మరో పోరు
సాక్షి, హన్మకొండ : తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు అడ్డుగా ఉన్న చిక్కుముడులు ఒక్కొక్కటిగా వీడిపోతున్నాయి. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ డివిజన్ల సంఖ్య పెంపు ఖరారు కావడంతో మరో పోరుకు రంగం సిద్ధమైంది. వరంగల్ కార్పొరేషన్ డివిజన్ల సంఖ్యను 53 నుంచి 58కి పెం చుతూ మునిసిపల్ అధికారులు మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. గడిచిన నాలుగు నెలలుగా స్థానిక సం స్థలు, పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగింది. ఇప్పుడు నగర డివిజన్ల సంఖ్య ఖరారైన నేపథ్యంలో ఇటు ప్రజలు... అటు రాజకీయ పార్టీల్లో మరోమారు ఎన్నికల వేడి రాజుకుంటోంది.
‘తెలంగాణ’పై ప్రభావం
తెలంగాణ రాష్ర్టంలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, రామగుండం కార్పొరేషన్లు ఉన్నాయి. వివిధ కారణాలతో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు వాయిదా పడ్డాయి. మరో ఆరు నెలల వ్యవధిలో హైదరాబాద్ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేస్తోంది. హైదరాబాద్‌తోపాటే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల ప్రభావం హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలపై ప్రభావం పడనుంది.
అదేవిధంగా... వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు జిల్లాలోని వరంగల్ తూర్పు, పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకర్గాలపై ప్రభావం చూపుతుంది. దీంతో ఇక్కడ జరగబోయే ఎన్నికలను రాజకీయ పార్టీలు సవాల్‌గా తీసుకుంటున్నాయి. ఈ రెండు కార్పొరేషన్లలో విజయం సాధించడం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా తమ బలాన్ని చాటి చెప్పేందుకు ఈ ఎన్నికలను వేదిక చేసుకుంటున్నాయి.
ముందస్తు వ్యూహాలు
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించి ఆధిక్యత కనబరిచింది. టీడీపీ రెండు స్థానాలు గెలుచుకోగా... కాంగ్రెస్ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. చట్టసభలకు జరిగిన ఎన్నికల్లో ఫలితాలు ఏకపక్షంగా వచ్చినా... అంతకుముందు జిల్లాలోని ఐదు మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. దీంతో వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి పట్టునిలుపుకునేందుకు కాంగ్రెస్, టీడీపీ ముందస్తుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. అధికార పార్టీ హోదాలో కార్పొరేషన్‌పై గులాబీ జెండాను పాతేందుకు టీఆర్‌ఎస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి.
గ్రేటర్ వరంగల్‌లోనా.. బల్దియూలోనా...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వ హయంలో వరంగల్ నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర పురపాలక శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. అరుుతే ఈ ఎన్నికలు గ్రేటర్ వరంగల్‌లోనా... వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోనా... అనే అనుమానాలు రాజకీయ వర్గాలను కుదిపేస్తున్నారుు. డివిజన్ల ఖరారు నేపథ్యంలో నగర రాజకీయ నాయకుల్లో ఈ అంశమే హాట్‌టాపిక్‌గా మారింది.