భంగపడ్డ నేతల రెబల్‌ పోరు.. | Rebel Candidates Give Nominations In Adilabad | Sakshi
Sakshi News home page

భంగపడ్డ నేతల రెబల్‌ పోరు..

Published Mon, Mar 25 2019 2:56 PM | Last Updated on Mon, Mar 25 2019 2:59 PM

Rebel Candidates Give Nominations In Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: పార్టీలకు రెబల్‌ బెడద తప్పేటట్టులేదు. ప్రధాన పార్టీలకు అభ్యర్థులు ఖరారు కాగా..టికెట్‌ ఆశించి భంగపడ్డ నాయకులు రెబల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 18న ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల పర్వం తుది ఘట్టానికి చేరుకుంది. సోమవారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఆదిలాబాద్‌ (ఎస్టీ), పెద్దపల్లి (ఎస్సీ) పార్లమెంట్‌ నియోజకవర్గ బరిలో ఎవరెవరు దిగనున్నారు అనేది తేటతెల్లంకానుంది. పార్టీ టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలు రెబల్‌గా పోరులో నిలుస్తారా? లేని పక్షంలో వారి నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై అంతటా ఆసక్తి నెలకొంది.
పెద్దపల్లిలో ఉత్కంఠ..
పెద్దపల్లి నియోజకవర్గం నుంచి అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎ.చంద్రశేఖర్, టీఆర్‌ఎస్‌ నుంచి వెంకటేశ్‌ నేతకాని పేర్లు అధికారికంగా ఖరారు అయ్యాయి. ఎ.చంద్రశేఖర్‌ నామినేషన్‌ కూడా వేశారు. బీజేపీ రెండో జాబితాలో గోదావరిఖనికి చెందిన ఎస్‌.కుమార్‌ పేరును  అధిష్టానం ఖరారు చేసినా రాష్ట్రశాఖ విభాగం ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ పేరును అలాగే నిలిపి ఉంచింది. ప్రధానంగా పెద్దపల్లి నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ను ఆశించిన మాజీ ఎంపీ జి.వివేకానందకు నిరాశ ఎదురవడంతో ఆయనతో బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నారనే వార్తలు వెలువడుతున్నాయి. బీజేపీ గెలవాలంటే బలమైన అభ్యర్థులను నిలిపేందుకు చివరి వరకు రాష్ట్ర కమిటీ ప్రయత్నిస్తోంది.

ఇటీవలే సోయం బాపురావు ఆ పార్టీలో చేరగా, ఆయనకు టికెట్‌ కేటాయించారు. ఇప్పుడు వివేక్‌ విషయంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి కుమార్‌ నామినేషన్‌ వేస్తారా? లేని పక్షంలో టీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్న జి.వివేక్‌ కమలం పార్టీ నుంచి బరిలోకి దిగుతారా? లేని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉంటారా? అనేది నేడు స్పష్టం కానుం ది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఆదిలాబాద్‌ లోక్‌సభ పరిధి నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గోడం నగేశ్‌ను ఖరారు చేయగా, కాంగ్రెస్‌ నుంచి రాథోడ్‌ రమేశ్, బీజేపీ నుంచి సోయం బాపూరావుల పేర్లు ఖరారు అయ్యాయి.

ఈ నేపథ్యంలో ఇక్కడ పోరుపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన నరేశ్‌ జాదవ్‌ గోడం నగేశ్‌ చేతిలో ఓటమి చెందారు. రెండో స్థానంలో నిలిచాడు. ఈ సారి ఎన్నికల్లోనూ పార్టీ టికెట్‌పై ఆశ పెట్టుకున్నా అధిష్టానం రాథోడ్‌ రమేశ్‌ వైపు మొగ్గు చూపడంతో నరేశ్‌ జాదవ్‌కు చుక్కెదురైంది. ఈ పరిస్థితిలో కాంగ్రెస్‌ రెబల్‌గా ఆయన బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లో ఆయన విలేకరుల సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ తరుణంలో కాంగ్రెస్‌కు రెబల్‌ తప్పేటట్టు లేదు.

నేడు నామినేషన్లు..
ఆదిలాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గోడం నగేశ్, పెద్దపల్లి నుంచి వెంకటేశ్‌ నేతకాని సోమవారం నామినేషన్‌ వేయనున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నగేశ్‌ అప్పుడు లోక్‌సభ బరిలో నిలిచి ఎంపీగా గెలుపొందారు. మరోసారి ఆయనకే టికెట్‌ దక్కడంతో నగేశ్‌ నామినేషన్‌పై ఆసక్తి నెలకొంది. ఈ పార్లమెంట్‌ పరిధిలో ఆదిలాబాద్, బోథ్‌(ఎస్టీ), నిర్మల్, ఖానాపూర్‌(ఎస్టీ), ముథోల్, సిర్పూర్, ఆసిఫాబాద్‌ (ఎస్టీ) నియోజకవర్గాలు ఉన్నాయి.

డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఒక ఆసిఫాబాద్‌ మినహా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ విజయదుందుబి మోగించింది. ఒక ఆసిఫాబాద్‌లో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆత్రం సక్కు గెలుపొందగా ఆయన కూడా ఇటీవల టీఆర్‌ఎస్‌తో కలిసి పని చేస్తుండడంతో కాంగ్రెస్‌కు మింగుడు పడడం లేదు. కాగా ఆదిలా బాద్‌ పార్లమెంట్‌ ఎన్నిక విజయం కోసం బాధ్యతలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భుజాలపై ఉండగా మాజీ మంత్రి, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్నకు కూడా విజయం కోసం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగేశ్‌ నామినేషన్‌ ఘ ట్టానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే జోగురామన్నలతోపాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇటీవల పార్టీలో చేరిన నేతలు హాజరై అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్‌ అభ్యర్థి రాథోడ్‌ రమేశ్, బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు నామినేషన్‌ వేసిన విషయం విధితమే. నవ ప్రజారాజ్యం పార్టీ నుంచి కుమురం వందన నామినేషన్‌ వేశారు.

పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధి లోని పెద్దపల్లి, ధర్మపురి, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ గెలవగా, మంథని నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి దుద్దిళ్ల  శ్రీధర్‌బాబు, రామగుండం నుంచి ఏఐఎఫ్‌బీ అభ్యర్థి కోరుకంటి చందర్‌ గెలుపొందారు. కోరుకంటి చందర్‌ టీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్నారు. పెద్దపల్లి నియోజకవర్గానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు బాధ్యతలు ఇవ్వగా, చెన్నూర్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ గతంలో పెద్దపల్లి ఎంపీగా పని చేసిన అనుభవం దృష్ట్యా మిగతా ఎమ్మెల్యేలను కూడగట్టి గెలుపుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.  ఇటు ఆదిలాబాద్, అటు పెద్దపల్లిల్లో టీఆర్‌ఎస్‌ గెలుపుపై నమ్మకంతో ఉంది. రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో రెబల్‌తోపాటు స్వతంత్ర అభ్యర్థులుగా ఎవరు ఉంటారో నేడు తేలనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement