పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
సాక్షి ప్రతినిధి, వరంగల్ : రానున్న 150 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని వరంగల్ నగర మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తున్నారు. రీజనల్ రింగు రోడ్డు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎకోటూరిజం, శాటిలైట్ టౌన్‌షిప్పులు నిర్మించనున్నారు. వరంగల్ మహా నగర మాస్టర్‌ప్లాన్ ముసాయిదా రూపకల్పనపై కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్‌అథారిటీ (కుడా) కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. ఈ సమావేశంలో ‘కుడా’ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మేయర్ నన్నపునేని నరేందర్, రాజ్యసభç సÜభ్యుడు బండా ప్రకాష్, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, తాటికొండ రాజయ్య, అరూరి రమేష్, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ అరవింద్‌కుమార్, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్లు అమ్రపాలి, హరితతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. లీ కన్సల్టెన్సీ రూపొందించిన డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ వివరాలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గౌతమ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌పై సుదీర్ఘంగా చర్చించారు. చివరగా రాష్ట్ర పురపాలక కార్యదర్శి అరవింద్‌కుమార్ మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, అధికారుల అభిప్రాయాలు, సలహాలను తీసుకుని డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు తుది రూపం ఇస్తామన్నారు. అనంతరం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసి 90 రోజుల పాటు ప్రజల అభిప్రాయాలు స్వీకరిస్తామని చెప్పారు. వాటిని పరిశీలించి తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వివరించారు.
కొత్తగా రీజనల్ రింగురోడ్డు
మాస్టర్‌ప్లాన్‌లో కొత్తగా రీజనల్ రింగురోడ్డును ప్రతిపాదించారు. ఇప్పటికే ఇన్నర్‌రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డులు ఉన్నాయి. రానున్న 150 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రీజనల్ రింగురోడ్డుకు పచ్చజెండా ఊపారు. ప్రస్తుతం ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్డుకు చుట్టూ స్టేషన్‌ఘన్‌పూర్– వర్ధన్నపేట–సంగెం–గీసుకొండ–ఆత్మకూరు–ఎల్కతుర్తి –వేలేరు, చెల్పూరు–స్టేషన్‌ఘన్‌పూర్ వరకు రీజనల్ రింగురోడ్డు ఉంటుంది. ఈ రోడ్డును 132 కిలోమీటర్ల నిడివితో రానున్న పదేళ్లలో నిర్మించాలని మాస్టర్‌ప్లాన్ ముసాయిదాలో చేర్చారు. మొత్తం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది. ఔటర్ రింగురోడ్డు , రీజనల్ రింగ్ రోడ్డుల మధ్య ఉన్న ప్రదేశాల్లో పరిశ్రమలు, ఐటీ పార్కులు, విద్యాసంస్థలు నెలకొల్పేలా రూపకల్పన చేశారు. ఈ రెండు రోడ్ల మధ్యలో ఐదు వందల నుంచి రెండు వేల ఎకరాల వరకు స్థలాన్ని సేకరించి శాటిలైట్ టౌన్‌షిప్‌లను ‘కుడా’ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్నారు.
ఆరు ఆదర్శ రహదారులు
నగరానికి లైఫ్‌లైన్‌గా ఉన్న 163 జాతీయ రహదారిలో పెద్ద పెండ్యాల నుంచి ధర్మారం వరకు మొత్తం 36 కిలోమీరట్ల రోడ్డును మోడల్ రహదారిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు ఫాతిమానగర్ – కేయూసీ, ములుగురోడ్డు–పెద్దమ్మగడ్డ– కేయూసీ, డీఈఓ కార్యాలయం నుంచి హంటర్ రోడ్డు – నాయుడు పెట్రోల్ పంప్ వరకు, నాయుడు పెట్రోల్ పంపు నుంచి వయా ఖిలావరంగల్ – బస్టాండ్ – వెంకట్రామ థియేటర్, పోచమ్మమైదాన్ – సీకేఎం కళాశాల – ఆరేపల్లి వరకు, లేబర్‌కాలనీ నుంచి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ వరకు గల ప్రధాన రహదారులను మోడల్ రోడ్లుగా అభివృద్ధి చేస్తారు. ఇందులో భాగంగా ఇరువైపులా డ్రెయినేజీ, ఫుట్‌పాత్, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, గ్రీనరీని పెంచుతారు. దీంతో పాటు కనీసం పది ట్రాఫిక్ జంక్షన్లను విస్తరించి అభివృద్ధి చేయాలని ముసాయిదాలో పొందుపరిచారు.
స్పోర్ట్స్ కాంప్లెక్స్..
ధర్మసాగర్ మండలం ఎలుకుర్తి గ్రామం వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించాలని ముసాయిదాలో ప్రతిపాదించారు. ఇక్కడ సుమారు 200కు పైగా ఎకరాలను గుర్తించారు. ఇప్పటికే ఇక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేశారు. సైనిక పాఠశాలకు ఇక్కడ స్థలాన్ని కేటాయించారు. ఈ రెండు విద్యాసంస్థలకు కేటాయించిన స్థలాన్ని మినహాయిస్తే ఇంకా 120 ఎకరాల స్థలం అందుబాటులో ఉంటుంది. ఇందులో సకల సౌకర్యాలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో స్పోర్ట్స్ హాస్టల్, ఇండోర్ స్టేడియం, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంటాయి. జాతీయ రహదారికి పక్కన ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడం పలురకాలుగా ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేవనూర్, ముప్పారం గ్రామాల మధ్య థీం పార్కు ఏర్పాటు చేయలాలని నిర్ణయించారు. దేవనూర్ ఇనుపరాతి గుట్టల్లో గ్రీనరీ మరింతగా పెంచి ఎకో టూరిజానికి అనువుగా మార్చాలని ప్రతిపాదించారు. దీని పక్కనే ఉన్న ధర్మసాగర్ చెరువును అనుసంధానం చేసుకుని రిక్రియేషన్ జోన్‌గా అభివృద్ధి చేయాలని సూచించారు. నగరంలోని చెరువుల సంరక్షణకు ఎఫ్‌టీఎల్ నిర్ధారించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. భæద్రకాళి, వడ్డేపల్లి, చిన్నవడ్డేపల్లి, ఉర్సు చెరువులను సమగ్రంగా అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రణాళికలో రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment