సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ ఎత్తిపోతల పథకం (ఆర్డీఎస్) కింది ఆయకట్టు రైతాంగానికి ఈ ఏడాదీ నిరాశే మిగిలింది. నాలుగేళ్లుగా ఊరిస్తున్న ఆధునీకరణ పనులు ఈ ఏడాది సైతం మూలన పడటంతో వారి ఆశలన్నీ అడియాసలే అయ్యాయి. ప్రస్తుతం పనులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ముందుకొచ్చినా.. వర్షాకాలం ఆరంభమైన నేపథ్యంలో పనులు ముందుకు కదిలే ప్రసక్తే లేదు. దీంతో రబీ ఆశలు గల్లంతయినట్టే కనబడుతోంది.
నిజానికి ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి వాటా ఉండగా, పాత పాలమూరు జిల్లాలోని 87,500 ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉంది. కర్ణాటక నుంచి ఆర్డీఎస్‌కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేర నీరు రావడం లేదు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్ కాల్వల మరమ్మతులు చేసి, ఎత్తును పెంచాలని నిర్ణయించగా, ఇందుకు కర్ణాటక సైతం అంగీకరించింది.
ఈ కాల్వల ఆధునీకరణ కోసం కర్ణాటకకు రాష్ట్రం రూ.72 కోట్ల మేర డిపాజిట్ సైతం చేసింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ పనులకు నాలుగేళ్లుగా అడ్డుపడుతున్నారు. దీంతో ఆర్డీఎస్ కింద సాగు ముందుకు సాగడం లేదు.
కర్ణాటక మంత్రితో హరీశ్ చర్చలు జరిపినా..
గత ఏడాది డిసెంబర్‌లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దీనిపై కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్‌తో చర్చలు జరపగా వారు పనులకు ఓకే చెప్పారు. దీంతో ప్యాకేజీ–1లోని హెడ్‌వర్క్స్ అంచనాను రూ.మూడు కోట్ల నుంచి రూ.13 కోట్లకు పెంచి.. ఈ నిధులను కర్ణాటక ప్రభుత్వ ఖాతాలో జమ చేసినా, ప్యాకేజీ–1లో భాగంగా పూడికమట్టి తొలగింపు, షట్టర్ల నిర్మాణ పనులు జరుగలేదు.
ఈ పనుల కొనసాగింపుపై ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సమావేశంలో చర్చించగా, అందులో పనులకు సహకరిస్తామని ఏపీ హామీ ఇచ్చింది. అయినా అది అమలవలేదు. దీంతో పాటే గత నెలలో తుంగభద్ర బోర్డు సమావేశంలోనే ఆర్డీఎస్ అంశాన్ని బోర్డు పరిధిలోకి తేవాలని తెలంగాణ ఒత్తిడి చేయగా, ఏపీ అంగీకరించింది. బోర్డు దీనిపై ఎలాంటి నిర్ణయం చేయకపోవడంతో ఆ అంశం మూలన పడింది.
ప్రస్తుతం పనులు మొదలుపెట్టినా వర్షాల కారణంగా ఆర్డీఎస్ కాల్వల్లోకి నీరు చేరింది. దీంతో పనులు చేసేలా పరిస్థితి లేదు. దీంతో రైతాంగం ఆశలు ఆవిరయ్యాయి. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలంగాణ.. రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనేలా కృషి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని, పరస్పర సహకార ధోరణిని పొరుగు రాష్ట్రాలు పాటించేలా వారికి ఆదేశాలు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాయాలనే నిర్ణయానికి వచ్చింది. ఆర్డీఎస్ పనుల పూర్తికి సహకరించేలా ఏపీని ఒప్పించి, తెలంగాణ రైతాంగానికి సహకరించాలని కోరనుంది.
Comments
Please login to add a commentAdd a comment