్‌లు, రిసార్ట్స్‌లలో తరచూ వెలుగుచూస్తుండడంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. రేవ్ పార్టీలు రూపుమార్చుకుని ముజ్రా పార్టీల వైపు అడుగులు వేస్తున్నాయి.
నగర శివారుల్లో బడాబాబులకు చెందిన రిసార్టులు, ఫాంహౌస్‌లు అధికంగా ఉన్నాయి. మొయినాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి, శంషాబాద్, రాజేంద్రనగర్, మేడ్చల్, శామీర్‌పేట్, కీసర, ఘట్‌కేసర్ తదితర ప్రాంతాల్లో సుమారు రెండు వేలకు పైగా ఉన్నాయి. వీకెండ్‌లలో పార్టీల జోరు పెరుగుతోంది. యువత బలహీనతను ‘క్యాష్’ చేసుకుంటున్న కొందరు.. రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలను నిర్వహిస్తున్నారు.
అక్రమార్కులు రాత్రివేళల్లో ఇలాంటి పార్టీలు నిర్వహిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలు, విదేశీ యువతులను రప్పించి అశ్లీల నృత్యాలు చేయిస్తూ యువతను ఆకర్షిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో అధికంగా విద్యా సంస్థలు ఉండడం నిర్వాహకులకు మరింత కలిసి వస్తోంది. ఈ పార్టీల్లో వ్యభిచారం కూడా జరుగుతోంది. నెల రోజుల వ్యవధిలోనే జిల్లాలో నాలుగు చోట్ల పోలీసులు దాడి చేసి ‘పార్టీ’లను భగ్నం చేశారంటే పరిస్థితి తీవ్రత తెలుస్తోంది.
తరచూ వెలుగు చూస్తున్న వైనం...
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో తరచూ రేవ్ పార్టీలు, ముజ్రా పార్టీలు తరచూ వెలుగుచూస్తున్నాయి. నెల రోజుల క్రితం మేడ్చల్ మండలం యాడారంలోని ఓ ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.
కొంతకాలం క్రితం పరిగి సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో నగరానికి చెందిన యువకులు పార్టీ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇటీవల జవహర్‌నగర్‌లోనూ పోలీసులు రేవ్ పార్టీ భగ్నం చేశారు. తాజాగా సోమవారం అర్ధరాత్రి మొయినాబాద్ మండలం చిలుకూరులోని ఓ వెంచర్‌లో ఉన్న ఇంట్లో ముజ్రా పార్టీ నిర్వహిస్తుండగా సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీ సులు దాడిచేసి పట్టుకున్నారు. 22 మంది యువకులు, 8 మంది యువతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
కొరవడిన నిఘా...
రిసార్టులు, ఫాంహౌస్‌లపై నిఘా కొరవడింది. దీంతో నిర్వాహకులు రెచ్చిపోయి వీటిల్లో పార్టీలను నిర్వహిస్తున్నారు. తరచూ పోలీసులు దాడులు చేసి హడావుడి చేస్తున్నారే తప్ప నిఘా ఏర్పాటు చేయడం లేదు. మరోపక్క అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కినవారికి కఠిన శిక్షలు పడకపోవడంతో వారు జంకడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులకు పట్టుబడితే ఇలా రిమాండుకు వెళ్లి అలా బయటకు వచ్చేయొచ్చు అని యువతీయువకులు భావిస్తున్నారు.
నోటీసులు జారీ చేస్తున్నాం:
కె.రమేష్‌నాయుడు, డీసీపీ, శంషాబాద్ జోన్
శివారు ప్రాంతాల్లో పార్టీల కల్చర్ పెరుగుతోంది. దీన్ని అరికట్టేందుకు నిఘాను పెంచాం. రిసార్టులు, ఫాంహౌస్‌లకు నోటీసులు జారీ చేస్తున్నాం. న్యూ ఇయర్ స్వాగత వేడుకలు నిర్వహించే వారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలి. వారు ఎలాంటి పార్టీలు నిర్వహిస్తారో ముందే చెప్పాలి. ఫాంహౌస్‌లు, రిసార్టుల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నాం.