అహో..యాదాద్రి | Rebuilding the yadadri temple is According to Architecture and agamasastra | Sakshi
Sakshi News home page

అహో..యాదాద్రి

Published Mon, Jan 7 2019 1:21 AM | Last Updated on Mon, Jan 7 2019 1:21 AM

Rebuilding the yadadri temple is According to Architecture and agamasastra - Sakshi

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆగమ, వైదిక నియమాలు.. ఆకట్టుకునే శిల్పకళాకృతులతో ప్రపంచంలోనే అద్భుతమైన ఆలయంగా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం రూపుదిద్దుకుంటోంది. రాజుల కాలంనాటి నిర్మాణశైలిని అనుసరిస్తూ.. జీవకళ తొణికిసలాడేలా కృష్ణ శిలలతో కూడిన అద్భుత సౌందర్య నిర్మాణం త్వరలో ఆవిష్కృతం కానుంది. దేశంలోని నారసింహ క్షేత్రాల్లో అతిపురాతనమైన యాదగిరికొండపై కొలువైన పంచనారసింహుడి ఆలయ మహిమలు విశ్వవ్యాప్తం కానున్నాయి. దక్షిణ భారతంలోని తంజావూరు.. అనంత మంగళం.. మధుర.. రామేశ్వరం వంటి పురాతన ఆలయాల నిర్మాణ శైలిని మించిన రాతి శిల్పాలు ఇక్కడ సిద్ధమవుతున్నాయి.  పునాది నుంచి శిఖరం వరకు పూర్తిగా రాతి శిల్పాలతో సాగడం యాదాద్రి ఆలయ నిర్మాణ విశిష్టతగా చెబుతున్నారు.      – సాక్షి, యాదాద్రి 

శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణం చినజీయర్‌ స్వామి సూచనలు, సలహాలు, వాస్తు, పంచరాత్ర ఆగమ శాస్త్ర పద్ధతిలో స్తపతులు పనులను ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో.. సీఎం కేసీఆర్‌ పట్టుదలతో రూ.2,000 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ నిర్మాణం త్వరలోనే పూర్తి కానుంది. ఇప్పటికే పనులకోసం రూ.1,800 కోట్ల నిధులు కేటాయించారు. ఇందులో రూ.610 కోట్లు ఖర్చు అయ్యాయి. 

ప్రాకార మండపంపై రాతి పనులు 
యాదాద్రి ప్రధానాలయం, అష్టభుజి ప్రాకార మండపం వద్ద కొడింగల్, సాలహారాలు, వేలంరాల శిల్పాల పనులను చేస్తున్నారు. అలాగే ప్రాకార మండపం వద్ద రాతి కప్పు పనులను ముమ్మరం చేశారు. గర్భాలయ ప్రధాన గోపురం వద్ద కర్ణకూటం లేయర్‌ అమర్చుతున్నారు. తూర్పు రాజగోపురంలోనుంచి వెళ్లగానే కర్ణకూటం కనిపించే విధంగా తీర్చిదిద్దుతున్నారు. «ప్రధాన ఆలయానికి ఎదురుగా ఇటీవల ధ్వజస్తంభం కోసం బలిపీఠం నిలబెట్టారు. వాటికి బంగారు తొడుగులు చేయించడానికి ప్రథమంగా రాగి తొడుగు పనులను చేపట్టారు. 

శరవేగంగా శివాలయం పనులు 
శ్రీపర్వత వర్ధిని రామలింగేశ్వరస్వామి ఆలయ విస్తరణ, పునఃనిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. తోగుట స్వామి పర్యవేక్షణలో శివాలయ ప్రాకారం, ఆలయం లోపలి భాగం పనులు చేపట్టారు. మహా శివుడు కొలువైన ఈ ఆలయాన్ని కూడా లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతోనే   అందుబాటులోకి తేనున్నారు.  

పూర్తి కావస్తున్న ప్రధానాలయం 
ప్రస్తుతం ప్రధాన ఆలయంలో ఇప్పటికే గర్భాలయం,ముఖ మండపం, అంతర్గత ప్రాకారం, ఏడు గోపురాలు పూర్తయ్యాయి. అష్టభుజి ప్రాకారం, బాహ్య ప్రాకారం పనులు కొనసాగుతున్నాయి. మరో రెండు నెలల్లో ప్రధాన ఆలయాన్ని ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.  

సర్వం నారసింహ చరితం 
సప్తగోపుర సముదాయాలు, కాకతీయ శిల్పాలు,యాలి పిల్లర్లు ఇలా .. పలు హంగులతో ఆలయానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. రాజగోపురాల పనులు పూర్తయ్యాయి. గర్భాలయంలోగల ఉప ఆలయాలైన ఆండాల్‌ అమ్మవారి ఆలయం, క్షేత్ర పాలకుడు ఆంజనేయస్వామి, నమ్మాళ్వార్, రామానుజాళ్వార్‌ల ఆలయాలు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. గర్భాలయ ముఖద్వారానికి ఇరువైపులా జయ విజయుల స్వాగత మూర్తులను ఏర్పాటు చేస్తున్నారు. ద్వారంపై కొండగుహ ఆకృతి నరసింహావిర్భావ భక్త ప్రహ్లాదచరితం,ఆంజనేయస్వామి, గరుడాళ్వార్లు శంకుచక్రనామాలతో శిలా విగ్రహాలను ఏర్పాటు చేశారు.  ఆండాల్‌ అమ్మవారి ఆలయానికి మధ్య స్వామివారి శయన మందిరాన్ని నిర్మించి శయన నారసింహుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ శయన మందిరాన్ని అద్దాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దనున్నారు. మరో పక్క ధ్వజస్తంభం పనులు కూడా ప్రారంభమయ్యాయి.

మూడు నెలల్లో పూర్తి 
మరో మూడు నెలల్లో ప్రధాన ఆలయ పనులు పూర్తవుతాయని ఈవో గీతా రెడ్డి తెలిపారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా  పనులు జరుగుతున్నాయని చెప్పారు.   

జీయర్‌ మంగళశాసనాలతో..  
చినజీయర్‌ స్వామి సూచనలు, సలహాలు,మంగళశాసనాలతో జరుగుతున్నాయని ప్రధాన అర్చకుడు లక్ష్మినరసింహాచార్యులు తెలిపారు. స్తపతులు ఆగమశాస్త్ర పద్ధతిలో పనులను పూర్తి చేస్తున్నారు.

పుష్కరణి పనులు వేగం  
ప్రస్తుతం 300 గజాల్లో ఉన్న పుష్కరిణిని 1,200 గజాలకు విస్తరిస్తున్నారు. రెండు నెలల్లో సివిల్‌ పనులను పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. పుష్కరిణిలో ఒక రాతి మండపం ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల నాటికి పుష్కరిణి పనులు కూడా పూర్తి చేసి శ్రీస్వామి వారి చక్రతీర్థ స్థానం చేపట్టాలన్న పట్టుదలతో ఉన్నారు. అంతే కాకుండా భక్తులకు ఇబ్బందులు కలగకుండా కొండకింద గల గండిచెరువును కూడా అభివృద్ధి చేస్తున్నారు.   

సమకాలీన పరిస్థితుల చిత్రీకరణ 
యాదాద్రి క్షేత్ర చరిత్రతోపాటు, ప్రస్తుత సమాజంలోని వాస్తవ పరిస్థితుల గురించి భావితరాలకు తెలిపేందుకు ఇప్పుడు ఉన్న కరెన్సీ, తెలంగాణ జీవన విధానం, బతుకమ్మ, ఉగాది, సంక్రాంతి పండుగలు, క్రీడలు, తెలంగాణ తల్లి ఆకృతులు వంటి వాటిని ప్రాకార మండపాల్లోని పిల్లర్లలో చెక్కుతున్నారు. 

పూర్తయిన రాజగోపురాలు
మహారాజగోపురం పనులు పూర్తయ్యాయి. వీటిపై ప్రస్తుతం లక్ష్మీనరసింహుని వివిధ రూపాల విగ్రహాలు, కలశాలను ఏర్పాటు చేసే పనుల్లో కూలీలు నిమగ్నమయ్యారు. ఇప్పటికే మొదటి ప్రాకారంలో 3 అంతస్తుల తూర్పు రాజగోపురం, 5 అంతస్తులతో దివ్య విమాన రాజగోపురం, రెండవ ప్రాకారంలో 5 అంతస్తులతో తూర్పు, ఉత్తర, దక్షిణ రాజగోపురాల నిర్మాణాలు పూర్తి చేశారు.  

సుందరీకరణ కోసం ప్రణాళికలు 
పెద్దగుట్టపై చేపట్టిన లేఅవుట్‌లో ఓపెన్‌ప్లాట్లు, రోడ్లు, సుందరీకరణ పనులు పూర్తికావచ్చాయి. 250 ఎకరాల లేఅవుట్‌ ప్లాన్‌ రూపొందించి చేపట్టిన అభివృద్ధి పనులు దాదాపు పూర్తికావొస్తున్నాయి. రూ.207 కోట్ల నిధులను కేటాయించారు. 100 కోట్లతో రోడ్లు, మంచినీటి సౌకర్యం, మురుగునీటి పారుదల, పచ్చదనం కోసం పనులు చేపట్టారు.  హెచ్‌ఎండీఏ పర్యవేక్షణలో రోడ్ల మధ్య, పక్కన మొక్కలతోపాటు పచ్చని గడ్డిని పరిచారు. 

ఆలయ సన్నిధిలో భోజనాలు చేస్తున్న శిల్పులు 
2,000 మంది శిల్పుల శ్రమ 
తమిళనాడు, బిహార్, ఏపీలోని గుంటూరు, ఆళ్లగడ్డ ప్రాంతాల నుంచి వచ్చిన 2వేల మంది శిల్పులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. నిపుణుల సూచన మేరకు గుంటూరు– ప్రకాశం మధ్యలో ఉన్న గురిజేపల్లి ప్రాంతం నుంచి లక్ష టన్నుల కృష్ణ శిలలను వాడుతున్నారు. 

పచ్చదనం అందాలు
యాదాద్రిళక్ష పచ్చదనానికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తున్నారు. ఇందుకోసం కొండచుట్టూ ల్యాండ్‌ స్కేప్‌లు ఏర్పాటు చేసి పచ్చదనం పంచే మొక్కలు నాటుతున్నారు. అలాగే కొండపైకి వెళ్ళే దారిలో ఇరువైపులా పచ్చని పూలమొక్కలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధగుణాలు కలిగిన మొక్కలను నాటుతున్నారు.  

పూర్వజన్మ సుకృతం 
యాదాద్రి క్షేత్రం అద్భుతంగా మారుతోందని స్తపతి డాక్టర్‌ ఆనందాచారి వేలు తెలిపారు. ఇలాంటి ఆలయంలో స్తపతిగా పనిచేయడం పూర్వజన్మ సుకృతమన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement