ఆర్‌ఢీఎస్
గద్వాల: రాజోలిబండ నీటి మళ్లింపు పథకం (ఆర్డీస్) వద్ద మరోసారి రగడ రాజుకుంది. మంగళవారం పనులను పరిశీలించేందుకు వెళ్లిన పాలమూరు జిల్లా రైతులను కర్నూలు రైతులు అడ్డుకున్నారు. కర్నూలు కలెక్టర్ విజయమోహన్ ఎదుటే దౌర్జన్యానికి దిగారు. తమ జిల్లాలోకి అడుగుపెట్టొద్దు..! అంటూ గెంటివేశారు. అక్కడే ఉన్న పోలీసులకు ఏం చేయాలో దిక్కుతోచలేదు.
ఈనెల 6న ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్‌లో కర్నూలు జిల్లావైపు స్పిల్‌వే గోడపై కాంక్రీట్ స్లాబు పనులను కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు, రైతులు అడ్డుకున్న విషయం తెలిసిందే.. దీనిపై మన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలకు పనులు కొనసాగేలా సహకరించాలని లేఖ రాసింది. స్పందించిన కర్ణాటక ప్రభుత్వం పోలీసుల రక్షణలో పనులు ప్రారంభించాలని నిర్ణయించింది. విషయం తెలిసిన కర్నూలు జిల్లా కలెక్టర్ విజయమోహన్, ఇతర అధికారులు తాము సందర్శిస్తామని రాయిచూర్ కలెక్టర్‌కు సమాచారం అందించారు.
ఏం జరిగిందంటే..
ఈక్రమంలో మంగళవారం రెండు జిల్లాల కలెక్టర్లు ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ వద్దకు వస్తున్నారని తెలిసి ఆర్డీఎస్ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ తనగల సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో పాలమూ రు రైతులు అక్కడికి చేరుకున్నారు. ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్‌లో చేపడుతున్న పనుల వాస్తవాలను కర్నూలు కలెక్టర్‌కు వివరించేందుకు య త్నించారు.
దీంతో ఆగ్రహించిన మంత్రాల యం రైతులు తెలంగాణ వాళ్లు చెప్పేదేంటి అంటూ తిట్ల వర్షం కురిపించారు. ఒకానొకదశలో మంత్రాలయ నియోజకవర్గ రైతులు సీతారామిరెడ్డిని తోసివేసే ప్రయత్నం చేశారు. ఇంతలో మంత్రాలయ సీఐ షాకీర్ హుసేన్ అప్రమత్తమై పోలీసుల రక్షణలో ఆర్డీఎస్ రైతులను కర్ణాటక పరిధిలోకి పంపాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. కర్నూలు జిల్లా పోలీసులు సీతారామిరెడ్డి బృందాన్ని వెళ్లిపోమ్మని చెబుతున్న సమయంలోనే కర్నూలు రైతులు ఆయనను మరోసారి తోసివేస్తూ మరోసారి వస్తే చంపేస్తామంటూ హెచ్చరించారు. రెండు ప్రాంతాల రైతుల మధ్య సమస్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో కర్నూలు కలెక్టర్ రాయిచూర్ కలెక్టర్ సమాచారమందించారు. ఈ పరిస్థితుల్లో ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్‌లో పనులు చేయలేమంటూ కర్ణాటక అధికారులు తేల్చిచెప్పారు.
దీంతో ఆర్డీఎస్ పనులు మళ్లీ మొదటికొచ్చాయి. ఈ విషయమై ఆర్డీఎస్ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి మాట్లాడుతూ.. ఆర్డీఎస్‌లో మంగళవారం జరిగిన పరిస్థితులను తెలంగాణ నీటి పారుదలశాఖ మంత్రి హరీష్‌రావుకు, పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులకు బుధవారం వివరిస్తామని చెప్పారు. ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు ఆర్డీఎస్ సమస్యకు పరిష్కారం లభించేలా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.