రైల్వే ప్రాజెక్టులకు రెడ్ సిగ్నల్! | red signal for railway projects | Sakshi
Sakshi News home page

రైల్వే ప్రాజెక్టులకు రెడ్ సిగ్నల్!

Published Tue, Nov 18 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 PM

రైల్వే ప్రాజెక్టులకు రెడ్ సిగ్నల్!

రైల్వే ప్రాజెక్టులకు రెడ్ సిగ్నల్!

 కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ, ఏపీకి ప్రత్యేక జోన్ లేనట్టే
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ప్రకటించిన తాయిలాలు ఒక్కొక్కటిగా ఎండమావిలా తేలిపోతున్నాయి. ప్రజాగ్రహాన్ని చల్లార్చే క్రమంలో వాటిని పైపూతగా చెప్పారే తప్ప.. హామీలేవీ ఆచరణలో అమలయ్యే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో నాటి యూపీఏ ప్రభుత్వం ఆ ప్రాంతానికి ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటిం చింది. ఒక్క ఏపీకే వరాలు కురిపిస్తే తెలంగాణను విస్మరించినట్టవుతుందనే ఉద్దేశంతో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు హామీనిచ్చింది. అయితే ఇవి వాస్తవ రూపం దాల్చే పరిస్థితులు లేనట్టేనని తాజా పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. రైల్వే జోన్, కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై నాడు యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ.. తాజాగా రైల్వే బోర్డుకు నివేదిక సమర్పించింది. దక్షిణ మధ్య రైల్వేను విభ జించి ఏపీ పరిధిలో ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని ఆ నివేదికలో పేర్కొన్నట్టు విశ్వసనీయంగా తెలి సింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ విషయంలోనూ కమిటీ వ్యతిరేకంగా స్పందించినట్టు సమాచారం. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన కోచ్ ఫ్యాక్టరీల ఏర్పాటు పూర్తి కానందున కాజీపేటలో మరో ఫ్యాక్టరీ అవసరమే లేదని నివేదికలో అభిప్రాయపడ్డారు. పైగా ఇటీవలే కర్ణాటకకు కోచ్ ఫ్యాక్టరీ మంజూరైనందున దక్షిణాదిలో మరోటి ఇవ్వటం సబబుకా దని కమిటీ పేర్కొన్నట్టు సమాచారం. సంయుక్తంగా కాకుం డా ఏడుగురు సభ్యులు విడివిడిగా అభిప్రాయాలను బోర్డు ముం దుంచారు. అంతా దాదాపు ఒకే మాటపై ఉన్నట్టు సమాచారం.
 
 గడువుకు మిగిలింది పక్షం రోజులే..: రైల్వేజోన్, కోచ్‌ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇచ్చేందుకు నాటి యూపీఏ ప్రభుత్వం కమిటీకి ఆరు మాసాల గడువు విధించింది. అపాయింటెడ్ డే (జూన్ 2 ) నుంచి ఆరు మాసాల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఇదే విషయాన్ని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపర్చింది. దాని ప్రకారం డిసెంబర్ 2తో గడువు ముగుస్తుంది. అంటే మరో 15 రోజుల సమయం మాత్రమే ఉంది. నివేదిక అందిన తర్వాత మోదీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది    ఆసక్తిగా మారింది. ప్రస్తుతం రైల్వే వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనే సంకల్పంతో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ.. కమిటీ నివేదికకు వ్యతిరేకంగా స్పందిస్తారా అన్నది అనుమానంగా మారింది.
 
 కొత్త మంత్రి.. కొత్త ప్రాధాన్యాలు
 
 ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు ప్రకటించిన రెండు వరాలకు సంబంధించి గత రైల్వేశాఖ మంత్రి సదానందగౌడకు సంపూర్ణ అవగాహన ఉంది. ఆయనతో పలుమార్లు అటు ఆంధ్ర ప్రదేశ్, ఇటు తెలంగాణ ప్రాంత నేతలు కలిశారు. హామీలను అమలు చేయాలని కోరారు. కమిటీ నివేదిక రాగానే దాన్ని పరిశీలించి వెంటనే నిర్ణయం తీసుకుంటానని ఆయన ప్రకటించారు. ఇప్పుడు రైల్వే శాఖకు కొత్త మంత్రి వచ్చారు. మహారాష్ట్రకు చెందిన సురేశ్‌ప్రభుకు రైల్వేశాఖ అప్పగించారు. ఆయనకు ఈ విషయం పూర్తిగా కొత్త. ఇప్పటివరకు ఆయనతో రాష్ట్ర నేతలెవరూ భేటీ కాలేదు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న రెండోరోజే ఆయన జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధానితో కలిసి విదేశాలకు వెళ్లి సోమవారమే ఢిల్లీకి వచ్చారు. ఇప్పటివరకు ఈ విషయంపై అవగాహన లేని ఆయనపై ఆ కమిటీ నివేదిక ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పైగా.. రైల్వేను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా ఇటీవలే మరో ఏడుగురు సభ్యులతో కమిటీ వేశారు. దేశం మొత్తానికి సంబంధించిన విషయాన్ని పర్యవేక్షించే ఆ కమిటీపైనే మోదీ దృష్టి ఉంది. ఈ నేపథ్యంలో కొత్త జోన్, కోచ్ ఫ్యాక్టరీలకు ఆయన ఎంతవరకు ప్రాధాన్యమిస్తారో చూడాలి.
 
 తెలుగు వారు లేని కమిటీ...
 
 యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో మొత్తం ఏడుగురు ఉన్నారు. అందులో రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు దేవేందర్ సింగ్, అలోక్‌కుమార్, విజయ్‌కుమార్‌లతో పాటు భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు చెందిన విభాగాధిపతి స్థాయి అధికారులు జీసీ రే, ఎస్‌పీ సమంత రే, అదే కేడర్‌కు చెందిన దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు నరోత్తమ్ సింగ్ ఊకే, ఎస్‌కే గుప్త ఉన్నారు. వీరిలో తెలుగువారు ఒక్కరూ లేరు. అంతా ఒరిస్సా, బెంగాల్, ఉత్తర భారతీయులే!
 
 
 విశ్వసనీయ సమాచారం మేరకు కమిటీ సభ్యుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి
 
 ప్రత్యేక రైల్వే జోన్‌పై:
 
 సాధారణంగా రైల్వేజోన్‌కు రాష్ట్రాల భౌగోళిక పరిధులతో సంబంధం ఉండదు. ప్రస్తుత దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర పరిధిలో విస్తరించి ఉంది. దేశవ్యాప్తంగా అన్ని జోన్లు ఇలాగే ఉన్నాయి. రాష్ట్రం విడిపోతే రైల్వే జోన్‌ను విడదీయటం సరికాదు.
 - కొత్త జోన్ పరిధిలో కొత్తగా అధికారుల వ్యవస్థ, భవనాలను సమకూర్చాల్సి ఉంటుంది. దీనివల్ల రైల్వేపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. నష్టాల్లో ఉన్న రైల్వేకు ఇది శ్రేయస్కరం కాదు.
 
 కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై:
 
 - కాజీపేటకు నాలుగేళ్ల క్రితం మంజూరైన వ్యాగన్ వీల్ ఫ్యాక్టరీ పనులు ఇప్పటివరకూ మొదలు కాలేదు. ముందుగా దాన్ని ఓ కొలిక్కి తీసుకువస్తే సరిపోతుంది.
 - కర్ణాటకలో కోలార్ జిల్లాకు కొత్తగా మంజూరైన కోచ్ ఫ్యాక్టరీ పనులు ఇటీవలే మొదలయ్యాయి. ఇప్పటికే తమిళనాడులో కోచ్ ఫ్యాక్టరీ ఉంది. ఇదే సమయంలో దక్షిణాదికి మరో కోచ్ ఫ్యాక్టరీ మంజూరు తప్పుడు సంకేతాలు పంపుతుంది.
 
 పర్యటనలేవీ లేకుండానే..
 
 సాధారణంగా ఇలాంటి కీలక విషయాల్లో కమిటీ సభ్యులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి, సంబంధీకులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ కమిటీ కేవలం ఒకేఒక్కసారి రెండు రాష్ట్రాల సీఎస్‌లతో భేటీ కావటం మినహా అంతకుమించి చేసిన కసరత్తేమీ లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement