భూములను మైహోమ్స్‌కు ఇవ్వడంతోనే వివాదం: రేవంత్
భూములను మైహోమ్స్‌కు ఇవ్వడంతోనే వివాదం: రేవంత్
Published Thu, Sep 18 2014 2:40 AM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలుకు గచ్చిబౌలిలో కేటాయించిన 32 ఎకరాల విలువైన భూమిని సీఎం కేసీఆర్ తన ప్రయోజనాల కోసం మైహోమ్స్ రామేశ్వర్‌రావుకు ధారాదత్తం చేయడం వల్లనే వివాదం ఏర్పడిందని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి తెలిపారు. గచ్చిబౌలి స్థలానికి బదులుగా నాగోల్‌లోనే భూమి ఇచ్చేందుకు ఎల్ అండ్‌టీకి ఆఫర్ ఇచ్చారని పేర్కొన్నారు. ఇదేమని ప్రశ్నించిన ఎల్‌అండ్‌టీని లక్డీకాపూల్ నుంచి అసెంబ్లీ వరకు, సుల్తాన్‌బజార్ అలైన్‌మెంట్ మార్చాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అలైన్‌మెంట్ మార్చకూడదంటే గచ్చిబౌలి స్థలాన్ని వదులుకోవాలని బ్లాక్‌మెయిల్ చేశారని ఆరోపించారు. దీంతో ఎల్‌అండ్‌టీ మెట్రోరైలు ప్రాజెక్టు నుంచి వైదొలిగేందుకు సిద్ధమైందని రేవంత్ తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన మెట్రోరైలు ప్రాజెక్టుపై టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం మెట్రోరైలు ప్రాజెక్టును ఉపయోగించుకోవాలని టీఆర్‌ఎస్ నేతలు భావించారని, ఎల్‌అండ్‌టీ ఎదురుతిరగడంతో కాళ్లబేరానికి వస్తున్నారని ధ్వజమెత్తారు.
Advertisement