ఫ్యాకల్టీ భర్తీకి చట్ట సవరణ చేయాల్సిందే | Replacement of the Faculty of Law must be revised | Sakshi
Sakshi News home page

ఫ్యాకల్టీ భర్తీకి చట్ట సవరణ చేయాల్సిందే

Published Fri, Oct 21 2016 2:35 AM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM

ఫ్యాకల్టీ భర్తీకి చట్ట సవరణ చేయాల్సిందే

ఫ్యాకల్టీ భర్తీకి చట్ట సవరణ చేయాల్సిందే


అప్పుడే టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీకి మార్గం సుగమం
మార్పులపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీ అధ్యాపక పోస్టుల భర్తీలో చోటుచేసుకుంటున్న అక్రమాలకు చెక్ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ వర్సిటీల పోస్టుల భర్తీలో గతంలో అనేక అక్రమాలు జరిగినట్లు, వైస్ చాన్స్‌లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. త్వరలో రాష్ట్రంలోని వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,504 అధ్యాపక పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అక్రమాలకు తావులేని విధానాన్ని తీసుకురావాలని భావి స్తోంది. ఇందులో భాగంగా స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థతో వర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలను చేపట్టాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.

దీనిలో భాగంగా టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నియామకాలను చేపట్టేందుకు చర్యలు చేపడుతోంది. అయితే స్వయంప్రతిపత్తి కలిగిన వర్సిటీలు సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాయా? టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీకి అంగీకరిస్తాయా? అన్నది ప్రస్తుతం చర్చనీయాంశమయ్యింది. వేతనాలు చెల్లిస్తున్నది ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదని, పైగా అక్రమాలకు తావులేకుండా టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ విధానం తెస్తున్నందునా వ్యతిరేకించే పరి స్థితి లేదని అధ్యాపక వర్గాలే పేర్కొంటున్నాయి.

కాలయాపనకు చెక్
ప్రస్తుతం వర్సిటీ  వీసీ చైర్మన్‌గా ఉండే రిక్రూట్‌మెంట్ బోర్డు చేపడుతున్న నియామకాల ప్రక్రియ నెలల తరబడి కొనసాగుతోంది. దీంతో సమయానికి అధ్యాపక పోస్టులను భర్తీ చేయలేని పరిస్థితి నెలకొంది. దీనికితోడు ఆశ్రీత పక్షపాతం, అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.  అలాంటి వాటన్నింటికి చెక్ పెట్టేందుకు కసరత్తు చేస్తోంది.
 
చట్ట సవరణతోనే సాధ్యం
ప్రస్తుతం ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో చట్టం ఉంది. వాటిల్లో నియామకాల అధికారం వీసీ చైర్మన్‌గా ఉండే రిక్రూట్‌మెంట్ బోర్డుకే ఉంది. ప్రస్తుతం ఆ నిబంధనను సవరించాల్సి ఉంది. రిక్రూట్‌మెంట్ బోర్డు స్థానంలో టీఎస్‌పీఎస్సీనే నియామక అథారిటీ అనేది చేర్చితేనే టీఎస్‌పీఎస్సీ ద్వారా ఫ్యాకల్టీ భర్తీ సాధ్యం అవుతుంది. లేదంటే కష్టమే. ఈ నేపథ్యంలో అన్ని యూనివర్సిటీల చట్టాలకు సవరణ చేయాలా? అన్నది ఆలోచిస్తోంది. మరోవైపు ఎలాగూ అన్ని వర్సిటీలకు కలిపి కామన్ యూనివర్సిటీ యాక్ట్ తెచ్చేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అందులోనే మార్పులు చేసి టీఎస్‌పీఎస్సీ ద్వారా పోస్టులను భర్తీ చేయాలా? అన్న ఆలోచనలు చేస్తోంది.

ఏదేమైనా త్వరలోనే దీనిపై ఓ నిర్ణయాన్ని ప్రకటించేందుకు సిద్ధం అవుతోంది. ఖాళీ పోస్టులకు సంబంధించి యూనివర్సిటీల నుంచి ఇండెంట్లు వచ్చేలోగా నిర్ణయాన్ని ఖరారు చేసేందుకు సిద్ధం అవుతోంది. మరోవైపు ఉన్నత విద్యలో సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం నియమించిన సుబ్రహ్మణ్యన్ కమిటీ కూడా నియామకాల్లో అవినీతి ఆరోపణల నేపథ్యంలో స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థతోనే నియామకాలు చేపట్టాలని సిఫారసు చేసినట్లు యూనివర్సిటీల అధ్యాపకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దానిని కూడా పరిశీలించి పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement