సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం మందుబాబులకు మంచి ‘కిక్కు’ ఇచ్చింది. నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ డిసెంబర్ 30, 31 తేదీల్లో రూ.400 కోట్లకు పైగా విలువైన మద్యాన్ని తాగిపారేశారు లిక్కర్ రాయుళ్లు. ఈ రెండు రోజుల్లో దాదాపు 10 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరగడం విశేషం. గత ఏడాది డిసెంబర్ చివరి వారమంతా కలిసి రూ.600 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరగ్గా, చివరి రెండు రోజుల్లోనే రూ.400 కోట్ల విలువైన లిక్కర్ అమ్ముడుపోయిందని అంచనా. రాష్ట్రంలో రోజుకు సగటున రూ.62 కోట్ల వరకు మద్యం వ్యాపారం జరుగుతుండగా, న్యూ ఇయర్ సందర్భంగా చివరి రెండు రోజులు కలిపి అందుకు ఆరున్నర రెట్లు విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే రూ.100 కోట్లకు పైగా విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ వర్గాలంటున్నాయి. ఇక బీర్లు, లిక్కర్ వారీగా చూస్తే ఈ 2 రోజుల్లో దాదాపు 4.5 లక్షల కేసుల బీర్లు, 5.10 లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి లిక్కర్ అమ్మకాలు భారీగా పెరగడం గమనార్హం.
ఊగుతూ... తోలుతూ....
తాగడంతో ఆగకుండా అలాగే డ్రైవింగ్ కూడా చేశారు మందుబాబులు. పోలీసుల హెచ్చరికలు లెక్కచేయకుండా తాగి రోడ్ల మీదకు వచ్చిన వాహనదారులు డ్రంకెన్ డ్రైవింగ్‌లో దొరికిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 3,150 మంది మందుబాబులు డ్రైవింగ్ చేస్తూ బ్రీత్ అనలైజర్ టెస్టులో పోలీసులకు దొరికిపోయారు. వీరిలో అత్యధికంగా హైదరాబాద్ నుంచే ఉన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 950 మంది, సైబరాబాద్ పరిధిలో 873 మంది మందుబాబులు చిక్కారు. రాచకొండలో మాత్రం స్వల్పంగా 281 కేసులే నమోదయ్యాయి. ఇక కరీంనగర్‌లో 148, నల్లగొండలో 152, సిద్ధిపేట 99 చొప్పున మందుబాబులు దొరికారు. పట్టుబడిన వారిలో దాదాపు 1,500 మంది 18 నుంచి 35 ఏళ్లలోపు వారే. పట్టుబడిన వారిలో అందరూ విద్యావంతులే కావడం విశేషం. వీరిలో పలువురికి జరిమానాలు విధించగా, కొందరి వాహనాలను స్టేషన్లకు తరలించారు. మంగళవారం రాత్రి 10 గంటలకు మొదలైన పోలీస్ స్పెషల్ డ్రైవ్ బుధవారం ఉదయం 8 గంటల వరకు సాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఇంతమంది దొరకడంతో వీరందరి డ్రైవింగ్ లైసెన్సుల్లో పాయింట్లు నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఆల్కహాలు తీవ్రత ఆధారంగా వీరందరి డ్రైవింగ్ లైసెన్సుల్లో పాయింట్లు నమోదు చేస్తారు. ఆల్రెడీ 12 పాయింట్లకు చేరువలో ఉన్నవారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment