దేవేందర్ (నల్లగొండ) మూడేళ్ల క్రితం రియల్‌ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడు. మొదట్లో చిన్నాచితకా ప్లాట్లు అమ్మి కమీషన్ తీసుకొనేవాడు. ఏడాది కిందట ఇద్దరు మిత్రులతో కలిసి ఎకరంన్నర భూమికొని, రూ.2కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ శివార్లలో వెంచర్ వేశాడు. ఫిబ్రవరిలో ఒక రియల్టర్ రూ.3కోట్లకు గంపగుత్తగా అమ్మాలని అడిగాడు. కానీ ఇంకా రేటొస్తుందన్న ఆశతో అమ్మలేదు. ఇప్పుడు కరోనా వారి ఆశల్ని వమ్ముచేసింది. అప్పులు, పెట్టుబడిలో సగానికే అమ్ముతామన్నా కొనేవారు లేరు. వెంచర్ వెక్కిరిస్తోంది. అప్పుపై వడ్డీ పెరుగుతోంది.
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ
ఆరు నెలల క్రితం రూ.300 కోట్లతో ఓ ప్రాజెక్ట్ చేపట్టింది. భారీగా ప్రచారం చేసింది. మార్చి వరకు సగానికిపైగా విల్లాలకు బుకింగ్స్ వచ్చాయి. మిగిలిన సగం విల్లాల కోసం తక్కువ ధరకు కూడా ఎవరూ ముందుకు రావట్లేదు. కరోనా ప్రభావంతో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ దాదాపు మూలనపడింది. పెట్టుబడి పెట్టిన సంస్థతో పాటు విల్లాలు బుక్‌చేసిన వారు సందిగ్ధంలో పడ్డారు. చదవండి: ఖైదీ నంబర్ 3077 : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కరోనా దెబ్బకు రాష్ట్రంలోని వేలాది రియల్ ప్రాజెక్టుల భవితవ్యం డోలాయమానంలో పడింది. లాక్‌డౌన్ ఎత్తివేశాక కూడా రియల్‌బూమ్ పుంజుకుంటుందో లేదో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. కరోనా వైరస్ ’రియల్’రంగాన్ని కుదేలుచేసింది. 11ఏళ్ల క్రితం ఏర్పడిన సంక్షోభాన్ని గుర్తుకుతెస్తోంది. కరోనా ప్రభావం లేకముందు రాష్ట్రంలో ఎకరా కోట్ల రూపాయలు పలికిన భూమి ఇప్పుడు పదింతలు తగ్గించి అమ్ముతామన్నా కొనే నాథుడే లేడు.
హైదరాబాద్ నగర శివార్లతో పాటు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో వెలసిన వెంచర్లు, బడా కమ్యూనిటీ ప్రాజెక్టులు, విల్లాల అమ్మకాలు, కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిన బడా రియల్టర్లు, అప్పులు తెచ్చి లాభార్జన కోసం ఈ వ్యాపారంలోకి దిగిన మధ్యతరగతి వర్గాలు, ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్న లక్షలాది మందికి భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది. ఇప్పట్లో ఈ రంగం గాడినపడే అవకాశం లేకపోవడంతో వీరంతా దిక్కుతోచని స్థితిలోపడ్డారు.
అసలే మాంద్యం.. ఆపై కరోనా పిడుగు
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం గతేడాది జూన్ నుంచే ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం 2019లోనే 30శాతం మేర ఈ వ్యాపారంపై ప్రభావం చూపడంతో ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలు, భూముల క్రయవిక్రయాలు తగ్గిపోయాయి. ప్రముఖ సంస్థల అధ్యయనం ప్రకారం 2019లో రెసిడెన్షియల్ రంగం కూడా దెబ్బతింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఫ్లాట్లు, విల్లాల అమ్మకాలు 20శాతం పడిపోయాయి. చదవండి: కరోనా రహితంగా11 జిల్లాలు
హైదరాబాద్‌లో అయితే నిర్మాణంలో ఉన్న వేలాది గృహ యూనిట్లు అమ్ముడుపోలేదు. ఇప్పుడు కరోనా ప్రభావం ఈ రంగాన్ని అతలాకుతలం చేసింది. ఎంతగా అంటే రాష్ట్రంలో ప్రతి నెలా రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.500కోట్ల ఆదాయం వచ్చేది. నెలకు 1.5లక్షల వరకు లావాదేవీలు జరిగేవి. ఈ మొత్తం లావాదేవీల్లో హైదరాబాద్ చుట్టుపక్కల జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలే 75 శాతం ఉండేవి. కానీ మార్చి 22, జనతా కర్ఫ్యూ తర్వాత ఇవన్నీ స్తంభించిపోయాయి. నెలలో కనీసం వెయ్యి లావాదేవీలు కూడా జరగలేదు. ఇప్పుడు రియల్ రంగం కుదేలు కావడంతో రిజిస్ట్రేషన్ శాఖకు పనిలేకుండా పోయిందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు.
2008లో కుప్పకూలి.. 2015లో నిలబడి..
2008లో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. నాటి పరిస్థితులు కరోనా వైరస్‌లాగా కుదేలు చేయకపోయినా ఓ రకంగా నష్టాల్లోకి నెట్టాయి. వాస్తవానికి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం 90వ దశకం ద్వితీయార్థం నుంచే ప్రారంభమైంది. క్రమంగా విస్తరిస్తూ 2004 నుంచి భారీగా పుంజుకుని 2008 నాటికి ఉచ్ఛస్థితికి చేరుకుంది. అయితే అప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో రియల్ రంగం నష్టాల్లోకి వెళ్లిపోయింది. ఇందుకు ప్రధాన కారణం వెల్లువలా ఈ రంగంలోకి వచ్చిన పెట్టుబడులు, పెరిగిన అంచనాలు మాత్రమే. దాదాపు ఏడేళ్ల పాటు ఒడిదుడుకులు ఎదుర్కొని తిరిగి 2015 నాటికి కోలుకుంది. అటు తరువాత ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పెరిగింది. ఏటా 90లక్షల చదరపు అడుగుల ఆఫీస్‌స్పేస్ నిర్మాణాలు జరుగుతుంటాయి.
గత మూడేళ్లలో 25లక్షల చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టిన పలు రియల్ సంస్థలు వాటిని లీజుకు ఇచ్చేశాయి కూడా. దీంతో నగరంలో లక్షల మందికి ఉపాధి లభించింది. మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, కోకాపేట, రాయదుర్గం, గోపనపల్లి, నార్సింగి లాంటి ప్రాంతాల్లో రియల్ దూకుడు పెరిగింది. జాతీయ అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ శివార్లలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో ఈ రంగం భారీగా పుంజుకుంది. వేల కోట్ల రూపాయలు చేతులు మారడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీలకు కూడా ఈ వ్యాపారం పాకింది. నాలుగైదేళ్లుగా దాదాపు రాష్ట్రమంతా రియల్ వ్యాపారం మూడు వెంచర్లు, ఆరు ఫ్లాట్లుగా విలసిల్లింది. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్‌తో ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. చదవండి: లాక్‌డౌన్ కచ్చితంగా పొడిగిస్తాం
అక్టోబరు నాటికి బూమ్..
కరోనాతో రియల్ ఎస్టేట్ మార్కెట్ కుదేలైంది. తేరుకోవడానికి సమయం పడుతుంది. ఇప్పటికే బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అక్టోబరు నాటికి మళ్లీ బూమ్ వస్తుంది.
– వీవీఎల్ శేఖర్, ఎండీ– శ్రీ సీఎస్ ఇన్‌ఫ్రా డెవలపర్స్
చిన్న వెంచర్లకు మార్కెట్ ఉండదు..
ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యుడు ప్లాట్ కొనలేడు. సంపన్నులకు ఎప్పుడైనా ఒకేలా ఉంటుంది. అయితే చిన్న వెంచర్లు వేసేవారికి ఇబ్బందే. మార్కెట్ ఉండదు. మరో ఏడాదిపాటు ఇబ్బందులు తప్పవు.
– కె.నానాజి (రియల్టర్)
ఆరేడు నెలలు ఇంతే..
ఇప్పుడు కూలీలెవరూ లేరు. నిర్మాణ పనులు జరగట్లేదు. లాక్‌డౌన్ ఎత్తివేశాక మళ్లీ రియల్ రంగం ఊపందుకుంటుది. చిన్న సెగ్మెంట్లలో కొంత గజిబిజి ఉంటుంది. కానీ ప్రైమ్ ప్రాజెక్టులు కరోనా తర్వాత కూడా ఇబ్బంది పడవనేది నా అభిప్రాయం.
– కె.మధుసూదన్‌రెడ్డి, ఎండీ, డ్వెల్టన్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్
ప్రభుత్వాల ప్రోత్సాహం చాలా అవసరం
ప్రపంచంలోని అన్ని రంగాలు కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్నాయి. అందుకే క్షేత్ర స్థాయి పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకెళ్లాలి. ఎవరైనా మే 7వరకు వేచి ఉండాల్సిందే. ఆ తరవాత 3 – 4 వారాల్లో అన్ని పనులు ప్రారంభమవుతాయి. అప్పటివరకు ప్రాజెక్టులు కొంత జాప్యమవుతాయి. ఇప్పటికే రెరా లాంటి సంస్థలు కొన్ని విషయాల్లో డెడ్‌లైన్ గడువు పొడిగించాయి. లాక్‌డౌన్ ఎత్తివేసిన 3 నెలల్లో రియల్ కార్యకలాపాలు యథాతథంగా ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఈ రంగం కోలుకోవాలంటే ప్రభుత్వాల ప్రోత్సాహం చాలా అవసరం. రుణాలు ఇవ్వడం, వడ్డీలు తగ్గించడం వంటి పాజిటివ్ నిర్ణయాలు ఈ రంగానికి టానిక్‌లా పనిచేస్తాయి.
– సి.శేఖర్‌రెడ్డి, క్రెడాయ్ మాజీ జాతీయ అధ్యక్షుడు, కన్వీనర్, ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్ ప్యానెల్, సీఐఐ, తెలంగాణ
Comments
Please login to add a commentAdd a comment