ఇండియా జాయ్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానిస్తున్న నిర్వాహకులు
సాక్షి, హైదరాబాద్: యానిమేషన్, గేమింగ్, వీఎఫ్‌ఎక్స్, డిజిటల్ వినోదం రంగాల్లో దూసుకుపోతున్న రాష్ట్రానికి ‘ఇండియా జాయ్–2019’వేడుక మరింత ఊతమిస్తుందని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. డిజిటల్ మీడియా, వినోదం రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన పలు సంస్థలు పాల్గొనే ఈ వేడుక నిర్వహణకు సంబంధించి ఇండియా జాయ్ ప్రతినిధులు సోమవారం కేటీఆర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వెయ్యికిపైగా అంతర్జాతీయ బృందాలు హాజరవుతున్నాయని తెలిపారు. డిజిటల్ వినోదానికి సంబంధించిన 9 అంశాలపై సదస్సులు జరుగుతా యన్నారు. భారత మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీలకు ప్రపంచస్థాయి గుర్తింపు దక్కేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. కార్యక్రమంలో గేమింగ్, వినోదం తదితర రంగాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ‘ఇమేజ్ టవర్స్’కు ప్రచారం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. టర్నర్ ఇంటర్నేషనల్, వయాకామ్ 18, సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్, డిస్కవరీ కమ్యూనికేషన్స్, షెమారూ వంటి ప్రముఖ సంస్థలు ఈ వేడుకలో పాల్గొంటాయి. కేటీఆర్‌ను కలసిన వారిలో పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఇండియా జాయ్ ప్రతినిధి రాజీవ్ చిలక తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment