- 1.56 కోట్ల ఎకరాల్లో సాగు
- 200 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం
- వ్యవసాయమే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యం
- రికార్డుస్థాయిలో వరిసాగు
- సిద్ధమవుతున్న ప్రణాళిక
మనింట.. సిరుల పంట
Published Sat, Jun 7 2014 12:41 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రికార్డుస్థాయిలో పంటలసాగును ప్రోత్సహించాలని సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సాగు సీజన్ మొదలు కాబోతున్నది. సాగువిస్తీర్ణం గణనీయంగా పెంచి, తద్వారా అత్యధిక దిగుబడులను సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నది. ఖరీఫ్, రబీలో కలసి ఏడాదిలో మొత్తం 1.56 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో మొత్తం 200 లక్షల టన్నుల ఉత్పత్తులను సాధించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకోసం ఈ ఏడాది పంటల సాగు ప్రణాళికకు అధికారులు తుదిరూపు ఇస్తున్నారు. తమ ప్రభుత్వం వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అందులో భాగంగా రుణమాఫీ చేస్తామన్నారు. విత్తనాలను సిద్ధం చేయించారు. సబ్సిడీపై వీటిని అందించడానికి మండల, గ్రామస్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. సకాలంలో వర్షాలు వస్తాయని ఇప్పటికే భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రిజర్వాయర్లలో నారుమడులకు అవసరమైన నీరు ఉంది. దాంతో వర్షాలు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే పంటల సాగుకు వీలుగా నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది.
ఖరీఫ్‌లోనే 1.15 కోట్ల ఎకరాల్లో సాగు...
ప్రస్తుత ఖరీఫ్‌సీజన్‌లో భారీగా పంటల సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 46.11 లక్షల హెక్టార్ల (115 లక్షల ఎకరాలు) విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఖరీఫ్‌లో తెలంగాణ సాగు విస్తీర్ణం 40.40 లక్షల హెక్టార్లు మాత్రమే. ఈ ఏడాది మరో 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని పెంచాలని నిర్ణయించారు. ఇప్పటిదాకా వరి విస్తీర్ణం 10.04 లక్షల హెక్టార్లు కాగా ఈ సారి 11.98 లక్షల హెక్టార్లకు పెంచాలని యోచిస్తున్నారు. నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి జిల్లాలో వరి రికార్డుస్థాయిలో సాగులోకి రానుంది.
పత్తిది ప్రధాన పాత్రే...
కాగా వరి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరో ప్రధానపంట పత్తి. మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో ఈ పంటను ఎక్కువ సాగు చేస్తున్నారు. దీని విస్తీర్ణం 15.34 లక్షల హెక్టార్లు కాగా ఈ ఏడాది 17.42 లక్షల హెక్టార్లలో సాగులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. మొక్కజొన్న పంట సాధారణ విస్తీర్ణం 4.66 లక్షల హెక్టార్లు కాగా ఈ సారి 5.56 లక్షల హెక్టార్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే సోయాబీన్ సాగు కూడా పెరుగుతుందంటున్నారు.
రబీలో పెరగనున్న విస్తీర్ణం: రబీలోనూ పంటల సాగు గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అన్ని పంటలు కలిపి 16.58 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి వస్తాయంటున్నారు. ఇందులో వరే 7.71 లక్షల హెక్టార్లలో సాగులోకి రానుంది. ఇంకా జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, కంది, పెసర, మిను ము, పొద్దుతిరుగుడు పంటలు కూడా రబీలో వేస్తారు.
రికార్డు స్థాయిలో ఉత్పత్తులు...
ఇదిలాఉండగా, సాగుతో పాటు ఉత్పత్తులు కూడా రికార్డుస్థాయిలో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి సుమారు 200 లక్షల టన్నుల ఉత్పత్తులు వస్తాయంటున్నారు. ఇందులో 64.74 లక్షల టన్నుల వరి, 46.15 లక్షల టన్నుల పత్తి, 34.17 లక్షల టన్నుల చెరకు, 32.39 లక్షల టన్నుల మొక్కజొన్న ఉన్నాయి.
Advertisement
Advertisement