సాక్షి, హైదరాబాద్: ఓల్డ్ సిటీ అంటే పాత నగరం కాదని.. ఇదే అసలైన హైదరాబాద్ నగరమని.. దీనిని పూర్థిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం ఫలక్‌నుమాలోని ఫరూక్‌నగర్ దగ్గర పాత బస్తీ మెట్రో లైన్ పనులకు భూమి పూజ చేసి ఆయన మాట్లాడారు.
‘‘ఇది ఓల్డ్ సిటీ కాదు..ఇదే ఒరిజినల్ సిటీ. అసలైన నగరాన్ని పూర్థిస్తాయిలో అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించాం. అలాగే.. మూసీ పరివాహక ప్రాంతం అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం. ఇందు కోసమే లండన్ నగరాన్ని ఇక్కడి ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో కలిసి పరిశీలించాం. హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ విషయంలో ఎంఐఎంతో కలిసి పనిచేస్తాం. ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయాలు. మిగతా సమయాల్లో అభివృద్ధికే ప్రాధాన్యమిస్తాం’’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కి.మీ మేర మెట్రో ప్రాజెక్టు విస్తరణకు తాజాగా సీఎం రేవంత్ ఆయన శంకుస్థాపన చేశారు. వీలైనంత త్వరగా ఈ మెట్రో రూట్‌ను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం చూస్తోంది.
ఇంకా ఆయన ఏమన్నారంటే..
- హైదరాబాద్ అభివృద్ధికి 2050 వైబ్రంట్ మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం.
- పాతబస్తీలో రోడ్ల విస్తరణకు రూ.200 కోట్లు కేటాయించాం.
- మూసీ నదిని 55 కి.మీ మేర సుందరీకరిస్తాం.
- మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేసి చూపిస్తాం.
- మెట్రో రైలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌కే కాదు పాతబస్తీకి ఉండాలి. అందులో సంపన్నులే కాదు మధ్యతరగతి ప్రజలూ ప్రయాణించాలి.
- చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ మెట్రోలో అతిపెద్ద జంక్షన్ కాబోతోంది.
- చంచల్‌గూడ జైలును అక్కడి నుంచి తరలించి.. విద్యాసంస్థ ఏర్పాటు చేస్తాం.
- రాజకీయాలు వేరు అభివృద్ధి వేరు.
- 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది.
- వచ్చే నాలుగేళ్లలో పాతబస్తీ మెట్రో రైలు పూర్తి చేసి ప్రయాణిస్తాం.
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌కు గుండెలాంటి పాతబస్తీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తారని ఆశిస్తున్నాం. మీ చేతుల్లో ఐదేళ్లు అధికారం ఉంటుంది. అభివృద్ధికి మేం సహకరిస్తాం. రేవంత్‌రెడ్డి చాలా పట్టుదలతో ఈ స్థాయికి వచ్చారు. తెలంగాణలో ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. కొన్ని శక్తులు విధ్వంసానికి కుట్రలు పన్నుతున్నాయి.. వాటిని అడ్డుకోవాలి. రాష్ట్రాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లాలి. పాతబస్తీలో అభివృద్ధి పనుల కోసం సీఎంను కలవగానే రూ.120 కోట్లు విడుదల చేశారు. మూసీ నది అభివృద్ధికి మా పార్టీ సహకరిస్తుంది’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment