నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరేది
టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి శుక్రవారం రాసిన బహిరంగలేఖలో ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తిచేయడానికి కావాల్సిన రూ.1000 కోట్లు తక్షణమే విడుదల చేయాలన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకోసం మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దుచేసుకోవాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రకు చెందిన 1800 ఎకరాల భూకేటాయింపు సాధనకోసం ప్రధానమంత్రి వద్దకు అఖిలపక్షాన్ని తీసుకువెళ్లాలని కోరారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో భారీగా అంచనాలను పెంచుకున్నారని, వాటిని నిలిపేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల విజ్ఞప్తులను, పోరాటాలను పట్టించుకోకుండా కాంట్రాక్టర్లకు మేలుచేసే నిర్ణయాలను ఆపకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలను చేపడ్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.