‘డబుల్’కు రండి..!
గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం సంక్లిష్టంగా మారింది. లక్షలాది మంది నిరుపేదలుఈ ఇళ్లపై ఆశలు పెంచుకుంటుండగా.. హామీ ఇచ్చిన మేరకు ప్రభుత్వం ఇళ్లు నిర్మించలేక పోతోంది. ఏడాదిలో లక్ష ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించి.. నిర్మాణానికి పూనుకున్నా వీటిపై కాంట్రాక్టర్లు, బిల్డర్లు ఆసక్తిచూపడం లేదు. ఈ నేపథ్యంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి అటు ప్రభుత్వం, ఇటు జీహెచ్‌ఎంసీ నానా తంటాలు పడుతున్నాయి. ముఖ్యంగా రియల్ రంగంలోని నిర్మాణదారులను ఆకట్టుకునేందుకు జీహెచ్‌ఎంసీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మహాక్రతువులో పాలుపంచుకోవాలని, మీ వంతు సహకారం అందించండని సంప్రదింపులు జరుపుతోంది.
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ ధరకు కట్టడం కష్టమనో.. ఇరుకు బస్తీల్లో ఉన్న ఇళ్లను కూల్చివేసి నిర్మించాల్సి ఉండటంతో స్థలం అనువుగా ఉంటుందో లేదో.. ఎన్ని రోజుల్లో స్థలం అందుబాటులోకి వస్తుందోననే అనుమానం ఒకవైపు.. పనులు పూర్తయ్యాక బిల్లులు ఎప్పటికందుతాయోనని కాంట్రాక్టర్లు విముఖత చూపుతున్నారు. దీంతో బడా కాంట్రాక్టర్లు జీహెచ్‌ఎంసీ ‘లోకల్’ కాంట్రాక్టర్లు సైతం వీటి టెండర్లలో పాల్గొనడం లేదు. ఎన్ని మినహాయింపులిచ్చినా స్పందన లేదు. మరోవైపు ప్రతిపక్షాల నుంచి విమర్శల దాడి పెరుగుతోంది. ఐడీహెచ్ కాలనీ తర్వాత ఇంతవరకు ఒక్క చోట కూడా నిర్మాణం జరగలేదు. రాబోయే ఆర్నెళ్లలో కనీసం ఇరవై వేల ఇళ్లయినా నిర్మించాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది. అందుకు జీహెచ్‌ఎంసీని త్వరపెడుతోంది. ఈ నేపథ్యంలో రియల్ రంగంలోని నిర్మాణదారులను ఆకట్టుకునేందుకు జీహెచ్‌ఎంసీ ప్రయత్నిస్తోంది.
రియల్ బిల్డర్లతో సంప్రదింపులు
డబుల్ ఇళ్ల నిర్మాణంలో ఇప్పటికే కాంట్రాక్టు నిబంధనల్లో సడలింపునిచ్చిన జీహెచ్‌ఎంసీ.. తాజాగా రియల్ బిల్డర్లను ఇందులో భాగస్వాముల్ని చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. రియల్ ఎస్టేట్‌రంగంలో భారీ వెంచర్లు చేపట్టే బిల్డర్లతో సంప్రదింపులు చేపట్టింది. లాభాపేక్ష లేకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్సార్)గా వారి వంతుగా కొన్ని ఇళ్లు నిర్మించాలని కోరుతోంది. ఈ అంశంపై ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి వారిని కొంతమేరకు ఒప్పించింది. కనీసం ఆరేడు వేల ఇళ్లయినా నిర్మిచాల్సిందిగా క్రెడాయ్ ప్రతినిధులతో జరిపిన చర్చల్లో కొంత సానుకూలత కనిపించినట్లు తెలుస్తోంది. అయితే తాము నష్టపోకుండా మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించాలని, ఎస్కలేషన్లకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. గృహనిర్మాణంలో ఎస్కలేషన్లు లేవు. వీటిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఈ ఇళ్లకు సంబంధించి సిమెంట్ బస్తా రూ. 230కి అందజేసేందుకు, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి ఇసుక ఉచితంగా సరఫరా చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అయితే స్టీలు ధరలు, ఇసుక రవాణా చార్జీలు కాంట్రాక్టర్లు ఇబ్బందిగానే భావిస్తున్నారు.
అమలుకు నోచని హామీ..
ఏడాదిలో లక్ష ఇళ్లు కడతామన్న ప్రభుత్వం.. ఏడాదిన్నరగా పురోగతి లేదు. 45 ప్రదేశాల్లో 16,578 ఇళ్లకు టెండర్లు పిలవగా, వాటిలో 15 ప్రాంతాల్లో 9,668 ఇళ్లకు మాత్రమే టెండర్లు ఖరారయ్యాయి. వాటిల్లోనూ రెండు చోట్ల మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రియల్ రంగంలోని వారిని ఇందుకు సహకరించాల్సిందిగా జీహెచ్‌ఎంసీ అధికారులు కోరుతున్నారు. అయితే పెద్ద వెంచర్లలో, ఖాళీ స్థలాల్లో నిర్మాణఅనుభవమున్న వారు తక్కువ స్థలంలో ఎక్కువ అంతస్తుల్లో నిర్మించేందుకు సంకోచిస్తున్నారు. అన్నీచేశాక నష్టపోతామేమోననే అనుమానాలున్నాయి. నిర్మాణ వ్యయం మూడంతస్తుల్లో నిర్మించేవాటికి చదరపు అడుగుకు రూ.1250 చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించగా, వారు కనీసం రూ. 1400 అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారు ఎన్ని ఇళ్లు కడతారో వేచి చూడాల్సి ఉంది.
ఇదీ ‘డబుల్’ చిత్రం..
పరిపాలన అనుమతుల మంజూరు 50 ప్రాంతాల్లో: 20,569 ఇళ్లు.
అంచనా వ్యయం : రూ. 1727.80 కోట్లు.
వివిధ కారణాలతో 5 ప్రాంతాల్లో ఉపసంహరించుకున్నారు.
45 ప్రాంతాల్లో 16,570 ఇళ్లు. అంచనా వ్యయం రూ. 1391.36 కోట్లు.
45 ప్రాంతాలకు టెండర్లు ఆహ్వానించినప్పటికీ, 15 ప్రాంతాల్లో 9668 ఇళ్లకే టెండర్లు పూర్తయ్యాయి. అంచనా వ్యయం రూ. 821.39 కోట్లు.
వీటిల్లో 5 ప్రదేశాల్లో 1484 ఇళ్లకు మాత్రం అగ్రిమెంట్ పూర్తయింది.
వీటి విలువ రూ. 120.12 కోట్లు.
lవీటిల్లో.. జంగమ్మెట్‌లో 288, సయ్యద్‌సాబ్‌కాబాడాలో 48, బండమైసమ్మనగర్‌లో 540, ఎరుకల నాంచారమ్మబస్తీలో 432, సింగంచెరువుతండాలో 176 ఇళ్లు నిర్మించనున్నారు.