రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలి | revant control your mouth says balka suman | Sakshi
Sakshi News home page

రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలి

Published Wed, Sep 3 2014 11:53 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM

revant control your mouth says balka suman

సాక్షి, సంగారెడ్డి: టీడీపీ నేత, ఎమ్మెల్యే  రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని కేసీఆర్‌ను అదేపనిగా విమర్శిస్తే సహించేదిలేదని పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్ హెచ్చరించారు. బుధవారం సంగారెడ్డిలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ నేతలు సీఎం కేసీఆర్‌పై అవాకులు చవాకులు పేలటం మానుకోవాలని సూచించారు.

ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ముఖ్యనేతలు హుందాగా వ్యవహరించాలన్నా రు. బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డిపై గతంలో ఉన్న అమీన్‌పూర్ భూ కుంభకోణంపై విచారణ జరిపించి దోషులను శిక్షించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ మెజార్టీతో గెలుపొందటం ఖాయమన్నారు. రాష్ట్రంలో కరెంటు సమస్యలకు కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ పార్టీలే కారణమ ని ఆరోపించారు. త్వరలో కరెంటు సమస్యలు పరిష్కారమవుతాయన్నారు.

మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి మాట్లాడుతూ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సీఎం కేసీఆర్ రైతుల పంటరుణాలు మాఫీ చేశారన్నారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ  మాట్లాడుతూ బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డికి పాస్‌పోర్టు కుంభకోణంలో ప్రమేయమున్నట్లు ఆరోపణలు వచ్చాయని, దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సంగారెడ్డిలో మెదక్ పార్లమెంట్‌ను అభివృద్ధి చేస్తానని జగ్గారెడ్డి చెప్పటం హాస్యాస్పదమన్నారు. విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు జలాలుద్దీన్‌బాబా, కసిని విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 సమైక్యాంధ్ర పాలనలో రెట్టింపైన సమస్యలు
 సదాశివపేట: సమైక్యాంధ్ర హయాంలో తెలంగాణ ప్రాంత ప్రజలకు సమస్యలు రెట్టింపయ్యాయని టీఆర్‌ఎస్ ఎంపీలు, బాల్క సుమన్, బీబీపాటిల్ పేర్కొన్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో పట్టణంలోని బసవ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పట్టణ, మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సొంత జిల్లాలోని మెదక్ లోక్‌సభకు జరుగుతున్న ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవలేని  కాంగ్రెస్, బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థులకు ఈ ఎన్నికలో గుణపాఠం చెప్పాలన్నారు. ప్రతి టీఆర్‌ఎస్ కార్యకర్త సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతగా పనిచేయాలన్నారు. సమైక్య వాదిగా ముద్రపడిన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి బీజేపీ పిలిచి ఎంపీ టికెట్ ఇవ్వడం సిగ్గుచేటన్నారు. అధికారంలో ఉన్న సీమాంధ్ర  ముఖ్య మంత్రులకు వంతపాడి తెలంగాణ ద్రోహిగా ముద్రపడిన జగ్గారెడ్డికి టికెట్ ఇవ్వడం చూస్తుంటే బీజేపీ సమైక్యవాద పార్టీ అనుకోవాలా, ఆంధ్ర సీఎం చంద్రబాబు చెప్పు చేతల్లో ఉన్న పార్టీ  అనుకోవాలా అని ప్రశ్నించారు.

ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలిపి తెలంగాణలో  గవర్నర్ పెత్తనం  తీసుకువచ్చిన బీజేపీని నిలదీయాలన్నారు.   65 సంవత్సరాల సీమాంధ్ర పాలనలోని పాపాలను కడిగివేయడానికి సీఎం కేసీఆర్‌కు దాదాపు 20 ఏళ్లు పడుతుందని సుమన్ పేర్కొన్నారు. సంగారెడ్డిలో అభివృద్ధి జరిగిందని జగ్గారెడ్డి ఆధారాలతో నిరూపించాలని  సవాల్ విసిరారు. ఎంపీ ఆభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ఎంపీపీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, మాజీ ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.

ఉప ఎన్నికలో సమన్వయకర్తలుగా వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు కార్యకర్తలుగా టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించడానికి వచ్చారే తప్ప  అజమాయిషీ చేసేందుకు రాలేదన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజయ్య, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సంజీవరావు, బాల్‌రాజ్, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి, రత్నం, మున్సిపల్ చైర్ పర్సన్ పట్నం విజయలక్ష్మి, ఎంపీపీ కోడూరి రవీందర్ యాదవ్, బీసీ కార్పొరేషన్ మాజీ డైరక్టర్ పట్నం సుభాష్, మంజీర రైతు సమాఖ్య జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్, టీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement