గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఇలంబరితి, పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ షానవాజ్‌ఖాసిం వెల్లడించారు.
పుష్కరాలపై కలెక్టర్, ఎస్పీ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఇలంబరితి, పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ షానవాజ్‌ఖాసిం వెల్లడించారు. ఎస్‌ఆర్ గార్డెన్స్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుష్కరాలపై వారు మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే..
8 ఘాట్ల పరిధిలో 1500 మంది అధికారులు, సిబ్బందికి విధులు కేటారుుంచాం. వీరు కాక పోలీస్ సిబ్బంది బందోబస్తు చేపడుతున్నారు. ప్రైవేట్ వాహనాలకు సారపాక వరకే అనుమతి ఉంది. ఇక్కడ 25 వేల వాహనాలను నిలిపేందుకు పార్కింగ్ ఏర్పాటు చేశాం. సారపాకనుంచి భద్రాచలానికి భక్తులు వెళ్లేందుకు 100 షటిల్ బస్‌లను ఉచితంగా ఏర్పాటు చేశాం. కేవలం ఆర్టీసీ బస్‌లకు మాత్రమే భద్రాచలంలోకి అనుమతి ఉంది. భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్లేందుకు 60 షటిల్ బస్‌లు సిద్ధంగా ఉంచాం.
భక్తుల భద్రతే లక్ష్యం. ఎమర్జెన్సీ, హెల్త్, అంబులెన్స్‌లను అన్ని ఘాట్ల వద్ద అందుబాటులో ఉంచాం. పుష్కరాల విధులపై ఇటు పోలీసులు, అటు అధికారులు, సిబ్బందికి పలుమార్లు శిక్షణ ఇచ్చాం. ప్రతి ఘాట్ వద్ద సీనియర్ అధికారికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాం. ఒక్కో ఘాట్ వద్ద కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశాం. వీటిని పర్యవేక్షించేందుకు భద్రాచలంలో మాస్టర్ కంట్రోల్ రూమ్ ఉంటుంది.
డిజిటల్ సిస్టమ్‌తో బందోబస్తు
డిజిటల్ సిస్టమ్‌తో పుష్కరాల బందోబస్తు చేపడుతున్నాం. భధ్రాచలానికి వచ్చే ఆరు రూట్లలో ఎక్కడికక్కడ ప్రతి 15 నిమిషాలకు ఎన్ని వాహనాలు భద్రాచలం వైపు వస్తున్నాయో.. పోలీస్ సిస్టమ్ ఏర్పాటు చేసిన లైవ్ డాటాలో కనిపిస్తుంది. దీనిని అనుసరించి భద్రాచలంలో భక్తుల రద్దీ, ఆలయ దర్శనంపై ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. దేవాలయంలో దర్శనం కోసం ఎంతమంది క్యూలో ఉన్నారు, ఇంకా ఎంతమంది దర్శనం కోసం వచ్చే అవకాశం ఉందో ఎప్పటికప్పుడే ఈ సిస్టమ్‌తో తెలిసిపోతుంది.
భద్రాద్రికే బాగా భక్తులొచ్చే అవకాశం
రాష్ట్రంలో భద్రాచలం వద్దే నీరు పుష్కరఘాట్లకు సమీపంలో ఉంది. భక్తులు ఎక్కువగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఆ స్థాయిలో ఏర్పాట్లు చేశాం. భద్రాచలంలో రోజూ 50వేల మందికి దర్శనం కలిగేలా చర్యలు తీసుకున్నాం. ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేకంగా ట్రాఫిక్ సిబ్బందికి ఇప్పటికే పలుమార్లు శిక్షణ ఇప్పించాం. మంచినీటి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాం. మంచినీటిని స్వచ్ఛందంగా అందించేందుకు 200 మంది ముందుకువచ్చారు. 20 మంచినీటి ట్యాంకర్లు సిద్ధంగా ఉంచాం. భక్తుల సౌకర్యార్థం పుష్కరఘాట్ల సమీపంలో మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునేందుకు మహిళల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేరుుంచాం. భక్తుల భద్రత కోసం ప్రత్యేకంగా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా భద్రాచలం వస్తున్నారుు. ఇతర జిల్లాల నుంచి కూడా ప్రభుత్వం పోలీస్ ఫోర్స్‌ను పంపిస్తుంది.
స్నానానికి షాంపులు, సబ్బులు వాడొద్దు: కలెక్టర్, ఎస్పీ
పుష్కర స్నానానికి వచ్చే భక్తులు షాంపులు, సబ్బులు వాడొద్దు. దీనివల్ల నీరు కలుషితమై భక్తులకు ఇబ్బంది కలుగుతుంది. నీరు, ఘాట్ల వద్ద కొబ్బరికాయలు కొట్టొద్దు..వేయవద్దు. భద్రాచలం కరకట్టపై షాంపులు, సోప్స్ ఎవరైనా విక్రయిస్తే అక్కడ ఉండే అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం.
వర్షం వచ్చినా భక్తులకు ఇబ్బందులుండవు..
వర్షం వచ్చినా భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుడిని దర్శించుకునేలా క్యూలైన్‌లో వాటర్‌ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేశాం. పుష్కరాలను వీక్షించేలా పలు ప్రధాన సెంటర్లలో ఎల్‌ఈడీ స్క్రీన్లు పెట్టించాం. 8 ఘాట్ల పరిధి లో 222 మంది వైద్యులు, 615 మంది పారా మెడికల్ సిబ్బందిని వైద్య సేవలకు నియమించాం. హోటల్స్, లాడ్జీల ధరలు ఎప్పటిలాగే ఉండేలా చర్యలు చేపట్టాం.